ఒకప్పుడు సలీం జావెద్, సచిన్ బౌమిక్, గుల్జార్... వంటిరచయితలనిచ్చిన బాలీవుడ్ ఇప్పుడు కథకులు లేకకలవరపడుతోంది. కథలు లేక కలత పడుతోంది.బయోపిక్‌లతో కాలం వెళ్లబుచ్చుతోంది. ఈ బాలీవుడ్‌కి ఏమయింది?
రాజ్ కపూర్, కే.ఏ. అబ్బాస్ కలిస్తే డైమండ్ జూబ్లీ సినిమాలు వచ్చేవి.శక్తి సామంత, సచిన్ బౌనిక్ కలిస్తే గోల్డెన్ జూబ్లీ సినిమాలు వచ్చేవి.రమేష్ సిప్పి, జావేద్–అఖ్తర్‌లు కలిస్తే సిల్వర్ జూబ్లీ సినిమాలు వచ్చేవి.హృషికేశ్ ముఖర్జీ– గుల్జార్ కలిస్తే జూబ్లీ టు ది పవర్ ఆఫ్ జూబ్లీ సినిమాలు వచ్చేవి.పూర్వం దర్శకులు, రచయితలు జంటగా ఉండేవారు.రచయితలు కొత్త కొత్త కథలు అల్లి చెప్పేవారు.హిందీ సినిమాను చూసి దక్షిణాది సినిమా ఇన్‌స్పయిర్ అయ్యేది.సినిమా కాగితం మీద పుడుతుంది. కథ వల్ల పుడుతుంది. కథ వల్లే బతుకుతుంది.కాని ఇవాళ బాలీవుడ్‌లో కథ వండే వంటవాళ్లు తక్కువైపోతున్నారు. ఒరిజినల్ కథను కనిపెట్టే వాళ్లు తక్కువైపోతున్నారు. దాంతో బాలీవుడ్ మనుషుల కథల మీద పడింది. నిన్నగాక మొన్న సక్సెస్ చూసిన వాళ్ల బయోపిక్‌లను కూడా తయారుచేయడం మొదలుపెట్టింది. లేదంటే రీమేక్‌ల సుఖానికి అలవాటు పడింది.ఎంతో ఘనమైన బాలీవుడ్‌కు ఈ భావదారిద్య్రం రోజులు రావడం విషాదం.ఒక అమాయకమైన పాలనురగ లాంటి వాడు నగరానికి వస్తే అతడు కలుషితమయ్యి ఎలా మారుతాడనడానికి గుర్తుగా ‘శ్రీ 420’ కథ వచ్చింది. అలాంటి కథలు ఇప్పుడు ఏమయ్యాయి. నేరస్తులను సంస్కరించాలంటే జైలులో ఉన్న నాలుగు గోడలు కాదు కావలసింది మానవత్వం ఉన్న ఒక హృదయం అని చెప్పిన ‘దో ఆంఖే బారా హాత్’ సినిమా వచ్చింది.
అలాంటి కథలు ఇప్పుడు ఏమయ్యాయి. విధి కూడా చిన్నపిల్లాడు లాంటిది... బంధాలు చెరిపేస్తుంది.. తిరిగి కలుపుతుంది అనే థీమ్‌తో విడిపోయి కలిసే అన్నదమ్ముల కథ ‘వక్త్’ వచ్చింది. ఇప్పుడు అలాంటి కథలు రాసేవారు లేరు. సిన్సియారిటీ కూడా కథే అవుతుంది అని ‘జంజీర్’ స్క్రిప్ట్ రాసిన సలీమ్–జావేద్‌ల వారసత్వం ఇప్పుడు వెతుకుతున్నా కానరావడం లేదు. కొత్త కథలను తెర మీద కన్విన్సింగ్‌గా చెప్పిన గుల్జార్, గోవింద్ నిహలానీ, మహేష్ భట్‌లాంటి దర్శకుల సంఖ్య తగ్గిపోవడంతో ఒరిజినల్ కథలను ఆలోచించలేని దర్శకులు గొప్ప క్రాఫ్ట్ తెలిసినా దిక్కులు చూడాల్సి వస్తోంది. ‘దిల్ చాహ్‌తాహై’ వంటి తాజా కథలు అందించిన ఫర్హాన్ అఖ్తర్‌లాంటి వాళ్లు హీరోలు అయిపోవడంతో కథలు అల్లే ఆ కాస్త శక్తి కూడా డైవర్ట్ అయిపోయింది. చరిత్రను తవ్వి తీసి ‘లగాన్’ వంటి స్క్రిప్ట్ రాసుకున్న బాలీవుడ్ ఇవాళ వేరే కథలు లేక హీరో సంజయ్ దత్ కథను, సెక్స్ స్టార్ షకీలా కథను బాలీవుడ్ సినిమాలు తీస్తోంది. పిచ్చి ముదిరి పాకాన పడిందన్నట్టు తన సినిమాకు తానే దర్శకత్వం వహించుకుంటానని కంగనా రనౌత్ చెప్పింది. సుదీర్ఘ జీవితం చూసే వరకూ కూడా ఆగకుండా నిన్న మొన్నటి జీవితాన్ని కథలుగా ఎంచుకునే కథా లేమికి బాలీవుడ ఎందుకు వెళ్లిందన్నది ఆలోచించాల్సిన విషయం.
సిద్ధంగా ఉన్న సరుకు
ఇంత పెద్ద దేశంలో ఎంతోమంది సెలబ్రిటీలు ఉంటారు. వాళ్లు పైకి రావడానికి ఎంతో స్ట్రగుల్ ఉంటుంది. పైగా వారితో దేశానికి పరిచయం ఉంటుంది. కొత్తగా కథలు అల్లడం ఎందుకు... ఆ వ్యక్తుల జీవితాలనే కథగా తీసుకుందాం అని సృజనాత్మక సుఖానికి బాలీవుడ్ అలవాటు పడింది. ‘దంగల్’, ‘సంజు’, ‘సూర్మ’, ‘గోల్డ్’, ‘‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరికోమ్’. ‘ఎమ్‌ఎస్. ధోని: ది ఆన్‌టోల్డ్ స్టోరీ’ ఇవన్నీ ఆ వరుసలో వచ్చాయి. విజయం సాధించాయి. ఈ ధోరణి ఎక్కడి దాకా వెళ్లిందంటే డాన్‌ల కథలు చాలక డాన్‌ల అక్కచెల్లెళ్ల జీవిత కథలను తీసే వరకు. రాజకీయ నాయకులు జీవించి ఉండగానే వారి కథలను కూడా బాలీవుడ్ వదిలి పెట్టకుండా తీయడానికి ఉవ్విళ్లూరుతోంది. మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్‌పై ఒక సినిమా ఇది వరకే రాగా నరేంద్ర మోడీపై సినిమా సిద్ధం కానుంది. అయితే స్పోర్ట్ పర్సనాలిటీల మీదే ఎక్కువ సినిమాలు ఇప్పుడు తయారవుతున్నాయని సమాచారం. వరల్డ్ కప్‌ను సాధించిన కపిల్ దేవ్‌పై, ఉత్తర ప్రదేశ్ షార్ప్ షూటర్స్ చండ్రో, ప్రకాషి తోమర్‌లపై, ఎయిర్ రైఫిల్ షూటర్ అభినవ్ బింద్రా పై, ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ మాజీ మేనేజర్ సయ్యద్ రహీమ్ పై సినిమాలు రెడీ అవుతున్నాయి. పెద్ద పెద్ద హీరోలు ఈ రోల్స్ చేయడానికి డేట్స్‌తో సిద్ధంగా ఉన్నారు. అలాగే సైనా మీద ఒక సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. పీవీ సింధు కథ కూడా త్వరలో పట్టాలు ఎక్కవచ్చు. సానియా మిర్జా, మిథాలీ రాజ్‌ల గురించి సినిమాల పై కూడా కసరత్తు జరుగుతోంది.
సామాన్యుల కథలు
కథల కరువుతో బాలీవుడ్ అసామాన్యులైన సామాన్యుల కథలను కూడా అన్వేషిస్తోంది. తన ఇద్దరు కుమార్తెలను బాక్సర్‌లను చేసిన సామాన్య తండ్రి కథ ఆధారంగా ‘దంగల్’ వచ్చాక ఆ అన్వేషణ మరింత పెరిగింది. స్త్రీలకు శానిటరీ నేప్‌కిన్స్ అందించడానికి జీవితాన్ని వెచ్చించిన మురుగనాథమ్ స్ఫూర్తితో ‘ప్యాడ్‌మేన్’ సినిమా వచ్చింది. 2005లో యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ కథ అధారంగా ఇప్పుడు ‘చప్పాక్’ అనే సినిమా రాబోతోంది.
ఒక రీమేక్ ఇవ్వండి బాబయ్యా
ఒకప్పుడు హిందీ కథలు తెలుగులో రీమేక్ అయ్యేవి. ‘నిప్పులాంటి మనిషి’, ‘నేరం నాది కాదు ఆకలిది’, ‘అన్నదమ్ముల అనుబంధం’, ‘ఎదురీత’ ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి. కాని ఇప్పుడు బాలీవుడ్ కథలు లేక సౌత్ వైపు చూస్తోంది. రౌడీ రాథోడ్ (విక్రమార్కుడు), వాంటెడ్ (పోకిరి), కిక్ (కిక్)...ఈ వరుస పెరుగుతోంది. ‘టెంపర్’ను ‘సింబ’గా తీస్తే సూపర్బ్ కలెక్షన్స్ వచ్చాయి.∙‘ప్రస్థానం’ ‘ప్రస్థాన్’ గా రీమేక్ అవుతోంది. సంజయ్‌దత్, మనీషా కోయిరాల, అలీ ఫజల్, అమైరా దస్తూర్ నటిస్తున్నారు. తెలుగు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దేవకట్టానే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం హిందీలో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కుతోంది. తెలుగు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సందీప్ వంగానే ‘కబీర్ సింగ్’ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ‘కాంచన’, ‘విక్రమ్‌వేద’, ‘ఖైదీనంబర్ 150, ‘7/ జీ బృందావన్ కాలనీ’, ‘ఆర్‌ఎక్స్ 100’ ఇవన్నీ బాలీవుడ్‌కు కథా భిక్ష పెట్టనున్నాయి.
తీసిందే తీసి
కథల లేమి వల్ల బాలీవుడ్ తాను తీసిన సినిమాలను మళ్లీ తీయాలనుకుంటోంది. 1978లో బీఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘పతి పత్నీ ఔర్ ఓ’ ను మళ్లీ తీస్తున్నారు. 1991లో తెలుగులో వచ్చిన ‘కూలీ నెంబర్ 1’ అదే పేరుతో హిందీలో అప్పుడే తీసి మళ్లీ ఇప్పుడు కూడా తీస్తున్నారు. 1971లో వచ్చిన ‘హాథీ మేరే సాథీ’ చిత్రం స్ఫూర్తితో సేమ్ టైటిల్‌తో హిందీలో రీమేక్ అవుతోంది. ఇందులో రానా హీరో. తెలుగులో ‘అరణ్య’ అనే టైటిల్ పెట్టారు. 1994లో వచ్చిన హిందీ చిత్రం ‘అందాజ్ అప్నా అప్నా’ (1994)ను రీమేక్ చేయనున్నట్లు జోరుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కథలు లేని బాలీవుడ్ ప్రపంచ సినిమాల నుంచి అఫీషియల్‌గా కథలు కొని రీమేక్ చేస్తోంది. ఇటీవల సూపర్ హిట్ అయిన హిందీ సినిమా ‘అంధా ధున్’, తాజాగా విడుదలైన ‘బద్‌లా’ ఫ్రెంచ్, స్పానిష్ భాషల కథల నుంచి స్వీకరించినవి.
కొంప ముంచుతున్న కాంబినేషన్‌లు
ఫ్యాన్సీ కాంబినేషన్‌ల కోసం పాకులాడి ఆ కాంబినేషన్‌లకు తగినట్టుగా కథలు వెతకలేక కథలు సృష్టించకలేక బాలీవుడ్ అవస్థలు పడుతోంది అనిపిస్తోంది. కథ రచయిత నుంచి పుట్టి దర్శక నిర్మాతల వద్దకు వెళ్లి ఆ తర్వాత తగిన నటీనటులను ఎంచుకోవాలి. ఇప్పుడు నటీనటులు ముందు వరుసలోకి రావడం వల్ల వారికి తగిన కథలు అల్లడం కష్టమవుతోంది. అనురాగ్ కశ్యప్, అనురాగ్ బసు, రాజ్ కుమార్ హిరాణి వంటి దర్శకులంతా ముందు రచయితలు తర్వాత దర్శకులు. ఇలా రచయితలు దర్శకులైపోయే ట్రెండ్ వల్ల కూడా సరైన కథలు తయారు కావడం లేదు. ‘డర్టీ పిక్చర్’ రాసిన రజత్ అరోరా, ‘పాన్ సింగ్ తోమార్’ రాసిన తిగ్ మన్‌షు ధులియా, ‘తారే జమీన్ పర్’ రాసిన అమోల్ గుప్తే, ‘పికూ’ రాసిన జూహీ చతుర్వేది వంటి రచయితలెందరో బాలీవుడ్‌లో ఉన్నారు. వీరి వద్ద కథలు కచ్చితంగా ఉంటాయి. కాని వినే ఓపిక, తీరికా బాలీవుడ్ పెద్దలకు ఉంటే కొత్త కథలు కొత్త సినిమాలు కచ్చితంగా వస్తాయి. అలా అని ఆశిద్దాం.
– ఇన్‌పుట్స్: ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment