రాహుల్ సిప్లిగంజ్.. మొన్నటి దాకా సినీ నేపథ్య గాయకుడు. మరి నేడు.. బిగ్‌బాస్–3 విజేత.అత్యంత సాధారణ యువకుడిగా ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి అడుగుపెట్టినఈ కుర్రాడు.. ప్రారంభంలో అంతంత మాత్రం ప్రదర్శన ఇచ్చినా.. రోజులు గడుస్తున్న కొద్దీ చక్కటి ప్రతిభతో పెద్ద సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో అంతిమ లక్ష్యాన్నిచేరుకున్నాడు. అంతేనా.. లక్షల మంది అభిమానించే మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా ట్రోఫీని అందుకుని రూ.50 లక్షల విజేతగా నిలిచాడు. పాతబస్తీ గల్లీల్లో చక్కర్లు కొట్టే ఈ కుర్రాడు ఇప్పుడు స్టారైపోయాడు. దాదాపు 105 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఇతడిపై బోలెడు ‘ప్రేమ కథలు’ పుట్టుకొచ్చినా అవన్నీ ‘ట్రాష్’ అంటూ కొట్టిపారేశాడు. రాహుల్ ‘సాక్షి’తో పంచుకున్న మరిన్ని ముచ్చట్లు
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్–3 విజేతగా నిలిచి తెలుగు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సంచలనం సృష్టించారు. 105 రోజుల పాటు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ షోతో ప్రేక్షకుల మనసు దోచారు ఆయన. పక్కా లోకల్ బాయ్ విజయంతో నగర యువత ఉత్సాహానికి హద్దులే లేకుండా పోయాయి. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా రూ.50 లక్షలనగదుతో పాటు ట్రోఫీ అందుకోవడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటన అని.. తన జీవితంలో ఇదే పెద్ద అచీవ్‌మెంట్ అని రాహుల్ ఆనందం వ్యక్తం చేశారు. గత జూలై 21న ప్రారంభమైన సీజన్– 3 చివరిదాకా ఎంతో ఉత్కంఠగా సాగింది. ఎలాంటి అంచనాలు లేకుండా సాధారణ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన రాహుల్ ప్రారంభంలో అంతంతమాత్రంగానే ప్రదర్శన ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక్కో వారం గడిచేకొద్దీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. అభిమానులను పెద్ద సంఖ్యలో పెంచుకుంటూ తన సన్నిహితురాలు పునర్నవితో స్నేహాన్నీ కొనసాగించారు. వీరిద్దరి ఫ్రెండ్‌షిప్ ఎన్నో మలుపులు తిరిగింది. ఎన్నో రూమర్లూ వచ్చాయి. ఇద్దరూ ప్రేమలో పడ్డారని కూడా అంతా భావించారు. ఇది ఒకరకంగా రాహుల్‌కు కూడా పబ్లిసిటీ పరంగా కలిసొచ్చింది. 105 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి చివరకువిజేతగా నిలిచిన పాతబస్తీ కుర్రోడు రాహుల్ బుధవారం ‘సాక్షి’తోముచ్చటించారు. తన అనుభవాలు, అనుభూతులు, పునర్నవితో స్నేహం, భవిష్యత్ ప్రణాళికలపై ఇలా మనసు విప్పి మాట్లాడారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి
ఆ రోజు ఏడ్చేశా..
‘‘పునర్నవి నాకు వెరీ స్పెషల్. మా ఇద్దరిదీ జాన్ జిగిరీ దోస్తాన్. మాటల ద్వారా ఇష్టాల ద్వారా మేమిద్దరంబాగా దగ్గరయ్యాం. మా ఇద్దరి అభిప్రాయాలు బాగాకలిశాయి. ఇద్దరం ముఖం మీదనే మాట్లాడుతూ ముక్కుసూటిగా చెబుతుండేవాళ్లం. మనలాగే ఆలోచించే వ్యక్తి మన స్నేహితులైతే ఎంత బాగుంటుందో అలాగే మేమిద్దరం ఉన్నాం. ఆమెతో ప్రేమలో ఉన్నానని వచ్చిన రూమర్లు సరైనవి కావు. మా ఇద్దరిదీ స్నేహం మాత్రమే. మా పరిచయం హౌస్‌లో ఉన్నప్పుడే జరిగింది. బయటికొచ్చాక కూడా ఆ స్నేహాన్ని కొనసాగిస్తాం. మాది విడదీయలేని బంధం. హౌస్‌లో ఆమెను అందరూ పున్ను అని పిలిచేవారు. నేను ‘నవీ’ అని ప్రేమగా పిలిచేవాణ్ని. ఆమె ఎలిమినేట్ అయిన రోజున బాగా ఏడ్చాను. రెండు మూడ్రోజుల తర్వాత ఒంటరి వాణ్నయ్యానని ఫీలింగ్ వచ్చింది.టాస్క్‌లతో, స్నేహితుల ముచ్చట్లతో మామూలు మనిషినయ్యా.’’
మలైపాయ.. ఇరానీ చాయ్ ఇష్టం..
పాతబస్తీలోని బిస్మిల్లా హోటల్‌లో మలైపాయ తినడం అంటే బాగా ఇష్టం. వారంలో నాలుగైదుసార్లు అర్ధరాత్రి 2 గంటలకు వెళ్లి నా స్నేహితులు భాస్కర్, చందు, సొహైల్, నోయల్, జోయల్‌తో కలిసి మలైపాయ తింటాను. అది తింటుంటే ఆహా.. ఏమిరుచి.. అన్న ఫీల్ కలుగుతుంది. ఇక మల్లేపల్లి డైమండ్ హోటల్‌లో ఇరానీ చాయ్ తాగుతూ బాతాఖానీ కొట్టడం బాగా ఇష్టం. నేను ఎక్కువగా ఇరానీ హోటల్‌లోనే ఫ్రెండ్స్‌తో కలిసి చాయ్ తాగుతాను.
నా కెరీర్ ఇలాప్రారంభమైంది..
యూట్యూబ్ ద్వారా గాయకుడిగా కెరీర్ ప్రారంభించాను. సంగీతం కంపోజ్ చేస్తూనే పాటలు పాడేవాడిని. 2009లో వచ్చిన జోష్ సినిమాతో గాయకుడిగా మారాను. అదే సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించాను. అనంతరం దమ్ము, ఈగ, లై, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా, రంగస్థలం, ఇస్మార్ట్ శంకర్ తదితర చిత్రాల్లో పాటలు పాడాను. నాకంటూ ఓ గుర్తింపు లభించింది. బిగ్‌బాస్ హౌస్‌కు ఎంపికయ్యా.
పాతబస్తీలో పుట్టి పెరిగా..
నేను పుట్టి పెరిగింది పాతబస్తీలో. పదో తరగతి వరకు లయోలా స్కూల్‌లో, ఇంటర్ నారాయణ కాలేజీలో చదివా. దూర విద్యద్వారా డిగ్రీ పూర్తి చేశాను. నాన్న రాజ్‌కుమార్ హెయిర్ స్టైలిస్ట్. అబిడ్స్‌లోని ఓ హోటల్‌లో షాపు ఉంది. హలో బ్రదర్ సినిమా ఈ హోటల్‌లోనే ఓ సీన్ జరిగిన విషయాన్ని హౌస్‌లో ఉండగా నాగార్జునతో చెప్పాను. అమ్మ సుధారాణి గృహిణి. చెల్లెలికి వివాహమైంది. ముంబైలో ఉంటోంది. తమ్ముడు నిఖిల్ అమెరికాలో చదువుకుంటున్నాడు.
మెగాస్టార్ ప్రశంసించారు..
బిగ్‌బాస్–3 విన్నర్‌గా చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాను. ఆయన బర్త్‌డే ఆగస్టు 22. నా బర్త్‌డే కూడా ఆగస్టు 22. ఇదే విషయాన్ని చిరంజీవితో చెప్పాను. ఆయన వెరీగుడ్ అంటూ ప్రశంసించారు. రూ.50 లక్షలు గెలిస్తే ఏం చేస్తావని వ్యాఖ్యాత నాగార్జున ప్రశ్నించినప్పుడు నా కులవృత్తి సెలూన్ పెట్టుకుంటానని చెప్పాను. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్న తర్వాత సెలూన్ పెట్టుకుంటాను. తప్పనిసరిగా సెలూన్ పెట్టుకోవాలనేది నా లక్ష్యం.
టెన్షన్‌కు గురయ్యాను..
బిగ్‌బాస్– 3 హౌస్‌లోకి వెళ్లినప్పుడు నేను సాధారణ కంటెస్టెంట్‌ని. బయట ఏం జరుగుతోందో తెలియదు. 105 రోజుల ప్రయాణం తర్వాత వచ్చిన ఓటింగ్ శాతం చూస్తే నాకు ఇంతమంది అభిమానులున్నారా? అని ఆశ్చర్యపోయాను. నా ప్రదర్శన ఇంతమందికి నచ్చుతుందన్న విషయం లోపలున్న నాకసలే తెలియదు. విన్నర్ అని ప్రకటించేవరకూ టెన్షన్‌కు గురయ్యాను. హౌస్‌లో నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. బిగ్‌బాస్ టాస్క్‌లు పెట్టడంతో మనుషుల్లోని రియాల్టీ బయటపడుతుంది. ఎమోషన్స్ అన్నీ వెలికివస్తాయి.
ప్రయత్నంలో ఫైటింగ్ ఉండాలి..
యూత్ చేసే పనిలో జెన్యూనిటీ ఉంటే తప్పనిసరిగా విజయం వరిస్తుంది. ప్రయత్నంలో ఫైటింగ్ ఉండాలి. లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుగానే సంసిద్ధులు కావాలి. ఏమాత్రం వెనకడుగు వేయొద్దు. ధైర్యం కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే విజయాలు వరిస్తాయని బిగ్‌బాస్– 3 విజేతగా రుజువు చేశా.
పాతబస్తీ అందాలు మస్త్..
మీకో విషయం చెప్పాలి. హైదరాబాద్‌లాంటి సిటీ దేశంలో ఎక్కడా ఉండదు. ముఖ్యంగా పాతబస్తీ అందాలు అన్నీ ఇన్నీ కావు. నాకు హైదరాబాద్‌తో అనుబంధం ఎక్కువ. మిగతా ఏ నగరానికి వెళ్లినా ఈ అనుభూతులు, ఆనందాలు ఉండవు. నేను ఫ్రెండ్స్‌తో రాత్రిపూట ఎక్కువగా పాతబస్తీలోనే చక్కర్లుకొడుతుంటా.
గోడ దూకి బయటపడ్డా..
బిగ్ బాస్– 3 విజయంతో నాకు దిమాక్ ఉందని మా ఇంట్లో వాళ్లకు అర్థమైపోయింది. ఈ విషయంలో రవి కూడా అన్నాడు.. నేను నిన్ను చూసి ఇన్‌స్పైర్ అయ్యానని. ఇందుకు తమన్నా సింహాద్రి ఇష్యూనే పేర్కొనవచ్చు. దాంతో పాటు హేమా ఇష్యూ సైతం అందరికీ తెలిసిందే. చెప్పాలంటే మా అయ్యకే భయపడం.. బయట వాళ్లకి ఏం భయపడతాం. పాతబస్తీ పోరగాడుగా రియాల్టీ షో విన్నర్ కావడంతో మా ఇంట్లో వాళ్లు చాలా ఆనందపడుతున్నారు. మా ఇంటికి అభిమానులు పోటెత్తుతున్నారు. ఒక దశలో గోడ దూకి బయటపడాల్సి వచ్చింది. తెలుగులో పాప్ ఆర్టిస్ట్‌గా ఎదగాలని ఉంది. పునర్నవి విషయానికి వస్తే ఆమెదీ నాదీ మంచి క్యూట్ థింక్స్. ఆమెతో నేను ప్రేమలో ఉంటే చెప్పేంత «ధైర్యం ఉంది.
శ్రీముఖి కంగ్రాట్స్‌చెప్పిందో లేదో గమనించలేదు..
నేను విన్నర్‌నయ్యాయని తెలియగానే శ్రీముఖి నన్ను అభినందించలేదనే విషయం మీరడిగేదాకా నాకు తెలియదు. గెలిచిన ఆనందంలో నా మైండ్ బ్లాంక్ అయింది. ఏం జరుగుతోందో అర్ధగంటదాకా తేరుకోలేకపోయాను. అందుకే శ్రీముఖి నన్ను కంగ్రాట్స్ చేసిందా.. లేదా? గమనించలేదు.
నేనా.. హీరోగానా..?
నాకు ప్రభాస్ అంటే బాగా ఇష్టం. తమిళంలో రజనీకాంత్, సూర్యను బాగా ఇష్టపడతా. అయితే.. నన్ను ప్రేక్షకులు హీరోగా చూస్తారని అనుకోవడం లేదు. ఇప్పటికైతే పాటలు పాడుతుంటా. ఒకవేళ హీరోలకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ వస్తే మాత్రం చేస్తా.
ప్రేమలో పడ్డాను..పేరు చెప్పలేను..
ప్రేమలో పడ్డమాట వాస్తవమే. ఎవరన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేను. తప్పనిసరిగా ప్రేమ వివాహమే చేసుకుంటాను.
Comments
Please login to add a commentAdd a comment