కాలం వెంట వెళ్లను...కాలం నా వెంటే రావాలి!
- బాలకృష్ణ
‘‘బిడ్డను అనాథను చేసినట్లుగా రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారు. ఎంతో చరిత్ర ఉన్న అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపిక చేయడం ఆనందం. బుద్ధుడు నడయాడిన భూమి ఇది. మా నాన్నగారు నందమూరి తారక రామారావుగారు రాజకీయ చరిత్రను తిరగ రాశారు. తెలుగు జాతికి గర్వకారణం అమరావతి’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈరోస్ ఎంటర్ టైన్‌మెంట్స్‌తో కలసి వేదాశ్వ క్రియేషన్స్ పతాకంపై తొలిసారి శ్రీవాస్ నిర్మాతగా మారి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డిక్టేటర్’. బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి తమన్ పాటలు స్వరపరిచారు.
ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగింది. ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆడియో సీడిని ఆవిష్కరించి, బాలకృష్ణకు ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ - ‘‘నేనెప్పుడూ కాలం వెంట వెళ్లను. కాలం నా వెంట రావాల్సిందే. నా స్వభావానికి తగ్గ టైటిల్ ‘డిక్టేటర్’. ఒక్కోసారి మంచి మార్పు తీసుకు రావాలంటే జులుం తప్పదు. ఈ చిత్రకథాంశం ఇదే. శ్రీవాస్ నాలానే ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. తమన్ మంచి పాటలిచ్చారు’’ అంటూ ‘సింహం కూడా దాహం వేస్తే తలదించుకుని నీళ్లు తాగుతుంది. అంత మాత్రాన తలదించినట్లు కాదు.
కొట్టడానికి తొడా ఉండదు... ఎత్తడానికి తలా ఉండదు’ అని సినిమాలోని డైలాగ్ చెప్పారు. ఇది ఓ అభిమాని పంపించిన డైలాగ్ అని బాలకృష్ణ చెప్పారు. ఏమీ ఆశించికుండా అభిమానులు ఆదరిస్తున్న తీరు చాలా ఆనందంగా ఉందనీ, నాడు తన తండ్రి పార్టీ పెట్టినప్పుడు అభిమానులే అండగా నిలిచారనీ బాలకృష్ణ అన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికీ, పార్టీకి అభిమానులు అండగా నిలుస్తున్నారనీ, వాళ్లకు ఇప్పటికే కావాల్సినవి చేశాననీ, మున్ముందు ఇంకా చేస్తానని ఆయన అన్నారు. నాన్నగారి అభిమానులే కాకుండా భవిష్యతులో పార్టీ పరంగా నా అభిమానులు కూడా ముందుంటారని ఆశిస్తున్నానని బాలకృష్ణ అన్నారు.
పదవులు ఎప్పుడూ మనకు అలంకారం కాకూడదనీ, మనమే పదవులకు అలంకారం కావాలని కూడా అన్నారు. శ్రీవాస్ మాట్లాడుతూ - ‘‘98 చిత్రాల్లో ఎన్నో పాత్రలు చేసిన బాలయ్యగారిని 99వ చిత్రంలో ఎలాంటి పాత్రలో చూపిస్తే బాగుంటుందా? అని రచయితలు గోపీ-కోనవెంకట్ , శ్రీధర్ సీపాన, ఎమ్.రత్నంలతో కలిసి బాగా డిస్కస్ చేసి, ఈ కథ తయారు చేశాం. బాలయ్యగారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని చాలామంది చెప్పారు. ఆయనకు నిజాయతీగా ఉంటే నచ్చుతుంది. ఆయనతో నేను సినిమా చేయాలన్న మా నాన్నగారి కోరిక నెరవేరినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.
తమన్ మట్లాడుతూ- ‘‘నేను బాలయ్యగారి ‘భైరవద్వీపం’ సినిమాలోని ఓ సన్నివేశానికి ఆర్‌ఆర్ ఇచ్చాను. అందుకుగాను నేను తీసుకున్న జీతం 30 రూపాయలు. నా తొలి సంపాదన ఆయన సినిమాతోనే స్టార్ట్ అయింది’’ అని చెప్పారు. నిర్మాతలు అంబికా కృష్ణ, సాయి కొర్రపాటి, అనిల్ సుంకర, రామ్ ఆచంట, కథానాయికలు అంజలి, సోనాల్ చౌహాన్, ఈరోస్ వైస్ ప్రెసిడెంట్ చింటు, గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్‌బాబు తదితర రాజకీయ రంగ, చిత్రరంగ ప్రముఖులు పాల్గొన్నారు.