బిగ్‌బాస్‌ : 50 లక్షలు ఎవరివి? | Bigg Boss 3 Telugu: Who Will Be The Winner | Sakshi
Sakshi News home page

50 లక్షలు ఎవరివి?

Published Sun, Nov 3 2019 12:03 AM | Last Updated on Sun, Nov 3 2019 11:18 AM

Bigg Boss 3 Telugu: Who Will Be The Winner - Sakshi

తెలుగువాళ్లు రెండుగా విడిపోయారు. ఐదేళ్ల క్రితమే ‘ప్రత్యేక తెలంగాణ’ పేరుతో విడిపోయారుగా.. ఇప్పుడేమిటి మళ్లీ విడిపోవడం? అప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయింది తెలుగు ప్రజలు. ఇప్పుడు విడిపోయింది రెండు రాష్ట్రాల్లోని తెలుగు వీక్షకులు. వీళ్లను విడదీసింది నాయకులు కాదు.‘బిగ్‌బాస్‌–3’ టీవీ షోలోని నటీనటులు.

నటీనటులు కూడా కాదు. కంటెస్టెంట్‌లు. ఈ వంద రోజులూ ఒకరితో ఒకరు ఆడి, పాడి, పోట్లాడి.. పోటీలో చివరికి ఐదుగురు మిగిలారు. ఆ ఐదుగురిలో ప్రధానంగా ఇద్దరిపైనే అందరి చూపు ఉంది. శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌. వీళ్లిద్దరిలో ఎవరు విజేత అవుతారన్నదానిపైనా తెలుగు టీవీ వీక్షకులు రెండుగా విడిపోయారు!

బిగ్‌బాస్‌ 3 షోలో యాభై లక్షల ప్రైజ్‌మనీని శ్రీముఖి కొట్టేస్తుందని సగం మంది. కాదు కాదు.. ఆ యాభై లక్షలు రాహుల్‌నే వరిస్తాయని మిగతా సగం మంది! మరి మిగిలిన ముగ్గురిలో అలీకి ఏం తక్కువైంది? బాబా భాస్కర్‌కి ఏం ఎక్కువైంది? వరణ్‌ సందేశ్‌కి ఎక్కువ తక్కువలు ఏం ఉన్నాయి? వాళ్లెందుకు మొదటి ఇద్దరిలో స్థానం సంపాదించుకోలేక పోయారు? సంపాదించుకోలేదని ఎవరన్నారు? ఈ ఐదుగురి స్థానం గత కొన్ని రోజులుగా వెనుకా ముందు, ముందూవెనుక అవుతూ.. ప్రయారిటీ లిస్ట్‌లోకి ప్రధాన పోటీదారులుగా శ్రీముఖి, రాహుల్‌ వచ్చేశారు. పందేలు ప్రధానంగా వీళ్లిద్దరి మధ్యే నడుస్తున్నాయి. చెప్పలేం. ఈ సాయంత్రం లోపు రాతలు తారుమారవచ్చు.

వీక్షక ఓటర్లు పైకొకటి చెప్పి, లోపల ఇంకొరికి ఓటేస్తూ తమ సెల్‌ఫోన్‌ బటన్‌ నొక్కొచ్చు. అప్పుడు శ్రీముఖీ, రాహుల్‌ కాకుండా వేరెవరైనా విజేతలవచ్చు. వీళ్లయిదుగురి స్పెషాలిటీ ఏంటి? వీళ్లలో మళ్లీ ఆ ఇద్దరి ప్రత్యేకతలేంటి? చూసే ఉంటారుగా. రాహుల్‌ సిప్లిగంజ్‌ గాయకుడు. శ్రీముఖి యాంకర్‌. వరుణ్‌ సందేశ్‌ నటుడు. బాబా భాస్కర్‌ కొరియోగ్రాఫర్‌. అలీ (అలీ రెజా).. ఇతనూ యాక్టరే. ఇతడి తొలి సినిమా ‘గాయకుడు’. రాబోయే సినిమా ‘సినీ మహల్‌’. వీళ్ల గురించి ఇంతవరకు చాలు. మిగతా 12 మంది కంటెస్టెంట్‌ల పేర్లు కూడా ఒకసారి ఏకబిగిన చెప్పేసుకుందాం. పాపం ఇన్ని రోజులు మనల్ని ఎంటర్‌టైన్‌ చేశారు కదా.  బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆటాడింది  మొత్తం 17 మంది.

అంతమంది ఉన్నారా! ఉన్నారు. మీరు చూశారు. ఈ పదిహేడు మందిలో పదిహేను మంది ఒరిజినల్‌ కంటెస్టెంట్‌లు. రాహుల్, శ్రీముఖి. వరుణ్‌ సందేశ్, బాబా భాస్కర్, అలీ, శివజ్యోతి, వితిక, మహేశ్, పునర్నవి, రవికృష్ణ, హిమజ, అశురెడ్డి, రోహిణీరెడ్డి, జాఫర్‌ బాబు, హేమ.. వీళ్లు ఒరిజినల్‌. మిగిలిన ఇద్దరు.. శిల్పా చక్రవర్తి, తమన్నా సింహాద్రి.. వైల్డ్‌ కార్డ్‌తో హౌస్‌లోకి ఎంటర్‌ అయినవాళ్లు. ప్రస్తుతం మిగిలిన ఐదుగురు తప్ప అంతా ఎలిమినేట్‌ అయ్యారు. రాహుల్‌ కూడా ఎలిమినేట్‌ అయ్యాడు కానీ.. అది ఫేక్‌ ఎలిమినే షన్‌. అతడిని సీక్రెట్‌ రూమ్‌లో ఉంచారు. ఇదంతా ఆటలో భాగం. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో విజేత శివబాలాజి. రెండో సీజన్‌లో విజేత కౌశల్‌. మొదటి రెండు సీజన్‌లలోనూ మగవాళ్లకే ప్రైజ్‌ మనీ రావడంతో ఈసారి కచ్చితంగా శ్రీముఖే గెలుస్తారని ఒక అంచనా.

మొన్నటి వరకు ఆమెకు పోటీగా శివజ్యోతి ఉంటుందని భావించారు కానీ, శివజ్యోతి కూడా ఎలిమినేట్‌ అయిపోవడంతో మిగిలిన ఐదుగురు ఫైనలిస్ట్‌లలో ఏకైక మహిళ అయిన శ్రీముఖికే ఎక్కువ చాన్స్‌ ఉందని వీక్షకులు ఊహిస్తున్నారు.అయితే శనివారం సాయంత్రం వరకు అందుబాటులో ఉన్న వీక్షకుల ఓటింగ్‌ అంచనాల ప్రకారం విజేతగా రాహుల్‌ మొదటి స్థానంలో ఉండగా, వరుణ్‌ సందేశ్, శ్రీముఖి.. రెండు, మూడు స్థానాలలో ఉన్నారు. ‘యాభై లక్షల ప్రైజ్‌ మనీ గెలిస్తే ఏం చేస్తావు? అనే ప్రశ్న వచ్చినప్పుడు రాహుల్‌ చెప్పిన సమాధానం కూడా వీక్షకుల గుండెల్లో హత్తుకుపోయింది. ‘ఆ డబ్బుతో బార్బర్‌ షాపు’ పెడతాను అని రాహుల్‌ అన్నాడు. కులవృత్తి మీద అతడికున్న గౌరవానికి ఆ క్షణమే బిగ్‌బాస్‌ వీక్షకులు ఫ్లాట్‌ అయిపోయి ఉంటారు.

దాంతో అతడి గెలుపుపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక అతడికి ప్రధాన పోటీదారు అనుకుంటున్న శ్రీముఖి తరఫున పెద్ద సైన్యమే బయటి నుంచి పని చేస్తోంది. టాప్‌ యాంకర్‌గా ఆమెకున్న ఫాలోయింగే ఆమెను గెలిపిస్తుందని ధీమాగా చెబుతున్నవాళ్లు చాలామందే ఉన్నారు. శ్రీముఖికి ‘బుల్లితెర రాములమ్మ’ అని పేరు. సెలబ్రిటీలు సైతం ఆమెను గెలిపించమని ప్రతి వేదికపై పోస్టింగ్‌లు పెడుతున్నారు. చూద్దాం ఏమౌతుందో. విజేతలు ఎవరైనా.. స్టార్‌ మా చానెల్‌లో ఈ సాయంత్రం జరిగే ‘లైవ్‌’ ముగింపు కార్యక్రమం మాత్రం మూడు గంటలపాటు ఓ మహోత్సవంగా జరగబోతోంది. మొత్తం పదిహేడు మంది కంటెస్టెంట్లూ మళ్లీ ప్రత్యక్షం అవుతారు. ‘షో’ హోస్ట్‌లు నాగార్జున, రమ్యకృష్ణ ఎలాగూ ఉంటారు. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా స్టార్‌ హీరో చిరంజీవి కనిపించినా ఆశ్చర్యం లేదు.

‘షో’ని హిట్‌ చేసిందెవరు?
సందేహమే లేదు.. కంటెస్టెంట్‌లే! ప్రతి కంటెస్టెంటూ వీక్షకుల్ని ఆకట్టుకున్నారు. అల్లరితో, కన్నీళ్లతో, ఇతరత్రా ఎమోషన్‌లతో అత్యంత సహజంగా బిగ్‌బాస్‌ పెట్టిన టాస్క్‌లన్నీ పూర్తి చేశారు. ఒకరిద్దరు ఓవర్‌ రియాక్ట్‌ అయ్యారు. వాళ్లను నాగార్జున మందలించారు. సీరియస్‌గా తీసుకోవద్దని చెప్పారు. కొందరిని అభినందించారు. ‘షో’ బిగి తగ్గకుండా నడుపుతూ హోస్ట్‌ చేసిన నాగార్జున కూడా హిట్‌కు ప్రధాన కారకులే. రమ్యకృష్ణ కూడా హోస్ట్‌గా ఉన్న కొద్ది రోజులూ డీసెంట్‌గా, ప్లెజెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌ను చక్కబెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement