
విజయ్ సేతుపతి- పూరీ జగన్నాథ్ కాంబినేషన్ సినిమాలో ప్రముఖ కన్నడ హీరోకు ఛాన్స్ దక్కింది. ఈమేరకు ఒక ఫోటోను కూడా పూరీ పంచుకున్నారు. కన్నడ పరిశ్రమలో పాపులర్ హీరోగా గుర్తింపు పొందిన దునియా విజయ్ (Duniya Vijay) బాలకృష్ణతో వీరసింహారెడ్డి (Veera Simha Reddy) మూవీతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. అందులో ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో ఆయన దుమ్మురేపారని చెప్పవచ్చు. ఆయనకు గతంలోనే టాలీవుడ్ నుంచి ఎన్నో ఛాన్సులు వచ్చాయి. కానీ, ఆ సమయానికి తను హీరోగా వేరే చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశాలు వదులుకున్నాడు. అయితే, బాలకృష్ణ సినిమాతో ఇక్కడ బాగా గుర్తింపు పొందాడు. దీంతో ఆయన భారీ సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి.

విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్( Puri Jagannadh) దర్శకత్వంలో ‘బెగ్గర్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రానుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్‌లో ఆరంభం అవుతుంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో దునియా విజయ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.
మరోవైపు దాదాపు ఐదు సంవత్సరాల విరామం తరువాత 'టబు' ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇస్తుంది. కేవలం మంచి పాత్రలు దొరికితేనే నటిస్తానన్న టబు(Tabu) పూరీ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా, వైవిద్యంగా, బలంగా ఉంటుందని తెలిపింది. రాధికా ఆప్టే కూడా చాలా కాలం తర్వాత టాలీవుడ్‌లోకి ఇదే మూవీతో రానుందన ప్రచారం జరుగుతుంది. తెలుగుతో పాటు హింది, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చూస్తుంటే ఈ సారి పూరీ ఏదో కొత్తగా ప్లాన్ చేసినట్టే ఉన్నాడు.