సనత్‌నగర్: కనిపించే శత్రువుతో యుద్ధం చేయడానికి ముందుగా అవసరమైన ఆయుధాలన్నింటినీ సమకూర్చుకుంటాం. మరి కనిపించని శత్రువు కరోనాతో యుద్ధం చేయడానికి ఏం చేయాలి. పౌష్టికాహారంతో ఇమ్యూనిటీ పెంచుకోవడమే కరోనాపై యుద్ధానికి సరైన ఆయుధం అంటారు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్. బండ్ల గణేష్‌కు కరోనా వచ్చిందంట కదా? అనేది ముఖ్యం కాదు. జాగ్రత్తలతో మసులుకోవాలి. 14 రోజుల పాటు బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా హోం క్వారంటైన్‌లోకి వెళ్లి కరోనాను జయించిన బండ్ల గణేష్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...
సాక్షి: కరోనాను ముందుగా ఎలా గుర్తించారు..? లక్షణాలు ఏమైనా కనిపించాయా?
బండ్ల గణేష్: కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు నాలో లేవు. ఒక రోజు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు జూబ్లీహిల్స్‌లోని ఓ క్లినిక్‌కు వెళ్లాను. అక్కడ డాక్టర్ కరోనా టెస్ట్ చేయించుకోండని సలహా ఇచ్చారు. దాంతో టెస్ట్ చేయించుకున్నాను. రెండు రోజుల తర్వాత కరోనా పాజిటివ్ అంటూ ఫోన్‌లో సమాచారం. అంతే కంగుతిన్నాను.
సాక్షి:కరోనా పాజిటివ్ అని తెలియగానే ఎలా రియాక్ట్ అయ్యారు?
బండ్ల గణేష్: ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. నేను ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను కదా? అనిపించింది. కరోనాపై టీవీల్లో ప్రసారమయ్యే కథనాలు చూస్తుండేవాణ్ణి. దీంతో భయమేసింది. నన్ను కరోనా నుంచి బయట పడేయమని ఆ భగవంతుణ్ణి వేడుకున్నాను.
సాక్షి: కరోనాకు ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు?
బండ్ల గణేష్: కరోనా అని తెలియగానే ఇంటి పైగదిలో హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాను. తెలిసిన డాక్టర్ల సలహా తీసుకుని ఆ మేరకు మందులు వాడాను. ఉదయం, సాయంత్రం గుడ్లు తినేవాణ్ణి. వేడి నీటిని పుక్కిలించేవాణ్ణి. ఆవిరి పట్టుకునేవాణ్ణి. బ్రీథింగ్ వ్యాయామాలు బాగా చేశాను. విటమిన్ టాబ్లెట్స్ వేసుకున్నాను. విడిచిన దుస్తులు కూడా వేడి నీటిలో వేసి పంపించేవాణ్ణి. మొత్తం మీద నా గదిని మెడిటేషన్ రూమ్‌గా మార్చేశాను. 14 రోజుల పాటు గది నుంచి బయటకు రాలేదు.
సాక్షి:కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యేవారు?
బండ్ల గణేష్: నా వద్దకు రాకపోయినా అవసరాలన్నింటినీ సమకూర్చేవారు.
సాక్షి:కరోనా మీలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందంటారు?
బండ్ల గణేష్:మనిషి దేనికీ అతీతం కాదు. కరోనా సోకడంతో ఎంతో బాధపడ్డాను. బతికినంతకాలం గొడవలు, వివాదాలు లేకుండా ఎంత మంచిగా బతికామన్నదే ముఖ్యం. అదే శాశ్వతం.
సాక్షి: కరోనా విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి?
బండ్ల గణేష్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య మంత్రులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇది ఊహించని విపత్తు. ప్రభుత్వాలు కరోనా కట్టడికి వ్యూహాలన్నీ అమలు చేస్తున్నాయి.
సాక్షి: కరోనా విషయంలో ప్రతిపక్షాల విమర్శలను ఎలా తీసుకుంటారు?
బండ్ల గణేష్:కరోనా అనేది ప్రపంచ విపత్తు. ఈ సమయంలో విమర్శలు సరికాదు. అందరూ కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని అంతం చేయవచ్చు.
సాక్షి:కరోనాను జయించిన వ్యక్తిగా కరోనాతో పోరాడున్న వారికి ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధమా?
బండ్ల గణేష్: ప్లాస్మా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా వల్ల ఒకరి ప్రాణాలు నిలబడతాయంటే అంతకంటే భాగ్యం మరొకటి ఉంటుందా.
సాక్షి:కరోనా సోకిన వారికి ఎలాంటి సందేశం ఇస్తారు?
బండ్ల గణేష్:కరోనా సోకిన వారు ధైర్యంగా ఉండాలి. ఇమ్యూనిటీ పెంచుకోవాలి. వైద్యులు సూచించిన విధంగా మందులు, విటమిన్ ట్యాబెట్లు, మెడిటేషన్, ఆహార నియమాలను పాటించాలి. కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలి.
సాక్షి:కరోనా దృష్ట్యా సినిమా రంగం ఎలా ఉండబోతుంది?
బండ్ల గణేష్: కరోనా పోయాక ప్రజలు ఆటోమేటిక్‌గా థియేటర్ల వైపు వస్తారు. సినిమా రంగానికి మళ్లీ మామూలు రోజులు తప్పక వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment