
ముందునుంచీ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంటూ హౌస్‌లో నిలదొక్కుకుంటోన్న కంటెస్టెంట్ హిమజ. అరవై రోజులు కలసి ఉన్నా.. ఇంటా బయటా ఆమెను ఓ అంచనా వేయలేకపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం హిమజకు గట్టి ఫాలోయింగే ఉంది. తొమ్మిదో వారంలో నామినేషన్ వ్యవహారంలో హిమజ చర్య.. అందరూ ముక్కున వేలేసుకునేట్టు చేసింది.
మహేష్ సేవ్ అవ్వాలంటే.. హిమజ తన బట్టలను, మేకప్ సామాన్లను అన్నింటిని స్టోర్‌రూమ్‌లో పెట్టేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ తెలిపాడు. ఇదే విషయాన్ని హిమజకు కూడా చెప్పాడు. అందుకు ఒప్పుకున్న హిమజ.. తన బట్టలను, మేకప్ సామాన్లను స్టోర్‌రూమ్‌లో పెట్టేసింది. అయితే కెప్టెన్ అయిన వితికాను బిగ్‌బాస్ ఆదేశిస్తూ.. ఇంట్లో ఇంకా ఏమైనా వస్తువులు ఉన్నాయో లేదో చూడమన్నాడు. దీంతో కొన్ని బట్టలు, మేకప్ సామాన్లు దర్శనమిచ్చాయి. దీంతో మహేష్ నామినేట్ కావాల్సి వచ్చింది.
అయితే ఇదే విషయంపై గాసిపాలజీ క్లాస్‌లో వితికా అడగ్గా.. తాను కావాలనే చేయలేదని హిమజ చెప్పుకొచ్చింది. అన్‌సీన్ ఎపిసోడ్స్‌లో హిమజ ఈ ఎపిసోడ్‌పై స్పందించినట్టు తెలుస్తోంది. తనకు మహేష్ కోసం త్యాగం చేయడం ఇష్టం లేదంటూ.. మొహంపైనే చెప్పలేకపోయానని రవి, శివజ్యోతిలతో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోతో నెటిజన్లు ఆమెను ఆడేసుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ మూలంగా ఆమెపై కొంచెం నెగెటివిటీ పెరిగింది. దీని కారణంగా ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటూ.. కొందరు అభిప్రాయపడుతున్నారు.