పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా | Bigg Boss 3 Telugu Third Week Nomination Process Started | Sakshi
Sakshi News home page

పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా

Published Mon, Aug 5 2019 11:13 PM | Last Updated on Tue, Aug 6 2019 4:48 PM

Bigg Boss 3 Telugu Third Week Nomination Process Started - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో మూడో వారానికి గానూ చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇంతవరకు నామినేషన్‌ ప్రక్రియను గుట్టుగా జరిపించే బిగ్‌బాస్‌.. మొదటిసారిగా అందరి ముందు పెట్టేశాడు. దీంతో ఏం కారణాలు చెప్పి నామినేట్‌ చేయాలో తెలీక హౌస్‌మేట్స్‌ అందరూ ఆలోచనలో పడ్డారు. ఇక కొందరు సిల్లీ రీజన్స్‌తో నామినేట్‌ చేయగా.. మరికొందరు తమను నామినేట్‌ చేసినందుకు తిరిగి నామినేట్‌ చేసినట్లు తెలిపారు. ఇక తనను నామినేట్‌ చేసేందుకు చెప్పిన కారణాలతో విసిగిపోయిన పునర్నవి హౌస్‌లో శివతాండవం చేసింది. బిగ్‌బాస్‌ మాటను కూడా ధిక్కరించింది. చివరకు వరుణ్‌ సందేశ్‌ మాటలతో వెనక్కి తగ్గి.. నామినేషన్‌ ప్రక్రియను పూర్తయ్యేట్లు చేసింది. ఇక నామినేషన్‌ ప్రక్రియలో తన బూతు పురాణంతో తమన్నా మళ్లీ రెచ్చిపోయింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో గ్రూపులున్నాయని మహేష్‌, బాబా భాస్కర్‌లు మాట్లాడుకున్నారు. ఎవరిని నామినేట్‌ చేయాలి? అని ఇద్దరు చర్చించుకున్నారు. చాయిసెస్‌ టాస్క్‌లో భాగంగా వితికా షెరు రెడ్‌ బటన్‌, రవికృష్ణ గ్రీన్‌ బటన్‌ నొక్కారు. దీంతో మగవారంతా ఈ వారం లివింగ్‌ రూమ్‌లోనే పడుకోవాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఇక నామినేషన్‌ ప్రక్రియలో పునర్నవి, తమన్నాలు హైలెట్‌గా నిలిచారు. ఈ సారి కన్ఫెషన్‌ రూమ్‌లో కాకుండా లివింగ్‌ ఏరియాలో నామినేషన్‌ ప్రక్రియను పెట్టాడు. ఎవరినైతే నామినేట్‌ చేయదల్చుకున్నారో ఆ కంటెస్టెంట్‌ నుదురు మీద తప్ప.. మిగతా చోట్ల స్టాంప్‌ వేసి.. నామినేట్‌ చేయడానికి గల కారణాలను వివరించాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఇక ఈ వరుసలో ముందుగా తమన్నా- బాబా భాస్కర్‌, రోహిణి.. రాహుల్‌-మహేష్‌, అలీ రెజా.. వితికా- శివజ్యోతి, బాబా భాస్కర్‌.. మహేష్‌- రాహుల్‌, పునర్నవి.. శివజ్యోతి-వితికా, తమన్నా.. అషూ రెడ్డి-శ్రీముఖి, తమన్నా.. హిమజ-రాహుల్‌, పునర్నవి.. వరుణ్‌- మహేష్‌, శ్రీముఖి.. బాబా భాస్కర్‌- వితికా, పునర్నవి.. రవికృష్ణ- తమన్నా, హిమజ.. అలీ రెజా-తమన్నా, రాహుల్‌.. రోహిణి-తమన్నా, పునర్నవిలను నామినేట్‌ చేశారు. ఇక పునర్నవి తనకు తాను నామినేట్‌ చేసుకుంటున్నట్లు ప్రకటించి స్టాంప్‌ వేసుకుంది. ఇక అక్కడి నుంచి మొదలైంది రణరంగం. (పునర్నవికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌)

తనను మొదటి వారం నుంచి కార్నర్‌చేశారని.. తాను అందరితో కలిసిపోయేందుకు ప్రయత్నించినా.. అవే కారణాలతో నామినేట్‌ చేస్తున్నారని పునర్నవి ఫైర్‌ అయింది. తనకు హౌస్‌లో ఉండాలనిపించట్లేదని తనకు తాను నామినేట్‌ చేసుకున్నట్లు తెలిపింది. అయితే బిగ్‌బాస్‌ నియమాల ప్రకారం ఎవరికి వారు నామినేట్‌ చేసుకోవడం కుదరదని తెలిపాడు. ఈ కారణంగా హౌస్‌మేట్స్‌ అందర్నీ నామినేట్‌ చేయవలసి వస్తుందని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఈ సీజన్‌ మొత్తం నామినేషన్‌లోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించాడు. అయినా పర్లేదు అందర్నీ నామినట్‌ చేయండని భీష్మించుకుని కూర్చుంది. హౌస్‌మేట్స్‌ అందరూ ఆలోచించుకుని ఏకాభిప్రాయానికి రండి అంటూ బిగ్‌బాస్‌ కొంతసమయం ఇచ్చాడు. ఇక పునర్నవి తనను తాను నామినేట్‌ చేసుకోగానే.. లేడీ టైగర్‌ అంటూ తమన్నా చప్పట్లు కొట్టింది.

అయితే పునర్నవిని ఒప్పించేందుకు వరుణ్‌ ప్రయత్నించాడు. తమను కావాలనే టార్గెట్‌ చేశారని.. రాహుల్‌, వితికా, తనను మాత్రమే ఎక్కువమంది నామినేట్‌ చేశారని.. ఇదంతా కావాలనే చేస్తున్నారని మనమంతా ఓ గ్రూప్‌ అంటూ టార్గెట్‌ చేస్తున్నారంటూ పునర్నవి వరుణ్‌తో చెప్పుకొచ్చింది. ఒకవేళ తాను కెప్టెన్‌ కాకుంటే అందరూ నామినేట్‌ చేసేవారని వరుణ్‌తో పునర్నవి చెప్పుకొచ్చింది. అయితే వారు అలా చేస్తున్నారని మనం కూడా అలానే చేస్తామా? అంటూ నామినేషన్‌ విషయంలో ఒకసారి ఆలోచించమని సర్ది చెప్పసాగాడు. చివరకు పునర్నవి తిరిగొచ్చి.. బాబా భాస్కర్‌, శివజ్యోతిని నామినేట్‌ చేసింది. హౌస్‌లో అందరికీ బాబా భాస్కర్‌ హీరోనేమో కానీ తనకు కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. బాబా భాస్కర్‌ కూడా హౌస్‌లో ఓ కంటెస్టెంటే అని చెప్పుకొచ్చింది. 

ఇక తమన్నా మాత్రం తన నోటికి అడ్డూఅదుపు లేకుండా రవికృష్ణను టార్గెట్‌ చేస్తూ వచ్చింది. (సిగ్గులేదురా.. అంటూ రెచ్చిపోయిన తమన్నా) తన మాటలకు రవికృష్ణ మౌనంగానే ఉన్నా.. తమన్నా మాత్రం కంట్రోల్‌ తప్పి ఇష్టమున్నట్లు మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఇక ఈ విషయమై మిగతా హౌస్‌మేట్స్‌ తమన్నాతో వారించినా.. ఫలితం లేకపోయింది. ఎవరి మాట వినకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూనే ఉంది. మధ్యలో పునర్నవి మాట కాస్త విన్నట్లు కనిపించినా.. మళ్లీ మొదటికే వచ్చింది. మిస్టర్‌ పప్పు అంటూ పిచ్చిపిచ్చిగా వాగింది. తమన్నా ఇంత చేస్తున్నా.. రవికృష్ణ మాత్రం నోరు మెదపకుండా సైలెంట్‌గానే ఉన్నాడు. ఇక నామినేషన్‌ ప్రక్రియే ఇంత రసవత్తరంగా సాగితే.. మున్ముందు ఈ వారంలో ఇంకేం జరుగుతాయో అన్నది చూడాలి.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement