అవును.. వారి ‘అరుపు’లో నిజాయితీ ఉంది.. ఎమోషన్ ఉంది.. ఒక బృందం కష్టంతో పాటు చిత్తశుద్ధి ఉంది. అందుకే ఆ తెలుగు వీడియో అంతర్జాతీయ వేదికపై కేక పుట్టించింది. చూసిన వారందరినీ కంట తడి పెట్టించింది. శాన్‌ఫ్రాన్సిస్‌కో అంతర్జాతీయ అవార్డుని దక్కించుకుంది. ‘అరుపు’ వీడియో టీమ్‌ని పలకరించినప్పుడు తమ వీడియో ప్రారంభం నుంచి అవార్డు వరకు జర్నీ విశేషాలు ‘సాక్షి’తో పంచుకున్నారు.
‘అరుపు’ అలా మొదలైంది..రోల్‌రైడా
‘ఆసిఫా’ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది. ఆడ శిశువనే కారణంతో ఆరునెలల బిడ్డని తల్లిదండ్రులే కర్చిఫ్ నోట్లో కుక్కి చంపేశారని ఫ్రెండ్ చెబితే కలవరపడ్డాను. వెంటనే పాట రాశాను. తర్వాత ఇలాంటి ప్రాజెక్ట్ ఉంటే చెప్పమన్న ప్రొడ్యూసర్స్‌కి సాంగ్ పంపించాం. వారికి నచ్చింది. డైరెక్టర్ హరికాంత్‌ని వారికి కలిపించాను. లిరిక్స్ రికార్డ్ చేసి, నా వరకు వీడియో రికార్డ్ చేసి నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లిపోయాను. అంతే, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.
కాన్సెప్టే డిఫరెంట్‌గా చేశారు..
నిజరూపానికి ప్రతిబింబాన్ని అద్దంలో చూస్తాం. అలా మనకు కళ్లకు కనిపించేది వాస్తవం కాదు. అసలు నిజం ఏంటో తెలుసుకోవాలి. కంటికి చాలా మాములుగా కనిపించే ఎన్నో విషయాల వెనుక ఎన్నో భయంకర విషాదాలు ఉండవచ్చు. అందుకే ఈ కాన్సెప్ట్‌ని ఇలా రెడీ చేశాం. కమరాన్ చాలా కష్టపడ్డాడు. మనీషా బాగా పాడింది. తర్వాత మేం షూట్ కోసం అడిగాం. ఆమె ఒప్పుకుంది. కానీ ఆమెకు షూట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామో అర్థం కాలేదు. వీడియో పూర్తయ్యాక మెచ్చుకుంది. ప్రాజెక్ట్ విలువ రూ.27 లక్షలు.పోస్ట్ ప్రొడక్షన్‌కి, వీఎఫెక్ట్‌కి ఎక్కువ సమయం పట్టింది.
తర్వాత ఏం జరిగింది..కమరాన్, మ్యూజిక్ కంపోజర్
సీరియస్ ఇష్యూస్‌ని తీసుకుని ర్యాప్ వీడియోలు చేయాలని ముందు నుంచే ఉంది. కానీ స్టార్టింగ్‌లోనే ఇలాంటి పాట చేసి ఉంటే మమ్మల్ని ఎవరూ గుర్తించేవారు కాదు. ఇప్పుడు మాకు ఒక లిజనర్‌షిప్ ఉంది. అది రైడా ఫీలై రాసేసరికి ఇక ఆలస్యం చేయకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. రైడా డెమో ట్రాక్ పాడించి పెట్టాం. తర్వాత తను బిగ్‌బాస్‌కి వెళ్లిపోయాడు. దాని మీదే రైడా షూట్ కూడా జరిగింది. మనీషా యూఎస్ నుంచి రావడానికి 20 రోజుల టైం ఉండే. అప్పుడు ఈ ఎఫెక్ట్స్ చేసి పెట్టాను. ఆమె ఇంగ్లిష్‌లో పాడుతుంది, డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు. సినిమాకి మ్యూజిక్ స్క్రిప్ట్ పరంగా చేయాలి. ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి ఉన్న పవర్ ఏంటంటే,ఆర్టిస్ట్‌కి నచ్చింది చేసే స్వేచ్ఛ ఉంటుంది.. నిజాయితీగా చేస్తారు. దాంతో వినే వారు కనెక్ట్ అవుతారు. అందుకే చేస్తున్నప్పుడు జనాల్లోకి వెళుతుందా లేదా అనే డౌట్ రాదు. ఈ వీడియోకి చాలా హ్యూజ్ రెస్పాన్ వచ్చింది. ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారు. పతంగ్ తర్వాత మళ్లీ అంత రెస్పాన్స్ ఇంది. ప్రొడ్యూసర్లు కూడా ఒక్క ప్రశ్న వేయకుండా సపోర్ట్ చేశారు.
‘మీ టూ’ కంటే ముందే.. మనీషా
ఇది రోల్‌రైడా ఐడియా. అమ్మాయిలపై లైంగిక హింస, వేదింపులు అనేక అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మన దగ్గర ‘మీ టూ’ కంటే ముందే ఈ వీడియో విడుదలైంది. ‘మీ టూ’ వంటి మూమెంట్ వల్ల మార్పు వెంటనే వస్తుందని చెప్పలేం. కానీ అందరూ దీని గురించి మాట్లాడతారు.. ఆలోచిస్తారు. అవగాహన పెరుగుతుంది. మార్పుకి మార్గం ఏర్పడుతుందని భావిస్తాను.
మీ గురించి... వీడియో గురించి..
‘నేను లోకల్, మహానుభావుడు, సవ్యసాచి, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల్లో పాడాను. మాషప్స్ చేస్తుంటాను. అది చూసి రోల్, కమరాన్ ఏదైనా ప్లాన్ చేద్దామన్నారు. నేను పాడిన లిరిక్స్, కోరస్ కృష్ణకాంత్ రాశారు. మిగతాది రోల్‌రైడా రాశారు. ఈ పాటను యూఎస్ నుంచి వచ్చి పాడాను. తర్వాత వీడియోలో కూడా ఉంటే బాగుంటందన్నారు. గంటలో షూటింగ్ అయిపోయింది. చాలా మంచి రివ్యూస్, ఫీడ్‌బ్యాక్ వచ్చాయి. కొంతమంది ఈ వీడియో చూసి మాకు ఏడుపొచ్చింది అని మెసేజ్ చేశారు. అంతకంటే గొప్ప రివ్యూ ఏం ఉంటుంది?
ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణమిదీ..సునీల్ గడ్డమేడి,వీడియో ప్రొడ్యూసర్
నేను ఓ ఈవెంట్‌లో రైడాను కలిసినప్పుడు తెలుగులో ఎక్కువగా మ్యూజిక్ వీడియోలు వేడుకలు, పండుగలు, సంబురాల మీదనే ఉన్నాయి. అలా కాకుండా వెస్ట్రన్ మ్యూజిక్‌లో సీరియస్ ఇష్యూస్‌ని.. ముఖ్యంగా స్త్రీల సమస్యలను చూపవచ్చు కదా అని సూచించా. అయితే, అలాంటివి చేయాలని తనకున్నా ప్రొడ్యూసర్లు ముందుకు రారని రైడా అన్నారు. స్త్రీ సాధికారతపై వీడియో ప్లాన్ చేస్తే చెప్పమన్నాం. తను ఈ రికార్డింగ్ పంపితే విన్నా.. బాగా నచ్చింది. వెంటనే ప్రాజెక్టుకు ఓకే చెప్పాం. ముప్‌పైవేల డాలర్లు ఖర్చవుతుందన్నారు. శ్రీని శ్రీగద నా ఫ్రెండ్. ఈ ప్రాజెక్ట్‌కి ఎక్కువ బడ్జెట్ అవసరం కావడంతో తనని అడిగాను. వెంటనే ఏ వివరాలు అడగకుండా ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. మూడు నెలల్లో పూర్తి చేశాం. ఎక్కువ ప్రమోషన్ చేయకుండానే వీడియో పాపులర్ అయింది. ఇకపై కూడా అర్థవంతమైన ప్రొడక్షన్స్ చేస్తాం. పరిచయం లేనివారు కూడా వివరాలు తెలుసుకొని ఫొన్ చేసి చక్కటి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఒక్కటే బాధ, యాదృచ్ఛికంగా ‘మీ టూ’ సమయంలో ఈ వీడియో విడుదలైంది. అయినా ఫెమినిస్టులు, సెలబ్రిటీలు ఈ వీడియో గురించి మాట్లాడ్డం గానీ, ట్వీట్ కానీ చేయలేదు. అదే కొంచెం వెలితి.
అంతర్జాతీయ పురస్కారం..
‘అరుపు’ మ్యూజిక్ వీడియోలో రోల్‌రైడా, మనీషా పాడడంతో పాటు నటించారు. హరికాంత్ గుణమగరి దర్శకత్వం వహించిన ఈ వీడియోకి మ్యూజిక్ స్కోర్ అందించింది కమరాన్. ఈ వీడియోని యూ–ట్యూబ్‌లో 50 లక్షల మందికి పైగా వీక్షించారు. శాన్‌ఫ్రాన్సిస్కో న్యూ కాన్సెప్ట్ ఫిలిం ఫెస్టివల్ యూఎస్‌ఏ అవార్డు దక్కించుకుంది. భారత్ నుంచిఎంపికైన ఏకైక చిత్రం ‘అరుపు’ మాత్రమే. ప్రొడ్యూసర్స్ సునీల్ గడ్డమేడి, శ్రీని శ్రీగదని ఈ ఫెస్టివల్‌కి ఆహ్వానించారు. ఈ వీడియో ‘ది బెస్ట్’గా అవార్డు అందుకుంటుందని ఎప్పుడూ ఊహించలేదంటోంది ఈ వీడియో బృందం.
Comments
Please login to add a commentAdd a comment