‘‘నటుడిగా సక్సెస్ సాధించిన తర్వాత కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను నిర్మించాలనుకుని ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమాను నిర్మించాను. ఈ సినిమా కోసం తీసుకున్న నటీనటులందరి బలాలు నాకు తెలుసు. అందుకే వేరే దర్శకుడు ఎందుకు? అని నేనే డైరెక్షన్ చేశాను’’ అన్నారు నటుడు వై. శ్రీనివాస్‌రెడ్డి. ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై వై. శ్రీనివాస్‌రెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. శ్రీనివాస్‌రెడ్డి, సత్య, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఒక రోజులో జరిగే కథ ఇది. భాగ్యనగరంలో మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారిని ఓ పోలీసాఫీసర్ పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
ఇందులో ఓ షార్ట్‌ఫిల్మ్ గ్యాంగ్ ఎలా ఇరుక్కుకుంది? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వినోదం మాత్రమే కాదు.. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలనే చిన్న సందేశం కూడా ఉంది. ఈ సినిమాతో మా మేనల్లుడుని ఆర్టిస్టుగా పరిచయం చేస్తున్నాను. సెంటిమెంట్ కోసం ఈ సినిమా తొలి షాట్‌ను మా నాన్నగారిపై డైరెక్షన్ చేశాను. ల్యాప్‌టాప్‌లో సినిమా చూసుకున్నారాయన. ఇటీవలే నాన్నగారు చనిపోయారు. ‘దిల్’ రాజుగారి బ్యానర్‌పై ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేస్తున్నా. దర్శకత్వం, నిర్మాణం, హీరో, నటుడు.. ఈ నాలుగింట్లో నటుడిగా ఉండటమే నాకు ఇష్టం. ఆర్టిస్టుగా ఉంటే ఆ కిక్కే వేరు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment