ఆచితూచి అడుగులు
చార్మి అందగత్తె. నో డౌట్. మంచి నటి. నో డౌట్. ప్రతిభగల అనువాద కళాకారిణి నో డౌట్. ఈ తరం కథానాయికల్లో లేని చాలా క్వాలిటీలు చార్మి సొంతం. హీరోయిన్‌గా కెరీర్ ఆరంభించి పదకొండేళ్లు నిండినా, చార్మి ఇంకా బిజీగానే ఉన్నారంటే కారణం ఆమెలోని క్వాలిటీలే. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించడం తేలికైన విషయం కాదు. సినిమా భారాన్నంతా భుజాలపై మోయాల్సిన పరిస్థితి. కానీ చార్మి తన యాక్టింగ్‌తో విరివిగా స్త్రీ ప్రాధాన్యతా చిత్రాల్లో నటిస్తూ శభాష్ అనిపించుకున్నారు. మంత్ర, సుందరకాండ, మనోరమ, కావ్యాస్ డైరీ, ఇందు, సై ఆట, మంగళ, నగరం నిద్రపోతున్న వేళ, ప్రేమ ఒక మైకం... ఇన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన కథానాయికలు ఈ కాలంలో చాలా అరుదు. ఆ దిశగా చూస్తే చార్మి నిజంగా గ్రేట్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న మరో స్త్రీ ప్రాధాన్యతా చిత్రం ‘ప్రతిఘటన’. చరిత్ర చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మంత్ర-2’ నిర్మాణ దశలో ఉంది.
తన కెరీర్ గురించి ఇటీవల చార్మి మాట్లాడుతూ-‘‘కెరీర్ ప్రారంభమైన నాటినుంచి బిజీగా ఉండటం నిజంగా నా అదృష్టమే. గ్లామర్ పాత్రలు చాలా సినిమాల్లో చేశాను. ప్రేక్షకులు ఆదరించారు కూడా. ఇప్పుడు నటిగా కూడా ఆదరిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. నా దగ్గరకు ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే వస్తున్నాయి. వచ్చిన ప్రతి సినిమాకూ ‘ఓకే’ చెప్ప కుండా ఆచితూచి సినిమాలను అంగీకరిస్తున్నాను. హిందీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ప్రేక్షకాభిమానం, పరిశ్రమ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు.