కేథరిన్
‘‘నచ్చిన పాత్ర వస్తేనే చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఫస్ట్ హీరోయినా లేక సెకండ్ హీరోయినా అనేది పెద్దగా పట్టించుకోను. నా పాత్ర సినిమాకు ఎంత కీలకం అనేది నాకు ముఖ్యం. అన్ని రకాల పాత్రలు చేస్తూ, చేసే ప్రతీ పాత్రలో ప్రేక్షకులను అలరించాలన్నదే నా లక్ష్యం’’ అని హీరోయిన్ కేథరిన్ అన్నారు. సిద్ధార్థ్, కేథరిన్ జంటగా సాయి శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వదలడు’. దెయ్యమైనా సరే అనేది క్యాప్షన్. అంజయ్య సమర్పణలో టి. నరేశ్ కుమార్, టి శ్రీధర్ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేథరిన్ చెప్పిన విశేషాలు.
► ‘వదలడు’ సినిమాలో జ్యోతి అనే టీచర్ పాత్ర చేశాను. తను వాసనలను పసిగట్టలేదు. దాంతో స్నేహితులు జోక్ చేసి, తన కాన్ఫిడెన్స్‌ను తగ్గించేస్తుంటారు. ఈ పాత్ర చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే కళ్లు కనిపించని పాత్ర, చెవులు వినిపించని పాత్ర అంటే ఒక స్టయిల్లో చేయొచ్చు. ఈ పాత్ర చేయడం డిఫరెంట్‌గా అనిపించింది. ఈ చిత్రకథ ఆహార పదార్థాల కల్తీ చుట్టూ తిరుగుతుంది.
► మన దేశం కంటే విదేశాల్లో ఆహార కల్తీ మీద చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్ ఫుడ్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్‌లా కనిపిస్తారు. తనతో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్. సిద్ధార్థ్‌కు సామాజిక బాధ్యత చాలా ఎక్కువ. తన ట్వీటర్‌లో ఎప్పుడూ ఏదో ఒక మంచి టాపిక్‌ను ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు.
► ఇది హార్రర్ సినిమా అయినా పూర్తిస్థాయి హార్రర్ కాదు. సూపర్ న్యాచురల్ అంశాలు కొన్ని ఉంటాయి. రెగ్యులర్ హారర్ సినిమా కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంజాయ్ చేస్తారు. కథకు అడ్డుపడకూడదని కేవలం రెండు పాటలే ప్లాన్ చేశాం. తమన్ రీ–రికార్డింగ్‌ను అద్భుతంగా అందించారు. సాయిశేఖర్ నూతన దర్శకుడు అయినా సినిమాను బాగా హ్యాండిల్ చే శారు.
► నేను చేసే ప్రతీ సినిమాకు డబ్బింగ్ చెబుతాను అని డైరెక్టర్స్‌ని అడుగుతుంటాను. ‘చమ్మక్ చల్లో, గౌతమ్ నంద’ సినిమాలకు చెప్పాను. ‘సరైనోడు’ సినిమాలో ఎంఎల్‌ఏ పాత్ర బాగా పాపులారిటీ తెచ్చిపెట్టింది. తెలుగులో చిన్న గ్యాప్ వచ్చింది. అయితే కావాలని తీసుకోలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చేస్తున్నాను. ఇందులో నాది మంచి పాత్ర.
Comments
Please login to add a commentAdd a comment