
ప్రతిష్టాత్మక కాన్స్ చలన చిత్రోత్సవానికి రంగం సిద్ధమైంది. 75వ కాన్స్ చలన చిత్రోత్సవం ఈ నెల 17 నుంచి 28 వరకు జరగనుంది. ఈ వేడుకల తొలి రోజు భారతదేశం తరఫున అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు. వీరితో పాటు శేఖర్ కపూర్, తమన్నా, నయన తార, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) చైర్మన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్‌సీ బోర్డు సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు కనిపిస్తారు. ఈ టీమ్‌కు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సారథ్యం వహిస్తారు.
ఇక దీపికా పదుకోన్ ఈసారి కాన్స్ ఉత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా పాల్గొననుండటం విశేషం. ఈ వేడుకల్లో ‘క్లాసిక్ సినిమా’ విభాగంలో సత్యజిత్ రే తీసిన ‘ప్రతిధ్వని’ స్క్రీనింగ్ అవుతుంది. అలాగే నటుడు మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మే 19న ప్రదర్శితం కానుంది. భారత ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నంబి నారాయణన్ పాత్రను మాధవన్ పోషించారు. అలాగే ఢిల్లీకి చెందిన షౌనక్ సేన్ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ ట్రైలర్ కూడా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment