
‘క్వీన్’కి ఇంకా అడగనే లేదట!
హిందీలో ఘనవిజయం సాధించిన ఇటీవలి చిత్రాలు తెలుగులో వరుసగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ వరుసలో ‘క్వీన్’ చిత్రం కూడా దక్షిణాది భాషల్లో రానుంది. అయితే, కంగనా రనౌత్‌కు ఒక్కసారిగా ఎంతో పేరు తెచ్చిపెట్టిన ఆ ‘క్వీన్’ పాత్రను ఎవరు పోషిస్తారనే అంశం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. త్రిష, శ్రీయ, నయనతార... ఇలా పలువురి నటీమణుల పేర్లు వినిపిస్తూ వచ్చాయి.
లేటెస్ట్‌గా, ఈ పాత్ర పంజాబీ పిల్ల ఛార్మిని వరించిందంటూ కొన్ని పత్రికలు, మీడియా ప్రచారం చేశాయి. ‘‘నాయికా ప్రధానమైన సినిమాల్లో నటించడం, అలాంటి పాత్రలు పోషించడం ఛార్మికి కొట్టిన పిండి. ‘క్వీన్’లోని రాణి పాత్రలో అటు అందంగానూ, ఇటు అభినయ ప్రధానంగానూ కనిపించాలంటే ఆమే కరెక్ట్’’ అని ఈ రీమేక్ తీస్తున్న నిర్మాతలు భావిస్తున్నట్లు పేర్కొన్నాయి.
అయితే, అసలు సంగతి ఏమిటని ‘సాక్షి’ ఆరా తీస్తే, ఈ వార్తల్లో పస లేదని తేలింది. ‘‘ఈ వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో తెలీదు. ‘క్వీన్’ రీమేక్ కోసమైతే, ఇప్పటి దాకా ఛార్మిని ఎవరూ సంప్రతించలేదు’’ అని ఛార్మి సన్నిహిత వర్గాలు ‘సాక్షి’కి స్పష్టం చేశాయి. అయితే, ఒకటి మాత్రం నిజం. ఇంకా అడగలేదన్న మాటే కానీ, ‘క్వీన్’ లాంటి చక్కటి కథతో, పాత్రతో ఎవరైనా సంప్రతిస్తే నటించడానికి ఛార్మికి అభ్యంతరం ఉండదని వేరే చెప్పాలా?