
నలభై ఏళ్లలో రెండు సార్లు మాత్రమే మాట్లాడారు
చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు భారతీరాజాపై తమిళ సూపర్‌స్టార్ రజినీ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తనను ఎప్పుడూ మంచి నటుడని చెప్పలేదని, తనతో రెండుసార్లుమాత్రమే మాట్లాడారని చెప్పారు. శనివారం ఆయన భారతీరాజా నెలకొల్పిన భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సినిమా (బీఐఐసీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. భారతీరాజా తనను ఎప్పుడు మంచి యాక్టర్‌నని చెప్పలేదని, ఓమంచి మనిషి అని మాత్రమే అనేవారని గుర్తు చేసుకున్నారు.
నలబై ఏళ్ల తన నట జీవితంలో భారతీరాజా తనతో రెండుసార్లు మాత్రమే మాట్లాడారని సూపర్‌స్టార్ తెలిపారు. అందులో మొదట 16 వయధినిలె సినిమా కాల్షీట్ కోసం కాగా, రెండోది బీఐఐసీ ప్రారంభం కోసమని వివరించారు. సినిమా సెట్స్‌లో ఎలా ఉండాలో తన గురువైన కె.బాలచందర్ నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. ఫిల్మ్‌స్కూల్‌లో విద్యార్థులు నటనకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశాలున్నాయని తెలిపారు. అనంతరం నిరాడంబరంగా ఉండే రజినీకాంత్ చిన్న నటుడిగా జీవితం ప్రారంభించి ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారని భారతీరాజా కొనియాడారు.