నోటికి అడ్డూ అదుపూ లేదా? : నాని | Bigg Boss 2 Nani Fires On Tejaswi | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 15 2018 3:47 PM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Bigg Boss 2 Nani Fires On Tejaswi - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏదైనా జరగొచ్చు అని హోస్ట్‌ నాని అంటే... ఏంటో గతవారం జరిగిన ఎపిసోడ్‌ చూస్తే అర్థమవుతుంది. మంచి, చెడు టీమ్‌ల మధ్య సాగిన టాస్క్‌లో రెచ్చిపోయారు ఇంటి సభ్యులు. వాగ్వాదాలు, ఆరోపణలు, క్షమాపణలు, బుజ్జగింపులు, త్యాగాలు, కోపాలు, తాపాలు ఇలా అన్నింటిని ఐదో వారం బిగ్‌బాస్‌లో చూపించేశారు. 

ఆసక్తికరమైన పిట్టకథతో నాని
అనగనగా రెండు గాడిదలు. ఒకదానిపై ఉప్పు మూట, మరో దానిపై దూది మూట. ఆ గాడిదలు ఒక కాలువను దాటాలి. అలా దాటుతుండగా మధ్య మధ్యలో ఉప్పు మూట ఉన్న గాడిద నీటిలో మునుగుతూ ఉంది. ఇలా ఎందుకు చేస్తున్నావని రెండో గాడిద అడిగే సరికి.. నేను అలా చేసినప్పుడల్లా మూటలోని ఉప్పు కరిగి.. బరువు తగ్గుతోందని చెప్పగానే రెండో గాడిదకు కూడా ఆలోచన వచ్చి అది కూడా మధ్యమధ్యలో నీటిలో మునిగింది. చివరకు దూది బరువెక్కి మోయలేకపోయిందంటూ ఇది ఎవరికి వర్తిస్తుందో చివరకు చెబుతానంటూ నాని ముగించేశాడు. 

సభ్యులను మందలించిన నాని
ఈ వారం సభ్యులు చేసిన పనులన్నింటిపై నాని విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా తేజస్వీపై కోపం ప్రదర్శించాడు నాని. నోటికి అడ్డూ అదుపూ లేదా ఎంతొస్తే అంత మాట్లాడుతావా? వాడు, వీడు, వెదవ, తూ.. ఇలా ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నావు.. నోటిని అదుపులో పెట్టుకోమని మందలించాడు. దీంతో తెల్లబోయిన తేజస్వీ క్షమించమని అడిగింది. ఇదే విధంగా భానును కూడా మందలించాడు. ఒక్కక్షణం  కూడా ఆలోచించకుండా.. కౌశల్‌పై ఆరోపణలు చేయడం సరికాదంటూ చెప్పాడు. కౌశల్‌పై ఉన్న ద్వేషమే ఇందుకు కారణమని చెప్పాడు. టాస్క్‌లో భాగంగా అమ్మాయిలతో ఆడేప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ.. ఇంటిలోని సభ్యులకు సలహా ఇచ్చాడు. 

దీప్తి సునయన విషయంలో తనీష్ చేస్తున్న పనిని తప్పుబట్టాడు. ఆమె కెప్టెన్సీ టాస్క్‌ విషయంలో తనీష్‌ తలదూర్చడంపై నాని ఆగ్రహించాడు. ఇక సామాన్యుడైన గణేష్‌ సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకోవడంపై మందలించాడు. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తోనే సెల్ఫ్‌ నామినేట్ చేసుకున్నావని, కొత్తిమీర కట్టలు తిని బాబు గోగినేని చేసిన టాస్క్‌ను వృథా చేశావని గణేష్‌ చేసిన తప్పిదాన్ని వివరించాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో తనకిష్టమైన అమిత్‌ ఈసారి నిరాశ పరిచాడని నాని అన్నాడు. ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ వచ్చిన పేరంతా ఒక్కసారిగా కొట్టుకుపోయిందంటూ చెప్పుకొచ్చాడు. భానుకు ఇచ్చిన మాటను.. తేజస్వీ, సామ్రాట్‌లు ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పేసరికి మాటమార్చావని, సరిగా ఆలోచించడం చేతకాదంటూ అమిత్‌పై ఆగ్రహించాడు. 

గీతామాధురిని మెచ్చుకున్న నాని
తేజస్వీ, భానులు కౌశల్‌పై ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్న తరుణంలో గీతామాధురి వాటికి అడ్డుకట్ట వేసింది. కౌశల్‌ తప్పుగా ప్రవర్తించలేదని, అనవసరంగా గొడవ చేయొద్దని, టాస్క్‌ను టాస్క్‌లా ఆడాలంటూ.. క్యారెక్టర్‌ల జోలికి వెళ్లొద్దని హితవు పలికింది. ఇదే విషయాన్ని నాని ప్రస్తావిస్తూ.. సమాజంలో కూడా మీలాంటి వాళ్లు ఉంటే బాగుంటుందని, అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించడాన్ని నాని మెచ్చుకున్నారు. 

గత వారం కార్యక్రమం వివరంగా..
ఈసారి విభిన్నంగా బిగ్‌బాసే ఇంటి సభ్యులను నామినేట్‌ చేసి.. అది తప్పించుకోవాలంటే.. వారికిచ్చిన టాస్క్‌ను కంప్లీట్‌ చేయాల్సిందిగా షరతును విధించాడు. అలా చేయలేకపోతే.. వారు స్వయంగా నామినేట్‌ అవుతారంటూ బిగ్‌బాస్‌ ఆదేశించాడు. బిగ్‌బాస్‌ మొదటగా తేజస్వీని పిలిచి బిగ్‌బాస్‌.. తను ఎలిమినేషన్‌లో భాగంగా ఈ వారం నామినేట్‌ అయినట్లు తెలిపారు. అయితే దీన్నుంచి తప్పించుకోవాంటే.. సామ్రాట్‌ను క్లీన్‌షేవ్‌ చేసుకునేలా ఒప్పించాలని టాస్క్‌ ఇచ్చాడు. తేజస్వీ కోసం.. సామ్రాట్‌ క్లీన్‌షేవ్‌ చేసుకుని తేజస్వీని నామినేషన్‌ నుంచి తప్పించాడు. గణేష్‌ కోసం... బాబు గోగినేని కొత్తిమీర కట్టలు తిన్నారు. గీతా మాధురి కోసం.. తేజస్వీ తనకిష్టమైన తెల్ల దుప్పటిని ముక్కలు ముక్కలుగా కత్తిరించేసింది. 

తనీష్‌ కోసం దీప్తి సునయన తన జుట్టును కత్తిరించుకుంది. సామ్రాట్‌ కోసం తనీష్‌ తన జాకెట్‌ను రెడ్‌కలర్‌లో ముంచాడు. ఇలా ఒక్కొక్కరు తమ ప్రేమను వ్యక్తపరిచారు. అయితే రోల్‌రైడా కోసం గణేష్‌ ఒక్కవారం పాటు కేవలం పళ్లు తింటూ.. సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకున్నాడు. దీప్తి కోసం నందిని వెళ్లి కౌశల్‌ను ప్రతివారం సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకునేలా ఒప్పించాలని టాస్క్‌రాగా.. దీంట్లో నందిని ఫెయిల్‌ అవుతుంది. గెలవడానికే ఇక్కడకు వచ్చానని, నాకు నేను సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకుంటే.. నా అంతట నేనే ఒడిపోయానని ఒప్పుకున్నట్లు అవుతుందంటూ నందినికి చెప్పాడు. సో.. దీప్తికి బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌కు చేయనందుకు దీప్తి నామినేట్‌ అయింది. 

భాను కోసం అమిత్‌ మొదటగా బిగ్‌బాస్‌ షరతులను ఒప్పుకోగా.. కొద్దిసేపటికే సామ్రాట్‌, తేజస్వీల మాటలకు ప్రభావితమైన అమిత్‌ వాటికి ఒప్పుకోలేదు. అమిత్‌ చేసిన ఈ పని వల్ల భానును బిగ్‌బాస్‌ నామినేట్‌ చేశారు. ఈ టాస్క్‌లు కంప్లీట్‌ అయ్యేసరికి గణేష్‌, దీప్తి, భానులు నామినేట్‌ అయ్యారు. 

రసవత్తరంగా మారిన మంచి-చెడు టాస్క్‌
లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా బిగ్‌బాస్‌ ఈవారం.. ఇంటి సభ్యులను మంచి, చెడు టీమ్‌ సభ్యులుగా విడగొట్టాడు. కౌశల్‌, తనీష్‌, దీప్తి సునయన, దీప్తి, నందిని, రోల్‌రైడా మంచి టీమ్‌ సభ్యులు కాగా, మిగిలిన వారంతా చెడు టీమ్‌సభ్యులు. చెడు టీమ్‌ సభ్యులు ఇంటిని నాశనం చేయడం టాస్క్‌ కాగా, మంచి టీమ్‌ వీరి ఆగడాలను భరించడం, ఇంటిని చక్కదిద్దడం వంటి పనులు చేయాలి. చెడు టీమ్‌ సభ్యులు ఇంటి వస్తువులను, ఇంటిని నాశనం చేయగా మంచి టీమ్‌ సభ్యులు వాటిని సరిచేస్తుండగా.. టాస్క్‌ మధ్యలో భానుకు ఏదో అయినట్లు కింద పడిపోయి ఆడిన నాటకం వల్ల తనీష్‌, దీప్తి సునయనలు మానసికంగా నొచ్చుకున్నారు. 

మరుసటి రోజు ఈ టాస్క్‌ కంటిన్యూ కాగా.. ఇంటి ఆవరణలో పెట్టిన ఆపిల్‌ చెట్టుకు ఉన్న రెడ్‌ ఆపిల్స్‌ను మంచి టీమ్‌ సభ్యులు కాపాడాలి, బ్లాక్‌ ఆపిల్స్‌ను చెడు టీమ్‌సభ్యులు కాపాడాలి, ఇది కాకుండా జైల్లో ఒక టీమ్‌ సభ్యుడిని పెట్టాలి అంటూ బిగ్‌బాస్‌ టాస్క్‌ను ఇచ్చారు. జైలుకు సంబంధించిన తాళం చెవిని చెడు టీమ్‌ సభ్యులు చేజిక్కించుకున్నారు. 

ఆపిల్స్‌ ఆటలో మొదలైన వైరం..
చెట్టుకు ఏ కలర్‌ ఆపిల్స్‌ ఉంటే వారే విజేత అని తేల్చేసిన బిగ్‌బాస్‌.. విజేతలు కావడం కోసం పోటీపడ్డారు. ఎవరికి దొరికిన ఆపిల్స్‌ను వారు దాచిపెట్టుకున్నారు. మంచి టీమ్‌సభ్యులకు ఆపిల్స్‌ తక్కువగా దొరకగా.. చెడు టీమ్‌ సభ్యులు దాచిన మిగతా ఆపిల్స్‌ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో అమిత్‌ వాటిని దాచకూడని ప్లేస్‌లో దాచాడు. మళ్లీ వాటిని తీసి ఇంట్లో ఓ చోట భద్రపరిచాడు. 

టాస్క్‌ ఇలా సాగుతుండగా.. ఆపిల్‌ చెట్టుకు తమ బ్లాక్‌ కలర్ యాపిల్‌ను పెట్టడానికి భాను, గీతా మాధురి ప్రయత్నిస్తూ.. ఆ చెట్టునే పట్టుకుని ఉన్నారు. మంచి టీమ్‌ సభ్యులు వాటిని కాజేయాలని ప్రయత్నిస్తుండగా.. కౌశల్‌ ఆపిల్‌ను కాజేయాలని ట్రై చేయగా.. తగలకూడని చోట చేయి తగిలిందని భాను కౌశల్‌పై విరుచుకుపడింది. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా చేయి తగిలిందా అని తేజస్వీని భాను అడగ్గా.. తాకింది, చూశానని తేజు కూడా కౌశల్‌పై అనుచిత వాఖ్యలు చేసింది. వాడి బుద్ధే అంత అని, తూ.. అంటూ కౌశల్‌ను దూషించింది. అక్కడే ఉన్న గీతామాధురి ఇది తప్పు.. అంటూ.. గేమ్‌ను గేమ్‌లా ఆడండి. క్యారెక్టర్‌ల గురించి మాట్లాడొద్దు అంటూ.. కౌశల్‌ చేయి భానుకు తగల్లేదని చెప్పుకొచ్చింది. కౌశల్‌ కూడా తేజస్వీ, భానులపై ప్రతిదాడికి దిగాడు. ఆపిల్స్‌ కోసమే చెయ్యి పెట్టానని, తన చేయి భానుకు తగల్లేదని వారించాడు. 

జైల్లో పెట్టడానికి పడ్డ ఇంటిసభ్యులు పడ్డ తిప్పలు..
జైలుకు సంబంధించిన కీని చేజిక్కించుకున్న చెడు టీమ్‌ సభ్యులు.. మంచి టీమ్‌ సభ్యులను జైల్లో పెట్టడానికి విశ్వప్రయత్నం చేశారు. ఒకసారి దీప్తి సునయనను ఎత్తుకెళ్లారు, మరోసారి దీప్తిని ఎత్తుకెళ్లారు. తనీష్‌, కౌశల్‌ వీరిని కాపాడే ప్రయతం చేయగా.. కౌశల్‌ను జైల్లో వేయాలని ప్రయత్నించగా విఫలమయ్యారు. రోల్‌ రైడాను జైల్లో వేయడానికి సామ్రాట్‌ ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. ఇలా టాస్క్‌ కొనసాగుతుండగా.. దీప్తిని జైల్లో వేయడానికి తేజస్వీ ప్రయత్నించగా.. దీప్తి తప్పించుకోవడంతో.. ఏదైనా తగలరాని చోట తగిలితే ఎలా అంటూ దీప్తిపై తేజస్వీ విరుచుకుపడింది. చివరకు తేజస్వీ తనంతట తానుగా జైల్లో కూర్చుంది. చెట్టుపై చెడు టీమ్‌కు సంబంధించిన బ్లాక్‌ ఆపిల్స్‌ ఉండడం వల్ల ఈ టాస్క్‌లో చెడు టీమ్‌ సభ్యులు విజేతలయ్యారని బిగ్‌బాస్‌ ప్రకటించారు. 

తరువాతి కెప్టెన్‌గా.. గీతా మాధురి
గీతా మాధురికి ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌లో విజయవంతం అయినందుకు బిగ్‌బాస్‌ అభినందనలు తెలిపారు. ఈ సారి కెప్టెన్‌గా ఇంట్లోని ఆడవారు మాత్రమే పోటీ చేయాలని.. అది కూడా ఇంతవరకు పోటీ చేయని సభ్యురాలు మాత్రమే కెప్టెన్‌గా ఉండాలని చెబుతూ.. సీక్రెట్‌ టాస్క్‌లో విజయవంతమైనందుకు ఒక పోటీదారుగా గీతా మాధురిని సెలెక్ట్‌ చేశాడు బిగ్‌బాస్‌. రెండో పోటీదారుగా దీప్తి సునయన నిల్చుంది. సంస్కరణలు చేపట్టాలని, దానికోసం మీరు చేయబోయే భవిష్యత్‌ కార్యాచరణను ఇంటి సభ్యులకు చెప్పి వారి ఓట్లను పొందాలని ఆదేశించగా.. గీతా మాధురి, దీప్తి సునయనలు ఆ పనిలో నిమగ్నమయ్యారు. చివరకు పోటీలో గీతా మాధురికి 11 ఓట్లు రాగా, దీప్తి సునయనకు 2 ఓట్లు వచ్చాయి. ఇంటి కెప్టెన్‌గా గీతా మాధురి బాధ్యతలు తీసుకుంది. 

ఆదివారం జరుగబోయే కార్యక్రమంలో భాను ఎలిమినేట్‌ కాబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. కౌశల్‌పై భాను అనుచిత వ్యాఖ్యలు చేయడం, టాస్క్‌లో ప్రవర్తించిన తీరు ఆమెపై వ్యతిరేకత కలిగేలా చేసింది. భాను, తేజస్వీలపై సోషల్‌మీడియాలో నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement