కోర్టు ధిక్కారం కేసులో బాలీవుడ్ నటుడికి జైలు
కోర్టు ధిక్కారం కేసులో బాలీవుడ్ నటుడికి జైలు
Published Wed, Dec 4 2013 4:33 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
న్యూఢిల్లీ: ఒక కేసులో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్, అతడి భార్య రాధకు మంగళవారం ఢిల్లీ హైకోర్టు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ఎం.జి.అగర్వాల్ అనే వ్యక్తి నటుడు రాజ్‌పాల్ యాదవ్‌పై రూ.5 కోట్లకు రికవరీ కేసు పెట్టాడు. దీనిపై విచారణకు రాజ్‌పాల్ దంపతులు కోర్టుకు హాజరు కావడంలేదు. దీంతో ఆగ్రహం చెందిన జస్టిస్ ఎస్.మురళీధర్ నిందితుడికి 10 రోజుల జైలు శిక్ష విధించారు. అతడి భార్యను కోర్టు సయయం ముగిసినంతవరకు కస్టడీ ఉండేలా శిక్ష విధించారు. నిందితులు విచారణకు హాజరు కాకుండా కోర్టు సమయాన్ని వృథాచేస్తున్నారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కోర్టు విచారణకు హాజరు కావాలని ఎన్నిసార్లు చెప్పినా తప్పుడు సమాచారమిస్తూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు నిందితులు ప్రయత్నించారన్నారు. వారి తరఫు న్యాయవాదులు సైతం తప్పుడు సాక్ష్యాధారాలను ప్రవేశపెడుతూ కోర్టు సమయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో నిందితులు కోర్టు ధిక్కారానికి మరింత పాల్పడకుండా చేసేందుకు ప్రధాన నిందితుడైన నటుడు యాదవ్‌కు 10 రోజుల జైలు శిక్ష (తక్షణమే అమలయ్యేలా..) విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇదిలా ఉండగా, యాదవ్ భార్య రాధకు సంబంధించి తప్పుడు సమాచారం అందించిన ఆమె న్యాయవాదికి సైతం నోటీసు జారీ చేశారు. అలాగే ముంబైలోని మలాడ్‌లో ఉన్న రాజ్‌పాల్‌యాదవ్, అతడి భార్యకు యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్న జాయింట్ ఎకౌంట్‌ను , వారి కంపెనీ అకౌంట్‌ను సైతం వారంలోగా అటాచ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2010లో ఒక హిందీ సినిమా నిర్మాణం కోసం రాజ్‌పాల్ , అతడి భార్య కలిసి ఢిల్లీకి చెందిన వ్యాపారి ఎం.జి.అగర్వాల్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే దాన్ని ఇప్పటివరకు తీర్చకపోవడంతో అతడు బాకీ రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాడు.
Advertisement