పట్నా : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్‌లోని బంధుప్రీతి కారణంగానే అతడు చనిపోయాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్‌ఖాన్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, సంజయ్ లీలా బన్సాలీలపై కేసు నమోదు చేయాలని బిహార్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌ను బుధవారం కోర్టు కొట్టివేసింది. స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ముజఫర్‌పూర్ చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముకేశ్ కుమార్ తిరస్కరించారు. ఇది న్యాయస్థానాల పరిధిలోని అంశం కాదని ఆయన వ్యాఖ్యనించారు. (ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూత)
కాగా, సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డ 3 రోజుల తర్వాత సుధీర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అందులో సాక్షులుగా.. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఉందని తీవ్ర విమర్శలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరును చేర్చారు. మరోవైపు తన పిటిషన్‌ను కొట్టివేయడంపై సుధీర్ స్పందిస్తూ.. ఈ తీర్పును జిల్లా కోర్టులో సవాలు చేయనున్నట్టు తెలిపారు. సుశాంత్ మరణం బిహార్ వాసుల్లో బాధను నింపిందని.. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వారికి శిక్షపడేందుకు పోరాడాల్సి ఉందని చెప్పారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యకు వెనక కుట్ర దాగి ఉందని అతని అభిమానులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment