తెర నిండా... నిజజీవిత చిత్రాలు | Bollywood Movies Based On Real Life Stories | Sakshi
Sakshi News home page

తెర నిండా... నిజజీవిత చిత్రాలు

Published Mon, Mar 9 2015 10:41 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Bollywood Movies Based On Real Life Stories

బాలీవుడ్
సినిమా కన్నా జీవితం విచిత్రంగా ఉంటుంది. బహుశా, అందుకే, ఈ మధ్య కథల కోసం మన సినిమావాళ్ల కళ్లన్నీ జీవితాల మీద పడ్డాయి.ప్రముఖుల నిజజీవితాలనూ, అందులోని ఆసక్తికరమైన కోణాలనూ తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే ‘పాన్‌సింగ్ తోమర్’, ‘భాగ్ మిల్ఖా భాగ్’, ‘ది డర్టీ పిక్చర్’, ‘మేరీ కోమ్ లాంటి జీవితకథాచిత్రాలు అలరించాయి. హిందీలో ఈ ఏడాది ఇలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. వాటిలో కొన్నింటి గురించి...
 
 ధోనీ - క్రికెట్ కెప్టెనైన టికెట్ ఎగ్జామినర్!
 భారత క్రికెట్ జట్టు సారథి మహేందర్ సింగ్ ధోనీ ఒకప్పుడు టీటీఈ (ట్రైన్ టికెట్ ఎగ్జామినర్)గా పనిచేశారు తెలుసా? క్రికెటర్ కాకముందు బ్యాడ్‌మింటన్, ఫుట్‌బాల్ ఆటగాడిగా జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు. ఇలా చెప్పాలంటే ధోనీ గురించి బోల్డన్ని విశేషాలున్నాయి. ఇలా ధోనీ గురించి చాలామందికి తెలియని విశేషాలతో నీరజ్ పాండే దర్శకత్వం వహించనున్న చిత్రం - ‘ఎం.ఎస్. ధోనీ’. ఇందులో ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించనున్నారు. క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లతో అతిథి పాత్రలు చేయించాలని అనుకుంటున్నారు. ఇంకా షూటింగ్ ఆరంభం కాలేదు.  
 
 అజహరుద్దీన్ - హైదరాబాద్ గల్లీ బుల్లోడు
 హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన క్రికెటర్ అజహరుద్దీన్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. అలాగే రాజకీయాల్లోకి అడుగుపెడతారని కూడా అనుకుని ఉండరు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొన్న అజహర్ వృత్తి జీవితం సంచలనం... వ్యక్తిగత జీవితమూ సంచలనమే. భార్యకు విడాకులివ్వడం, సంగీతా బిజ్లానీతో ప్రేమాయణం సాగించి, పెళ్లి చేసుకోవడం - లాంటివన్నీ వార్తలకెక్కినవే. ఇప్పుడవన్నీ తెరపై చూడనున్నాం. ఆంటోనీ డిసౌజా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అజహర్‌గా ఇమ్రాన్ హష్మీ నటించనున్నారు. పాత్రలో ఒదిగిపోవడానికి హష్మీ రోజూ క్రికెట్ ఆడుతున్నారు.
 
 మహావీర్‌సింగ్ - ఆదర్శప్రాయుడైన మల్లయోధుడు
 మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఎంతో ఆదర్శవంతం. ఇద్దరు కుమార్తెలనూ (గీత, బబిత) మల్లయోధులుగా తయారు చేశారాయన. ఆ విషయంలో సొంత గ్రామస్థుల నుంచీ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. మహిళలు ఎందులోనూ తీసిపోరన్నది మహావీర్ అభిప్రాయం. అలాంటి ఆదర్శమూర్తి జీవితం ఆధారంగా రూపొందనున్న ‘దంగల్’లో మహావీర్ సింగ్‌గా ఆమిర్ ఖాన్ నటించనున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఆమిర్ పంథొమ్మిదేళ్ల కుర్రాడిగా, ఇరవైతొమ్మిదేళ్ల యువకుడిగా, యాభై ఐదేళ్ల వ్యక్తిగా మూడు అవతారాల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం మహావీర్‌గా ఒదిగిపోవడానికి ఆమిర్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
 
 చార్లెస్ శోభరాజ్ - ఓ సీరియల్ కిల్లర్ సీరియస్ కథ!
 సీరియల్ కిల్లర్, బికినీ కిల్లర్‌గా పేరొందిన చార్లెస్ శోభరాజ్ జీవితం వివాదాలమయం. తాలిబన్లకు ఆయుధాలు సరఫరా చేశానని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. జైలర్లకు మిఠాయిల్లో మత్తుమందు కలిపి ఇచ్చి, తీహార్ జైలు నుంచి తప్పించుకున్న ఘనుడు. ఇప్పటికీ పేరు చెప్పగానే ప్రపంచం ఉలిక్కిపడే ఇతగాడి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మై ఔర్ చార్లెస్’. చార్లెస్ పాత్రలో రణదీప్ హుడా నటించగా, ప్రవాళ్ రామన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. చార్లెస్ చేసిన హత్యలు, తీహార్ జైలు నుంచి ఆయన తప్పించుకున్న వైనం ప్రధానాంశాలుగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.  ఈ నెల 13న రిలీజ్. ఈ ఏటి తొలి బయోపిక్ ఇదే.

 సంజయ్ దత్ - కటకటాల్లో ఓ కథానాయకుడు
 ప్రముఖ నటీనటులు సునీల్ దత్, నర్గీస్ దత్‌ల తనయుడు సంజయ్ దత్ నటుడిగా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... మొదటి భార్య రిచా శర్మ మరణించిన తర్వాత ఆయన రియా పిళ్ళైని పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం తన గర్ల్‌ఫ్రెండ్ మాన్యతను పెళ్లి చేసుకున్నారాయన. 1993 నాటి ముంబయ్ వరుస బాంబు పేలుళ్ల కేసులో సుప్రీం కోర్టు ఆయనకు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుణెలోని ఎరవాడ జైలులో సంజయ్ దత్ ఖైదీ. ఆయన జీవితం ఆధారంగా రాజ్‌కుమార్ హిరానీ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో సంజయ్ దత్ పాత్రను రణ్‌బీర్ కపూర్ చేయనున్నారు. సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రకు అమితాబ్ బచ్చన్‌ను ఎంపిక చేశారు. సంజయ్ దత్ విడుదలయ్యాక ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.
 
 షిబ్దాస్ భాదురి  - మైదానంలో బెంగాలీ టైగర్
 ఫుట్‌బాల్ ఆటగాడు షిబ్దాస్ భాదురి 1887లో పుట్టారు. ఈ బెంగాలీ టైగర్ 44 ఏళ్లకే మరణించారు. ప్రతి ఆటగాడికీ ఆయన జీవితం ఆదర్శంగా నిలుస్తుంది. అందుకే, ఆయన జీవితం ఆధారంగా ‘1911’ పేరుతో దర్శకుడు శూజిత్ సర్కార్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో షిబ్దాస్ పాత్రను జాన్ అబ్రహామ్ చేయనున్నారు. ఫుట్‌బాల్ ఆటగాడి బలం అతని కాళ్లల్లో ఉంటుందంటారు. జాన్ అబ్రహామ్‌కి ఆ విషయం తెలుసు కాబట్టే, కొన్ని నెలలుగా ఆయన తన పాదాల మీద దృష్టి పెట్టారు. అసలే కండలు తిరిగిన దేహం.. కానీ, ఆటగాడి పాత్రకు అంతకుమించిన దేహం కావాలనే పట్టుదలతో జాన్ అబ్రహామ్ వర్కవుట్లు చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

అమృతా ప్రీతమ్ - పంజాబీ సరస్వతి  
పంజాబీ భాషలో రచనలు చేసిన తొలి మహిళగా పేరుపొందారు సుప్రసిద్ధ రచయిత్రి అమృతా ప్రీతమ్.  దేశంలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్న మొదటి మహిళ కూడా ఆమే.  రచనల రూపంలో బతికి ఉన్న అమృతా ప్రీతమ్ జీవితం ఆధారంగా నూతన దర్శకుడు జస్మీత్ రీన్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రచయిత్రి పాత్రను సోనాక్షీ సిన్హాతో చేయించాలనుకున్నారట. అమృతా గురించి దర్శకుడు చెప్పిన విశేషాలు విని, ఇందులో నటించే తీరాలని సోనాక్షీ ఫిక్స్ అయ్యారట.
 
 నీర్జా భానోత్- తీవ్రవాదుల చేతిలో బలైన త్యాగమయి
 ధైర్యసాహసాలకు చిరునామా అనిపించుకున్నారు నీర్జా భానోత్. 22 ఏళ్లకే పెళ్లి కావడం, తనువు చాలించడం రెండూ జరిగిపోయాయి. అదనపు కట్నం వేధింపులకు గురై, భర్త నుండి విడిపోయిన నీర్జా విమానంలో సేవలు అందించే యువతిగా చేరారు. ఆమె ప్రయాణిస్తున్న విమానం హైజాక్‌కి గురి కావడంతో, ప్రయాణికులను కాపాడడం తన బాధ్యతగా భావించారు నీర్జా. ఈ క్రమంలో తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. 22 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఈ త్యాగమయి జీవితం ఆధారంగా రామ్ మధ్వానీ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నీర్జా పాత్రకు సోనమ్ కపూర్  మినహా ఎవరూ నప్పరని దర్శకుడు అనుకున్నారట. సోనమ్ కూడా ఈ చిత్రానికి పచ్చజెండా ఊపారని సమాచారం.
 
 ఇవే కాకుండా, హిందీలో ఇంకా అనేక ‘బయోపిక్’లకు రంగం సిద్ధమవుతోంది. చిరస్మరణీయ సినీ గాయకుడు కిశోర్‌కుమార్ జీవితం ఆధారంగా అనురాగ్ బసు ఓ చిత్రం చేయాలనుకుంటున్నారు. ఇందులో కిశోర్ కుమార్ పాత్రకు రణ్‌బీర్ కపూర్‌ను తీసుకోవాలనుకుంటున్నారు. అలాగే, అందాల అభినేత్రి మీనాకుమారి జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందనుంది. సల్మాన్ ఖాన్ జీవిత చరిత్ర కూడా తెరకు రానుందని సమాచారం. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ బేనజీర్ భుట్టో జీవితం ఆధారంగా ఓ చిత్రం రానుందనీ, ఇందులో నటించ డంతో పాటు నిర్మించాలని రవీనా టాండన్ అనుకుంటు న్నారని సమాచారం. ప్రముఖుల కథాకమామిషు తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది కాబట్టి, ఈ జీవిత కథా చిత్రాలకు బోల్డంత క్రేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
 
 - డి.జి. భవాని

                                                              సోనాక్షీ సిన్హా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement