
శ్రీదేవి (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి (54) ఇకలేరు. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లిన ఆమె తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని బోని కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ ధ్రువీకరించారు.
శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. శ్రీదేవి మరణించిన సమయంలో భర్త బోని కపూర్, కూతురు ఖుషి పక్కనే ఉన్నట్లు చెప్పారు. 1963 ఆగష్టు 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు. శ్రీదేవి అసలు పేరు ‘శ్రీ అమ్మా యాంగేర్ అయ్యపాన్’. తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన ఆమె తనకంటూ ఓ పత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
1975 చిన్నతనంలో తునాయివన్ సినిమాతో సినీ రంగంలోకి ప్రేవేశించిన శ్రీదేవి.. భారతదేశంలోని గొప్ప నటీమణుల్లో ఒకరిగా ఎదిగారు. తెలుగులో శ్రీదేవి తొలి చిత్రం ‘మా నాన్న నిర్దోషి’. తెలుగు తెరపై అగ్రహీరోలందరితోనూ ఆడిపాడి అతిలోకసుందరిగా వెలుగొందారు. తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మళయాళంలో 26, కన్నడంలో 6 చిత్రాల్లో నటించారు.
2017లో చివరిగా ‘మామ్’ చిత్రంలో నటించారు. తన కెరీర్‌లో 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు. బాలీవుడ్‌లో తెరంగేట్రం తర్వాత 1996లో బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. శ్రీదేవి-బోనికపూర్ దంపతులకు జాన్వీ, ఖుషిలు ఉన్నారు. పెద్దమ్మాయి జాహ్నవి తొలి చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.
సినీ రంగానికి శ్రీదేవి అందించిన సేవలకు గుర్తుగా 2013లో భారత ప్రభుత్వం శ్రీదేవికి పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రధానం చేసింది.






Comments
Please login to add a commentAdd a comment