బోయపాటి శ్రీను
‘‘సినిమాలో ఫోర్స్‌గా ఫైట్ పెట్టను. యాక్షనే కావాలంటే ఇంగ్లీష్ సినిమా చూడొచ్చు. కానీ ప్రేక్షకులు మన సినిమాలనే ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? అంటే మన సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది. ఓ రిలేషన్ ఉంటుంది. ‘భద్ర’ నుంచి నా సినిమాలను గమనిస్తే ఫ్యామిలీ, సొసైటీ అంశాలు తప్పనిసరిగా ఉన్న విషయం తెలుస్తుంది’’ అన్నారు బోయపాటి శ్రీను. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ఇవాళ విడుదలవుతోంది. ఈ సందర్భంగా బోయపాటి చెప్పిన సంగతులు.
► పోయిన ఏడాది పడిన కష్టాలన్నింటినీ మరచిపోయి కొత్త ఏడాదిలో అందరూ జరుపుకునే మొదటి పండగ సంక్రాంతి. ఈ పండగలాంటి సినిమా ‘వినయ విధేయ రామ’. ఫ్యామిలీ కోసం తలవంచే వినయుడిలా, అయినవారి కోసం ఏమైనా చేసే ఒక విధేయుడిగా, తనది అనుకున్న దాన్ని సాధించే రాముడిలోని పరాక్రమవంతుడిగా రామ్‌చరణ్ క్యారెక్టర్ ఉంటుందీ సినిమాలో. ఈ సినిమాకు ఎంత కావాలో అంతా చేశారు రామ్ చరణ్. అజర్ బైజాన్ షెడ్యూల్ కోసం ఆయన బాగా బాడీని బిల్డప్ చేశారు. ఈ కథను రామ్‌చరణ్ కోసమే రాశాను. ఒకరినొకరు బాగా నమ్మి ఈ సినిమా చేశాం. సోషల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ఓ పాయింట్‌ను కూడా ఈ సినిమాలో టచ్ చేశాం.
► సినిమా ప్రేక్షకులు కొత్త పోస్టర్‌నే కోరుకుంటారు. కొత్త లుక్స్‌నే చూడాలనుకుంటారు. కుటుంబ కథా చిత్రం అన్నప్పుడు ఆర్టిస్టుల కటౌట్స్, వారి లుక్స్ కూడా ముఖ్యం. ప్రశాంత్‌గారు, ఆర్యన్ రాజేశ్, రవివర్మ, మధు నందన్, స్నేహ, మధుమిత, హిమజ, ప్రవీణ.. ఇలా అందరూ బాగా చేశారు. విలన్ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్‌ను సంప్రదించినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందు ఆసక్తిగా లేదన్నారు. కానీ నేను కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు. నా సినిమాలోని ప్రతి పాత్రకు జస్టిఫికేషన్ ఉండేలానే ప్లాన్ చేస్తాను. జ్యూస్ నాదైనా గ్లాస్ దానయ్యగారిదే. నిర్మాత సహకారం బాగా ఉంటే సినిమా బాగుంటుంది. స్ట్రాంగ్ విజువల్‌ని దేవిశ్రీ ప్రసాద్ ముందు పెడితే ఎలాంటి ఆర్‌ఆర్ ఇస్తారో సినిమాలో చూస్తారు. నా ఆర్టిస్టు నుంచి సినిమాకు కావాల్సింది రాబట్టుకోవడం కోసమే సెట్‌లో యాక్టివ్‌గా ఉంటాను. నేను రాయడం, తీయడం మీదనే ఎక్కువగా దృష్టి పెడతాను. బిజినెస్‌లో అంతగా కల్పించుకోను.
► చిరంజీవిగారు 150 సినిమాలు చేశారు. వెయ్యి కథలు విని ఉంటారు. ఆయన ఇచ్చే సలహాలు సినిమా బాగా రావడం కోసమే. ఈ కథ విన్న తర్వాత నాన్నగారికి ఓసారి చెబుదాం అన్నారు చరణ్. ఇప్పుడే వద్దు.. పది రోజులు తర్వాత చెబుదాం అన్నాను. ఆయనకు ఫుల్‌గా చెప్పాను. నచ్చింది. బాగుంది. నువ్వు బాగా చేస్తావనే నమ్మకం ఉంది అన్నారు.
► తండ్రి ఎవరైనా తన కొడుక్కి స్పోర్ట్స్ బైకో, స్పోర్ట్స్ కారో గిఫ్ట్‌గా ఇస్తారు. కానీ చిరంజీవిగారు రామ్‌చరణ్‌కు ఓ యుద్ధ ట్యాంకర్ (వారసత్వం)ని ఇచ్చారు. అది తోలుతూనే ఉండాలి. గెలుస్తూనే ఉండాలి. నిలబెడుతూనే ఉండాలి. ఒకటే మాట ఏంటంటే.. చరణ్ దానికి సమర్థుడు.
► చిన్న సినిమాలు, స్మూత్ సినిమాలు చేయలేను. ఆడియన్స్ నా దగ్గర నుంచి ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దాన్నుంచి నేను బయటికి రాలేను. కథలుగా మారుతూనే వస్తున్నాను. యాక్షన్ పార్ట్ ఒక భాగం మాత్రమే. అంటే.. పదిమంది చూసే సినిమాలు చేస్తాను కానీ ఒకరు చూసే సినిమాలు చేయను. మంచి సినిమాలు చేస్తాను. బయోపిక్ పట్ల ఆసక్తి ఉంది. చేసినా దానికి ఓ దమ్ము ఉంటుంది. నా బ్రాండ్‌ను నూటికి నూరు శాతం బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఆ బాధ్యతను పెంచుకుంటూనే వెళ్తాను.
► ఇండస్ట్రీలో బోయపాటి చేసే ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే. నా గత సినిమాల రేంజ్‌ని మించి నా సినిమాలు ఉండాలని ఎప్పటికప్పుడు తాపత్రయపడుతుంటాను. ఏ హీరోతో నేను సినిమా చేస్తున్నానో ఆ హీరో ఫ్రంట్ సీట్ అభిమానిగానే నేను ఫీల్ అవుతాను. చరణ్‌ని అలా ఫీలయ్యే ‘వినయ విధేయ రామ’ సినిమా చేశాను.
► ప్రేక్షకులు తమ జీవితాల్లో నుంచి కొంత సమాయాన్ని మన కోసం వెచ్చిస్తున్నారు. వాళ్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఫ్యామిలీ కోసం కాకుండా సినిమా చూడటానికి ఖర్చు పెడుతున్నారు. లక్షల్లో ఆడియన్స్ సినిమాను చూస్తారు. వారందరి అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. అంటే చావుతో చెలగాటం ఆడతాం. నిద్ర ఉండదు. నేను నిద్రపోయి ఆరు రోజులైంది. డీటీఎస్ నుంచి ప్రింట్ వెళ్లేవరకు ఆరు రోజులు. ఆ తర్వాత పబ్లిసిటీ, సినిమాను ప్రజల ముందుకు ఎలా తీసుకెళ్లాలి. ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడతాం. ఎందుకంటే మనకంటే ఎంతోమంది మేధావులు ఉన్నా దేవుడు సినిమా చేసే అవకాశం నాకు ఇచ్చాడు.
► బాలకృష్ణగారితో నేను చేయబోయే సినిమా గురించి తర్వాత మాట్లాడతాను. రామ్‌చరణ్‌కు ఓ లైన్ చెప్పాను. ఈ సినిమాకు బాగా టైమ్ పట్టొచ్చు. చిరంజీవిగారితో కూడా ఓ సినిమా ఉంటుంది.
నా టీమ్ 180 మెంబర్స్ ఉంటారు. నా సినిమాలో స్పాన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతమంది ఉంటారు. అందరినీ కో ఆర్డినేట్ చేయాలంటే సెట్‌లో కాస్త గట్టిగానే ఉండాలి. అప్పుడే టైమ్ సేవ్ అయ్యి నిర్మాతకు నష్టం వాటిల్లదు. నా సెట్‌కి ఒకసారి వస్తే ఈ విషయం అర్థం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment