బ్రహ్మానందం
సిల్వర్ స్క్రీన్‌పై బ్రహ్మాండంగా నవ్విస్తున్న బ్రహ్మానందం ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌కి రానున్నారు. అయితే నవ్వించడానికి కాదు.. నవ్వించేవారిని ‘జడ్జ్’ చేయడానికి. ‘ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ చాలెంజ్’ షోలో కనిపించనున్నారు బ్రహ్మానందం. ఈరోజు ‘స్టార్ మా’లో ఈ షో స్టార్ట్ అవుతున్న సందర్భంగా బ్రహ్మానందంతో స్పెషల్ టాక్.
► ఇన్ని రోజులు వెండితెరపై ప్రేక్షకులను నవ్వించిన మీరు ఇప్పుడు తొలిసారి బుల్లితెరపైకి రాబోతున్నారు. ఈ అనుభూతి మీకు ఎలా అనిపిస్తోంది?
నవ్వించేవాళ్లను జడ్జ్ చేయబోతున్నాను. ఈ షోలో అద్భుతమైన ప్రతిభ ఉన్న కుర్రాళ్లు స్టాండప్ కామెడీ చేయబోతున్నారు. ఎవరు బాగా నవ్వించారో వాళ్లను ఎంపిక చేయాలి.
► జడ్జ్‌మెంట్ అనేది కష్టం అంటారు?
నవ్వొస్తే బాగుందని చెబుతాం. నవ్వు రాకపోతే బాగోలేదు అంటాం. దీనిని జడ్జ్ చేయడానికి మనకు ఓ సీట్ కేటాయించారు. లెక్కలేసుకుని ‘నవ్వు’కి జడ్జిమెంట్ ఇవ్వకూడదు. హాస్యం ఎక్కాల పుస్తకం కాకూడదు. పెద్ద బాల శిక్షలా ఉండాలి.
► ఈ షోను అంగీకరించడానికి కారణం ఏంటి?
నేను ఒకప్పుడు మిమిక్రీ కళాకారుడిని. మిమిక్రీనే స్టాండప్ కామెడీ అంటుంటారు. ఇప్పుడు కుర్రాళ్లు చాలామంది స్టాండప్ కామెడీ చేసి నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లను ప్రోత్సహించాలి. ఎవరో ప్రోత్సహించే కంటే అనుభవం ఉన్న నాలాంటివాళ్లు ఆ బాధ్యతను తీసుకుంటే బాగుంటుందనిపించింది. వాళ్లకూ ఉత్సాహంగా ఉంటుంది.
► మీరు బ్రహ్మాండంగా నవ్విస్తారు. ఈ షోలో పాల్గొనేవారు మిమ్మల్ని నవ్వించగలరని నమ్ముతున్నారా?
నవ్వడం అనేది పెద్ద విషయమో, లేక పెద్ద పెద్ద బరువులు ఎత్తడమో కాదు. నవ్వినోళ్లు మళ్లీ నవ్వకూడదని ఏమీ లేదు. నవ్వొస్తే ఎవరైనా నవ్వుతారు. ఆ నవ్వు వస్తే దేశ ప్రధాని అయినా నవ్వుతాడు. సామాన్యులూ నవ్వుతారు. నవ్వు అందరికీ కామన్. పెద్ద కమెడియన్ నవ్వకూడదని కాదు.
► అన్ని రసాల కన్నా హాస్య రసం కష్టం అంటారు..
నవ్వించడం బ్రహ్మానందానికే కాదు ఎవరికైనా కష్టమే. నవరసాల్లో హాస్యరసాన్ని పండించడం అంత ఈజీ కాదు. జుగుప్సాకరంగా కాకుండా అందంగా నవ్వించి, ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా చేయడం అనేది గొప్ప విషయమే.
► మరి ‘జుగుప్సాకరమైన హాస్యం’ ఉండకూడదని నిర్వాహకులతో మీరు చెప్పారా?
నా దగ్గరకు నిర్వాహకులు రావడానికి, నేను ఈ షో అంగీకరించడానికి మొదటి కారణం అదే. ఇంటిల్లిపాదీ చూస్తూ కామెడీని ఆనందించే షోకే నేను జడ్జ్‌గా చేస్తాను. అలా కాకుండా భిన్నమైన మార్గాల్లో నవ్వించాలని ప్రయత్నిస్తే అదే రోజు మానేస్తానని కూడా చెప్పాను.
► ఫైనల్లీ ఈ షో వల్ల మీకెలాంటి అనుభవం దొరకుతుందని అనుకుంటున్నారు?
కొత్త కుర్రాళ్లకు వాళ్ల ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక మంచి వేదిక దొరికింది. ఉదాహరణకు.. పాటలు పాడేవారు, మిమిక్రీ చేసేవారు.. ఇలా విభిన్న రంగాల్లో ప్రతిభ ఉన్నవాళ్లు ఉన్నారు. అత్త కూడా ఒకప్పటి కోడలే అంటారు కదా... ఇంకా చానెల్స్ రానప్పుడు డీడీ 8లో నేనూ స్టాండప్ కామెడీ చేసినవాడినే. ఒక్కసారి ఆ పూర్వపు రోజులను గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ షోలో పాల్గొనబోయే వాళ్లలో ప్రతిభ ఉన్న వారు రేపు మంచి స్థాయికి వెళితే సంతోషపడతాను.
Comments
Please login to add a commentAdd a comment