
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జ్ఞాపకార్థం పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు తలపెట్టిన కార్యక్రమంలో నటి భూమి ఫడ్నేకర్ కూడా చేయూతనంధించింది. తనవంతు సహాయంగా 550 కుటుంబాలకు సహాయం అందిస్తానని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అతని జ్ఞాపకార్థం నటుడు అభిషేక్ కపూర్, భార్య ప్రగ్యా కపూర్ ఏక్‌సాత్ ఫౌండేషన్ ద్వారా 3,400 పేద కుటుంబాలకు నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వంతు సహాయం చేస్తానని ముందుకొచ్చిన భూమి ఫడ్నేకర్‌కు ఫౌండేషన్ తరపున కృతఙ్ఞతలు తెలిపారు. 'నా ప్రియమైన స్నేహితుడి జ్ఞాపకార్థం ఏక్ సాత్ ఫౌండేషన్ ద్వారా 550 పేద కుటుంబాలకు సహాయం చేస్తాను. కరోనా కష్టకాలంలో పేదవారికి సహాయం చేద్దాం. ప్రేమను పంచుదాం' అంటూ భూమి ఫడ్నేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లా? )
2019లో అభిషేక్ చౌబే దర్శకత్వంలో తెరకెక్కిన సోంచిరియా అనే సినిమాలో సుశాంత్, భూమి ఫడ్నేకర్ కలిసి నటించారు. కాగా జూన్ 14 సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడి మరణానికి బాలీవుడ్ పేరుకుపోయిన బంధుప్రీతి(నెపోటిజం) కారణమంటూ స్టార్‌కిడ్స్, ప్రముఖ దర్శకనిర్మాతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక స్టార్‌కిడ్స్ సినిమాలను బైకాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పిలుపునిస్తున్నారు. (సుశాంత్ తండ్రిని కలవడానికి వెళ్తున్నా: నటుడు)