భావనారావు
సినిమా: దక్షిణాది కథానాయికలు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం అంత సులభమైన విషయం కాదు. ఇక్కడ ఎంతో క్రేజ్ తెచ్చుకుంటేగానీ అది సాధ్యం కాదు. అలాంటిదిప్పుడు నటి భావనారావుకు అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. కన్నడ నటి భావనారావు. మాతృభాషలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ తమిళంలోనూ పరిచయమైంది. ఇక్కడ కొలకొలయా ముందిరిక్కా, విణ్‌మీన్‌గళ్, వనయుద్ధం చిత్రాల్లో నటించిన ఈ భామ కన్నడంలో 2017లో నటించిన సత్యహరిచంద్ర చిత్రం ఆమెకు అభినందనలు, అవార్డులను తెచ్చిపె ట్టింది. ప్రస్తుతం శివరాజ్‌కుమార్, సుధీప్, ఎమీజాక్సన్ నటిస్తున్న విలన్ అనే చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇలా కన్నడం, తమిళం భాషల్లో నటిస్తున్న భావనారావ్‌ను బాలీవుడ్ పిలిచింది.
హిందీలో నీల్ నితిన్ ముఖేశ్‌కు జంటగా బైపాస్ రోడ్డు అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ ఎంట్రీ గురించి భావనారావ్ తెలుపుతూ తాను కన్నడ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ, హిందీ, తెలుగు, ఇతర భాషా చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. అలా ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు నమన్ నితీశ్ దర్శకత్వం వహిస్తున్న బైపాస్ రోడ్డు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. ఈ చిత్రం ఊహించని మలుపులతో సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపింది. దర్శకుడు కథ చెప్పగానే అందులో తన పాత్ర చాలా నచ్చిందని చెప్పింది. ఈ చిత్రంలో చాలా బలమైన పాత్ర అని, నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర కావడంతో సవాల్‌గా తీసుకుని నటిస్తున్నట్లు చెప్పింది. నటిగా తనకు నూతన సంవత్సరం చాలా ఆనందంగా ప్రారంభమైందని చెప్పింది. తొలిసారిగా బాలీవుడ్‌కి ప్రవేశించడం చాలా సంతోషంగా ఉందని అంది. హిందీలోనూ మంచి నటిగా రాణిస్తాననే నమ్మకం తనకుందని భావనారావ్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. స్వతహాగా భరతనాట్య కళాకారిణి అయిన భావనారావ్ నటనలోనూ శిక్షణ పొందడంతో బాలీవుడ్‌లోనూ రాణిస్తుందనే నమ్మకాన్ని ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment