బిగ్‌బాస్‌ : కౌశల్‌పై మరో కుట్ర జరుగుతోందా...? | Bhanu Sree Sensational Comments On Kaushal In Bigg Boss Telugu | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 13 2018 9:03 AM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Bhanu Sree Sensational Comments On Kaushal In Bigg Boss Telugu - Sakshi

కౌశల్‌, భాను శ్రీ

సాక్షి, హైదరాబాద్‌ : భావోద్వేగాలతో ఆడే ఓ ఆట బిగ్‌బాస్‌ రియాల్టీ షో.. అయితే గురువారం ఎపిసోడ్‌లో ఆ ఆటను బిగ్‌బాస్‌ మరింత రక్తికట్టించాడు. ఎంతలా అంటే ఆటలో కూడా వ్యక్తిగత దూషణలకు దిగేంత. మరో వ్యక్తిపై నిందలు మోపెంత. ‘మంచి-చెడు’ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్‌లు హద్దులు మీరారు. ఒకరిపై ఒకరు పడుతూ.. అరుచుకుంటూ.. గాయపరుచుకుంటూ.. హౌస్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు. అయితే కౌశల్‌పై భానుశ్రీ చేసిన ఆరోపణలే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

టాస్క్‌లో భాగంగా కౌశల్‌ తాకరాని చోట తాకాడని భాను తీవ్ర ఆరోపణలు చేసింది. తొలి నుంచి కౌశల్‌ అంటే గిట్టని తేజస్వీ ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ‘వాడి బుద్ధే​ అంతా’ అంటూ విరుచుకుపడింది. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న గీతామాధురి వెంటనే స్పందిస్తూ.. ‘ఆ ఆరోపణలు అవాస్తవం.. దయచేసి ఈ విషయాన్ని పెద్దగా చేయకండి’ అంటూ సొంత టీమ్‌ సభ్యులైన భాను, తేజస్వీలను హెచ్చరించింది. దీంతో కౌశల్‌ ఊపిరి పీల్చుకున్నాడు. 

కిరీటి చేసిన తప్పే భాను..
ఎవరో చెప్పిన మాటలకు ప్రభావితమై.. కౌశల్‌పై కొంచెం ఓవర్‌గా రియాక్టై కిరీటి దామరాజు చేతులు కాల్చుకున్నాడు. నిజానికి కౌశల్‌పై అప్పటివరకు ప్రేక్షకులు కూడా అంతగా ఆసక్తి కనబర్చలేదు. ఆ ఒక్క సంఘటన కిరీటిని విలన్‌ చేయగా.. కౌశల్‌ను హీరో చేసింది. ఎంతలా అంటే సోషల్‌ మీడియాలో ప్రేక్షకులే కౌశల్‌ ఆర్మీ అనే ఓ ఫేస్‌బుక్‌ పేజీ క్రియేట్‌ చేసేంతా. ఈ ఘటననంతరమే ప్రేక్షకులు తేజస్వీ Vs కౌశల్‌గా విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అదే తప్పును భానుశ్రీ కూడా చేసిందని అభిప్రాయడుతున్నారు ప్రేక్షకులు. వాస్తవానికి హౌస్‌లో నిర్మాహమోటంగా మాట్లాడే వ్యక్తి అంటే అది భానునే. హోస్ట్‌ నాని సైతం ఈ విషయాన్ని తెలిపాడు.

అయితే ఈ వారం ఎలిమినేషన్‌లో ఉండటంతో ఆమె ఎదో ఒకటి చేసి.. ప్రేక్షకులను ఆకర్షించాలనే ప్రయత్నం చేసింది. దీనికి ఇతర కంటెస్టెంట్లు సైతం సహకరించారు. తొలుత ఓ ఎమోషన్‌ డ్రామా ప్లే చేసి దీప్తి సునయన, తనీష్‌లను ఫూల్స్‌ చేసింది. దీంతో వారు చాలా హర్ట్‌ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గురువారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రేక్షకుల సానుభూతి పొందాలనే కౌశల్‌పై భాను తీవ్ర ఆరోపణలు చేసిందని, కానీ ఆమె ప్రయత్నం విఫలమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒక్క ఘటన.. భానుపై ఉన్న అభిమానాన్ని తుడిచివేసిందని కొందరు ఘాటుగానే కామెంట్‌ చేయగా.. ఆటకోసం ఒకరిపై బట్టకాల్చేయడం ఏంటని మరికొందరు మండిపడుతున్నారు. ఈ సారి భాను ఎలిమినేషన్‌ పక్కా అని జోస్యం చెబుతున్నారు.

తేజస్వీపై నెటిజన్ల ఫైర్‌!
ఎమోషన్స్‌ను కంట్రోల్‌ చేసుకోలేక.. ఇతరులపై తన కోపాన్ని ప్రదర్శిస్తూ.. ముఖ్యంగా కొందరిని మాత్రమే టార్గెట్‌ చేస్తున్న తేజస్వీపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెను చూడలేకపోతున్నామని, దయచేసి ఎలిమినేట్‌ చేయాలని కామెంట్‌ చేస్తున్నారు. ఇక్కడ తేజస్వీనిని వెనుకెసుకొచ్చేవాళ్లు కూడా ఉన్నారు. తను ఎమోషన్‌ను అదుపుచేసుకోలేనని తేజస్వీయే ఒప్పుకుంది. అయితే ఆమె హౌస్‌ మేట్స్‌ను ప్రభావితం చేస్తోందన్నది మాత్రం వాస్తవం. గత వారం ఎలిమినేషన్‌లో దీప్తిని నామినేట్‌ చేసేలా బాబు గోగినేనినే ఆమె ప్రభావితం చేసింది. ఈ విషయంలో ఆయన నాని ముందు అడ్డంగా బుక్కయ్యాడు. ఇక తొలి వారంలో ఓ గ్రూప్‌ను మెయిటెన్‌ చేసి.. నానితో చివాట్లు కూడా తిన్నది. అయితే ఈమె ప్రభావంతోనే తనీష్‌, సామ్రాట్‌, కిరీటిలు కౌశల్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఓ సందర్భంలో తనీష్‌, బాబు గోగినేనితో మాట్లాడుతూ.. తేజస్వీ తన మాటలతో అందరిని ప్రభావితం చేస్తుందని తెలిపాడు. అయితే తేజస్వీకి కౌశల్‌తో పాటు గీతా మాధురి అంటే కూడా గిట్టదనే విషయం సుస్పష్టం. అయితే వీరద్దరిపైకి తనీష్‌ను ఉసిగోల్పింది కూడా తేజునేనని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ‘మంచి-చెడు’  టాస్క్‌లో ఈ విషయం స్పష్టమైందని వివరణ ఇస్తున్నారు. ఈ టాస్క్‌లో చెడు టీమే విజయం సాధించినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ఈ టాస్క్‌లో వరెస్ట్‌ పర్ఫార్మర్‌ ఒకరిని సూచించి.. వారిని జైలుకు తరలించాలని కెప్టెన్‌ కౌశల్‌ను బిగ్‌బాస్‌ ఆదేశించాడు. దీనికి కౌశల్‌ భాను పేరు సూచిస్తూ.. కొన్ని విషయాల్లో ఆమె ప్రవర్తన నచ్చలేదని పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement