‘కబాలి’ లీక్పై నిహ్లాని ఆందోళన
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’ ఆన్లైన్ లో లీకైందన్న వార్తలు సినిమా పరిశ్రమలో గుబులు రేపుతున్నాయి. సెన్సార్ బోర్డు నుంచే ఈ సినిమా లీకైందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. దీనిపై సెన్సార్ బోర్డు చీఫ్ పహలాజ్ నిహ్లాని స్పందించారు. పెద్ద సినిమాలు ఆన్లైన్ లో లీక్ కావడం పట్ల ఆందోళన వెలిబుచ్చారు.
‘రజనీకాంత్ లాంటి పెద్దహీరో కూడా పైరసీదారులు వదలడం లేదు. కబాలి సినిమాన చెన్నైలో సెన్సార్ చేశారు. ముంబైలోని మా కార్యాలయానికి దీంతో ఎటువంటి సంబంధం లేదు. అంతకుముందు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం సుల్తాన్ సెన్సార్ చేశాం. ఆన్లైన్ లో లీకవడం పట్ల స్టార్ హీరోల సినిమాల వసూళ్లు ఏమేరకు తగ్గుతాయనేది నేను చెప్పలేను. పైరసీలో చిన్న సినిమాలు బాగా నష్టపోతాయని అనుకుంటున్నా’నని నిహ్లాని చెప్పారు.
హిందీ సినిమాలు సుల్తాన్, ఉడ్తా పంజాబ్, గ్రేట్ గ్రాండ్ మస్తీ విడుదలకు ముందే ఆన్లైన్ లో లీకైన విషయం తెలిసిందే. కాగా, ఆన్లైన్ లో కబాలి లింకులు తొలగించాలని నిర్మాత కలైపులి ఎస్.థాను ఇటీవల చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన న్యాయస్థానం కబాలి లింకులు కలిగిన వెబ్సైట్లను మూసివేయాలని ఆదేశించింది.