బాబీసింహా చిత్ర విడుదలపై సందిగ్ధం
నటుడు బాబీసింహా చిత్రం చర్చల్లో చిక్కుకుంది. జిగర్‌తండా చిత్రంలో విలన్‌గా అట్టహాసం చేసి జాతీయ అవార్డును కైవసం చేసుకున్న యువ నటుడు బాబీసింహా. ఆ తరువాత కూడా ప్రతి నాయకుడిగా కొన్ని చిత్రాల్లో నటించిన ఈయన కథానాయకుడిగా అవతారమెత్తారు. అలా ఆయన హీరోగా నటించిన చిత్రాల్లో పాంబుసట్టై ఒకటి. కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఆటమ్ దాసన్ దర్శకత్వంలో నటుడు మనోబాలా నిర్మించారు. చాలా కాలం నిర్మాణంలో ఉన్న పాంబుసట్టై చిత్రం ఎట్టకేలకు విడుదలకు ముస్తాబవుతోంది. అయితే చిత్రానికి సెన్సార్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కారణం చిత్రంలో బాబీసింహా ఒక సన్నివేశంలో నగ్నంగా నటించారట. దీంతో అలాంటి కొన్ని సన్నివేశాలను తొలగించి చూపించండి చిత్రానికి (యూ) సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పారని సమాచారం.
బాబీసింహా నటించిన నగ్న దృశ్యాలను ఒక్క షాట్‌లో కాకుండా వివిధ కోణాల్లో చిత్రీకరించారనీ, చిత్ర కథకు ప్రాధాన్యం ఉన్న ఆ సన్నివేశాలను కత్తిరించడానికి చిత్ర యూనిట్‌కు ఇష్టం లేదని సమాచారం. అయితే తాము అభ్యంతరం చెప్పిన సన్నివేశాలను తొలగిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు సభ్యులు అంటున్నారట. దీంతో ఈ నెల 30వ తేదీన పాంబుసట్టై చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించినా, ఆ తేదీని మాత్రం ప్రకటనల్లో వెల్లడించడం లేదు. దీంతో సాంబుసట్టై చిత్ర విడుదలపై సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు.