దక్షిణ భారత సినీ స్టంట్ దర్శకుల సంఘానికి చెందిన ఇద్దరు స్టంట్ దర్శకుల సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు వెల్లడించారు. వివరాలు.. దక్షిణ భారత సినీ స్టంట్ దర్శకుల సంఘం కార్యాలయం స్థానిక వడపళనిలో ఉంది. ఈ సంఘంలో 650 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఘానికి సుప్రీం సుందర్ అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఈ సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్న ఎంఏఈ.అన్బుమణి, ఎంఎం.అరివుమణి సంఘ నిబంధనలకు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కారణంగా వారిద్దరి సంఘం నుంచి తొలగిస్తున్నట్లు వారి సభ్యుత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు సోమవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
దీని గురించి సంఘం అధ్యక్షుడు సుప్రీంసుందర్ తెలుపుతూ అన్బుమణి, అరివుమణి శిక్షణ పేరుతో నటులను ప్రాణాపాయంతో కూడిన రోప్ షాట్స్ చేయిస్తున్నారని, ఈ విషయమై ఆరోపణలు రావడంతో గత నెల 9న జరిగిన సంఘ సమావేశంలో వారిద్దరిని పిలిచి వివరణ కోరినట్లు తెలిపారు. దీంతో సంఘ సభ్యులపై బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు.
కాగా గత 18న సమావేశంలో చర్చించి అన్బుమణి, అరివుమణిలను సంఘం నుంచి శాశ్వతంగా తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే వారు ఈ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించారని, దీంతో తాము న్యాయవాది ద్వారా వారికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో ఉన్నట్లు సుప్రీంసుందర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment