దూర్‌దర్శన్ రామాయణ్‌లో సీతాగా నటించిన దీపికా చిఖాలియా(ఫైల్ ఫోటో)
దూర్‌దర్శన్‌లో ధారవాహికలు ప్రారంభమయిన తొలి నాళ్లలో వచ్చిన సంచలనం ‘రామాయణ్’. వాల్మీకి మహర్షి రచించిన ఆ అపురూప కావ్యాన్ని దృశ్యంగా మలచి ఏడాదిన్నర కాలం పాటు ప్రేక్షకులను అలరించింది. ఆదివారం వచ్చిందంటే చాలు ఎన్ని పనులున్నా ‘రామాయణ్’ ప్రసార సమయానికి మాత్రం టీవీల ముందు వాలిపోయేవారు.
అంతలా జనాల్ని అలరించిన ఆ దృశ్యకావ్యంలో అరుణ్ గోవిల్ ‘శ్రీరాముడి’గా నటించగా, దీపికా చిఖాలియా ‘జానకి’గా అలరించింది . ‘రామాయణ్’లో వారు ప్రేక్షకులను ఎంతలా అలరించారంటే, వారనేదో టీవీ నటుల్లా కాక, దేవతా మూర్తులు ‘సీతారాముల్లా’నే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.
నేటి కాలంలో కూడా పలు ఇతిహాసాలను తెరకెక్కితోన్నా, అలనాటి ‘రామాయణ్’ స్థానం ప్రత్యేకం. ఈ కాలం నటినటులతో 2008లో కూడా ‘రామాయణ్’ ధారావాహిక ప్రారంభమయ్యింది. ఇది కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇందులో బొన్నెర్జి సీతా దేవి పాత్రలో నటించింది. అయితే ఈ మధ్య ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ నాటి సీత దీపికా చిఖాలియా, ఈ నాటి సీత బొన్నెర్జిలు ఇద్దరు ఒక్క చోట చేరడం జరిగింది. ఇంకేముంది ఇద్దరు జానకీలను తమ కెమరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్‌లు పోటి పడ్డారు.
ఈ సందర్భంగా బొన్నెర్జి, చిఖలియాతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దాంతో పాటు ‘ఈ నాటి సీత, ఆ నాటి సీతను కలిసింది. చాలా అద్భుతమైన, అరుదైన సందర్భం. నేను రామాయణలో నటించడానికి ఒప్పుకున్నప్పుడు మీ(చిఖాలియా) డీవీడీలను చూసి, అర్ధం చేసుకుని, తెలుసుకొని నటించాను. నిజంగా మీరోక లెజెండ్. ప్రేమతో’ అనే సందేశాన్ని పోస్టు చేశారు బొన్నెర్జి. ఇలా ఇద్దరు సీతలను ఒక్క చోట చూసిన అభిమానులు కూడా తెగ సంతోషిస్తున్నారు. వీరిద్దరి ఫోటోలను తెగ షేర్ చేస్తోన్నారు.
ఏనాటికైనా చెడుపై మంచే విజయం సాధిస్తుందనే ఇతివృత్తంతో వాల్మీకి రచించిన ఇతిహాసం రామాయణాన్ని సుభాష్ సాగర్, రామానంద్ సాగర్, ప్రేమ్ సాగర్‌లు నిర్మాతలుగా, రామానంద్, ఆనంద్ సాగర్, మోతీ సాగర్ దర్శకత్వంలో రామాయణ్‌ను తెరకెక్కించారు. దాదాపు 78 వారాలపాటు ప్రసారమయిన ఈ ధారావాహిక తొలి ఎపిసోడ్ 1986, జనవరి 25న ప్రారంభం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సీరియల్‌ను దాదాపు 65 కోట్ల మంది వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment