శ్రీనగర్‌కాలనీ: నా అసలు పేరు స్వప్న. డ్యాన్సర్‌గా ఎదిగాక భానుశ్రీగా మార్చుకున్నాను. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కొరియోగ్రాఫర్ అవుతానని ఇంట్లో చెప్పాను. అయితే ఒప్పుకోలేదు. దాంతో నేను దాచుకున్న కొంత డబ్బుతో ఒంటరిగా హైదరాబాద్ వచ్చేశాను. నేను ముక్కుసూటి మనిషిని.. దేనికీ భయపడను. నా వ్యక్తిత్వాన్ని నమ్ముతూ నిజాయతీగా ముందుకెళ్తాను. నాకు తెలిసిన వాళ్ల ద్వారా డ్యాన్సర్ కార్డ్ తీసుకున్నాను. తెలిసిన అమ్మాయితో కలిసి రూమ్ తీసుకొని ఉన్నాను. కొన్ని రోజులకు నా గొలుసు ఎవరో దొంగతనం చేశారు. బాధతో రూమ్ నుంచి వచ్చేశాను. ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. డ్యాన్సర్‌గా శక్తి, డార్లింగ్ తదితర సినిమాలకు పనిచేశాను.
సీరియల్.. సినిమా
డ్యాన్సర్‌గా ఎదిగాక కొన్ని షోలలో పాల్గొన్నాను. తర్వాత జాబిలమ్మ సీరియల్‌లో లీడ్ రోల్ చేశాను. బాహుబలి సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పింది. అందులో తమన్నా స్నేహితురాలిగా నటించాను. బాహుబలి తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాలో మంచి పాత్ర వచ్చింది. కాటమరాయుడు, సుబ్రమణ్యం ఫర్ సేల్, మహానుభావుడు తదితర చిత్రాల్లో నటించాను. పెద్ద సినిమాల్లో నటించడంతో చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశం లభించింది. ఇద్దరి మధ్య 18, మౌనం, ఆవుపులి మధ్యలో ప్రభాస్ పెళ్లి తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా చేశాను. బాహుబలి సినిమాలో నటించాక వరంగల్‌లో నాకు సన్మానం చేశారు. ‘సినిమాల్లో వద్దు. నీకు చాన్స్‌లు రావు’ అన్నవాళ్లే నన్ను అభినందిస్తూ సన్మానం చేయడం సంతోషంగా అనిపించింది. ప్రస్తుతం తెలుగు, కన్నడ మూవీలో హీరోయిన్‌గా చేస్తున్నాను.
నేనే ప్రపోజ్ చేశా...
డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు శివశంకర్‌రెడ్డితో పరిచయమైంది. తనది కడప. నిజాయతీగా ఉండేవాడు. కష్టాల్లో తోడుగా ఉండి భరోసా ఇచ్చాడు. స్టైలింగ్‌లో సూచనలిస్తూ స్నేహితుడిగా మారాడు. శివ వ్యక్తిత్వం, ఆప్యాయత నచ్చాయి. కొన్ని రోజులకు నేనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని చెప్పాను. శివతోనే నా ప్రయాణం. శివ తోడు నా జీవితాన్ని మరో మలుపు తిప్పింది.
నా స్వీయ తప్పిదం...
బిగ్‌బాస్‌లో అవకాశం రావడం నా అదృష్టం. అందులో పాల్గొనడం ఆనందాన్నిచ్చింది. చాలామంది ఇది గేమ్ డైరెక్షన్ అనుకుంటారు. కానీ నిజాయతీగా ఉండే రియాల్టీ షో. ప్రతిరోజూ నూతనంగా ఉండేది. కొత్త టాస్క్‌లతో ఉత్సాహంగా గడిపేవాళ్లం. నా ముక్కుసూటి తనంతో షోలో నన్ను అభిమానిస్తూ సన్నిహితంగా ఉండేవారు. బిగ్‌బాస్‌లో నెలరోజులకు పైగా ఉండడం సంతోషంగా అనిపించింది. ఓ టాస్క్‌లో కౌషల్‌తో చిన్న వాగ్వాదం జరిగింది. నా స్వీయ తప్పిదంతోనే వాగ్వాదం పెద్దదైంది. దీంతో నాకు మైనస్ మార్క్స్ పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment