బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా కష్టపడాల్సిందే | Bellamkonda Sai Srinivas And Anupama Interview About Rakshasudu | Sakshi
Sakshi News home page

బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా కష్టపడాల్సిందే

Published Fri, Aug 2 2019 12:29 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Bellamkonda Sai Srinivas And Anupama Interview About Rakshasudu - Sakshi

బెల్లంకొండ సాయి శ్రీనివాస్

‘‘నేనెప్పుడూ కథని నమ్ముతా.. హీరోయిజాన్ని కాదు. నా తొలి, మలి సినిమాలు ‘అల్లుడు శీను, స్పీడున్నోడు’ హీరోయిజం కోసం చేశాను. ఆ తర్వాత కథకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తున్నా. అవి సరిగ్గా ఆడినా, ఆడకున్నా ఆయా పాత్రల్లో నా కష్టం మాత్రం 100 శాతం ఉంటుంది. ప్రతిదీ నా తొలి సినిమాలానే భావిస్తా’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ అన్నారు. రమేష్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అభిషేక్‌ నామా విడుదల చేస్తున్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చెప్పిన విశేషాలు.

► ‘రాక్షసన్‌’ తమిళ సినిమా చూశా. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ కావడంతో చాలా బాగా నచ్చింది. కిడ్నాప్‌ లాంటి సంఘటనలు సమాజంలో ఎన్నో జరుగుతుండటం పేపర్లలో, టీవీల్లో చూస్తున్నాం. అందుకే ఈ చిత్రాన్ని మనసు పెట్టి చేశా. బయట శవాల మధ్య, మార్చురీలో ఎక్కువ షూటింగ్‌ చేశాం. చిత్రీకరణ తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ ఉండేవి.

► టీనేజ్‌ అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి దారుణంగా హతమార్చే సైకో కిల్లర్‌ని పట్టుకుని, హత మార్చే పోలీసు అధికారి పాత్రలో నటించాను. 2018 డిసెంబరులోనే తమిళ సినిమా ‘రాక్షసన్‌’ చూశా.. విపరీతంగా నచ్చడంతో రీమేక్‌ హక్కుల కోసం రెండు నెలలు ప్రయత్నించాం. మనకు తెలిసిన, మనతో ఉన్న అమ్మాయిలకు ఏమైనా జరిగితే తట్టుకోలేం. అలాంటి పాయింట్‌నే ఈ సినిమాలో చర్చించాం. నా మరదలు పాత్ర చేసిన సిరి కిడ్నాప్‌కి గురై చనిపోతుంది. సినిమాలో రెండవ భాగం మొత్తం నా పాత్ర చాలా సీరియస్‌గా, భావోద్వేగంగా సాగుతుంది.

► ఈ సినిమాకి కథే హీరో. ఆ తర్వాతే నేను. గ్లామర్, కమర్షియల్‌ అంశాలు ఉండవు. ఇదొక తమిళ చిత్రం కంటే మా సినిమాలో సీన్స్‌ని ఇంకా బాగా తీశాం. రీమేక్‌ సినిమా చేయడం 90 శాతం సులభం, 10 శాతం ఒత్తిడి ఉంటుంది. గత జూలై నుంచి ఈ జూలైకి మూడు పెద్ద సినిమాలు చేశా.. చాలా కష్టపడ్డా.. అందుకే ఓ నెల సరదాగా అమెరికా వెళుతున్నా.

► నా ఫ్రెండ్స్‌ అంతా నెట్‌ఫ్లిక్స్‌ బ్యాచ్‌. ‘రాక్షసుడు’ ప్రివ్యూ చూసి, ‘నిజమైన పోలీస్‌ అనిపించావ్‌.. గర్వంగా ఉంది’ అన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా తమిళ్‌ కంటే తెలుగులోనే బాగా చేశారని అన్నారు. ఇంత మంచి కథ నాకు ఎప్పుడూ దొరకలేదు. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వపడుతున్నా. ఇందులో అంతర్జాతీయ స్థాయి క్లయిమాక్స్‌ ఉంటుంది.

► రమేష్‌ వర్మ బాగా తీశాడు. నేనెప్పుడూ దర్శకత్వంలో కల్పించుకోను. డైరెక్టర్లు ఎలా చెబితే అలా చేస్తా. వీవీ వినాయక్, బోయపాటి శీనుగార్ల వంటి మాస్‌ డైరెక్టర్లతో కమర్షియల్‌ సినిమాలు చేశా. నటుడిగా నేనేంటో నిరూపించుకోవాలి. అందుకే ‘సీత, రాక్షసుడు’ వంటి వైవిధ్యమైన సినిమాలు ఎంచుకున్నా. సినిమా సినిమాకి వైవిధ్యమైన పాత్రలు చేయాలనుంది. కానీ, టాలీవుడ్‌లోనే కాదు.. ఇతర భాషల్లోనూ కొత్త కథలు దొరకడం కష్టమైపోతోంది. నా ‘సాక్ష్యం, కవచం, సీత’ సరిగ్గా ఆడనప్పుడు ‘ఇంత కష్ట పడ్డాం. ఎందుకిలా?’ అని బాధపడ్డా. అయితే సక్సెస్‌కంటే ఫెయిల్యూర్స్‌తోనే ఎక్కువ నేర్చుకుంటాం.

► నాన్నగారు (బెల్లంకొండ సురేశ్‌) పక్కా కమర్షియల్‌ నిర్మాత. ‘సీత, రాక్షసుడు’ వంటి కథలతో ఆయన సినిమాలు తీయరు. ఇండస్ట్రీ నేపథ్యం ఉన్నవారైనా, లేనివారైనా ఇక్కడ కష్టపడాల్సిందే. కొన్ని కథలను మనం జడ్జ్‌ చేయలేం. మనకి బాగా అనిపించినవి ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ఈ మధ్య రెండు మూడు కథలు విన్నా ఏదీ ఫైనల్‌ చేయలేదు. రెండు బాలీవుడ్‌ అవకాశాలొచ్చాయి. కానీ, హిందీపై నాకు అంత పట్టు లేదు. అందుకే చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement