‘‘టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్‌కు రావడం హ్యాపీగా ఉంది. సినిమాల్లో అయితే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశం ఉంటుంది’’ అన్నారు చాందినీ భగ్వానాని. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో గీతానంద్, చాందినీ భగ్వానాని జంటగా రాజా దారపునేని నిర్మించిన ‘రథం’ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. చాందినీ మాట్లాడుతూ– ‘‘మాది ముంబై. ఆరేళ్లకే బాలనటిగా హిందీ సినిమాల్లో నటించాను. ఆ తర్వాత కొంచెం విరామం తీసుకుని చదువుపై దృష్టి పెట్టి ప్లస్ టు కంప్లీట్ చేశాను. ప్రముఖ టీవీ చానెల్స్‌లో నటిస్తూనే, మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేశా. ‘రథం’ సినిమాలో అవకాశం వచ్చింది. మగవారి పట్ల సరైన అభిప్రాయం లేని ఓ అమ్మాయి జీవితంలోకి వచ్చిన ఓ అబ్బాయి తీసుకొచ్చిన మార్పు ఏంటి? అనేదే ఈ చిత్రకథ.
హీరో గీతానంద్ నాకు తెలుగు డైలాగ్స్ పలకడంలో సహాయపడ్డారు. దర్శకుడు చంద్రశేఖర్ కూడా హెల్ప్ చేశారు. నాకు ఆయన తెలుగు చెబితే, నేను ఆయనకు హిందీ చెప్పాను (నవ్వుతూ). ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించగలగడం నా బలం. అలాగే ఎవరైనా బాగా నవ్వించినప్పుడు ఆ నవ్వును తొందరగా ఆపుకోలేను. అది నా బలహీనత. హిందీలో డబ్ అయిన చాలా తెలుగు సినిమాలు చూశాను. నాని, నాగచైతన్యల నటన అంటే ఇష్టం. హీరోయిన్స్‌లో సమంత, రకుల్‌ప్రీత్ సింగ్ ఇంకా హెబ్బా పటేల్ తెలుసు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘టీవీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉండదు. నేను లైంగిక వేధింపులను ఎదుర్కొనలేదు. మహిళలు వేధింపులు ఎదుర్కొన్న వెంటనే స్పందిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నా భావన. ప్రస్తుతం ‘దిక్సూచి’ అనే సినిమాలో నటిస్తున్నాను. వేరే ఏ ప్రాజెక్ట్ కమిట్ కాలేదు’’ అన్నారు.
ఆ ఇద్దరంటే ఇష్టం
Published Wed, Oct 24 2018 1:07 AM | Last Updated on Wed, Oct 24 2018 1:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment