‘‘పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ చేసే సినిమాలన్నీ వరంగల్‌లోనే స్టార్ట్ చేయాలి.. ఎందుకంటే వరంగల్‌లో ఏది మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది. ‘రొమాంటిక్’ ఘనవిజయం సాధిస్తుంది’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. లావణ్య సమర్పణలో పూరి జగన్నాధ్, చార్మి కౌర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది.
ఈ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఆకాశ్ మాటలు విన్నాక తనలో మంచి ఫైర్ ఉందనిపించింది. మీ నాన్న (పూరి జగన్నాద్) కాలర్ ఎగరేయాలి. ఆకాశ్ సినిమా పిచ్చి గురించి పూరి, చార్మీగార్లు నాకు చెప్పేవారు. ప్రతి సినిమా చూస్తాడట.. సినిమాపై పిచ్చి ఉన్న నీలాంటోళ్లు తప్పకుండా సక్సెస్ అవ్వాలి.. సక్సెస్ అవుతావు. ‘రొమాంటిక్’ సినిమా బాగా వచ్చిందని చూసినవాళ్లు చెప్పారు. ఈ సినిమా 100శాతం హిట్ అవుతుంది.
విధి అనేది నన్ను, పూరి జగన్నాథ్, చార్మీలను కలిపింది. ‘లైగర్’ సినిమా కోసం వారు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఈ సినిమాతో ఇండియాని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాం’’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘నాకు పదేళ్లప్పుడు స్కూల్ తరపున వరంగల్‌కి వచ్చాను. అప్పటి నుంచి నాకు వరంగల్‌తో అనుబంధం ఉంది. ‘రొమాంటిక్’ చిత్రంలో ఆకాశ్, రమ్యకృష్ణ, కేతిక ఇరగ్గొట్టేశారు. మంచి లవ్‌స్టోరీ. ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే మా సినిమా చూడండి. ఆకాశ్ చాలా మాట్లాడేశాడు.. వాడు చిన్నప్పుడు ప్రతిరోజూ లేవగానే ఓ డైలాగ్ చెప్పి వేషం ఇవ్వమని అడిగేవాడు నన్ను. తను మంచి నటుడు’’ అన్నారు.
‘‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రీ రిలీజ్ వరంగల్‌లో చేశాం.. పెద్ద హిట్ అయింది. అదే సెంటిమెంట్‌తోనే ‘రొమాంటిక్’ ప్రీ రిలీజ్ ఇక్కడే చేశాం. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించాలని మీరందరూ ఆశీర్వదించాలి’’ అన్నారు చార్మి. అనిల్ పాదూరి మాట్లాడుతూ– ‘‘టెంపర్’ సినిమా సమయంలో ఎన్టీఆర్‌గారు పూరి జగన్నాథ్‌గారికి నన్ను పరిచయం చేశారు. నన్ను నమ్మి ‘రొమాంటిక్’ అవకాశం ఇచ్చిన పూరి జగన్నాథ్, చార్మీగార్లకు థ్యాంక్స్. మంచి ప్రేమకథా చిత్రాల్లో ‘రొమాంటిక్’ కూడా ఒకటిగా నిలుస్తుంది’’ అన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
పూరి ఆకాశ్ మాట్లాడుతూ– ‘‘ఎక్కడో నర్సీపట్నంలో పుట్టిన మా నాన్న సినిమా నేపథ్యం లేకున్నా ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి పైకి వచ్చారు. ‘పూరి టైమ్ అయిపోయిందిలే.. ఇక సినిమాలు ఏం చేస్తాడు?’ వంటి రకరకాల కామెంట్స్ చూసినప్పుడు బాధ వేసేది. అలాంటి వారందరికీ ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్‌తో సమాధానం చెప్పారు. అలాగే ‘వీడేం హీరోలే’ అని నన్ను కొందరన్నారు. నన్ను చూసి మీరు గర్వపడేలా ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి కష్టపడతా నాన్నా.. ఏదో ఒకరోజు గర్వంగా మీరు కాలర్ ఎగరవేయాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment