‘‘ఈ మధ్య సోషల్ మీడియాలో, బయట ఓ ట్రెండ్ చూస్తున్నాను. అరే... నీకిది నచ్చిందా? అని అడిగితే... వాళ్లకు నచ్చుతుందేమో... వీళ్లకు నచ్చుతుందేమో అని తోటివారిపైకి తోస్తున్నారు. ముందు మనకు నచ్చిందా? అని చూసుకోవాలి. మీకు నచ్చింది మీరు చేయండి. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే పనులు జరగవు. సాధారణంగా నేను సలహాలివ్వను. నా అనుకున్నవాళ్లు అడిగితే ఇస్తా. మీ అందర్నీ (ఫ్యాన్స్) నా వాళ్లుగా ఫీలై ఇస్తున్నాను’’ అని రామ్ అన్నారు.
హీరో రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కాంబినేషన్‌లోనే 2019లో వచ్చిన హిట్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటించగా, సంజయ్ దత్, అలీ కీలక పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ మాట్లాడుతూ– ‘‘హీరోలు బుల్లెట్స్‌లాంటివారు. పేల్చే గన్ బాగుంటే బుల్లెట్ చాలా స్పీడ్‌గా వెళ్తుంది. పూరీగారిలాంటి గన్ ప్రతి ఒక్క యాక్టర్‌కి కావాలి. ఛార్మీ కౌర్‌గారు లేకపోతే ‘డబుల్ ఇస్మార్ట్’ లేదు. ఆమె ఓ ఫైటర్. బాస్ లేడీ అని పిలుస్తాను.
‘డబుల్ ఇస్మార్ట్’ రేంజ్‌కి తగ్గట్లు, ప్రేక్షకుల అంచనాలను మించేలా మణిశర్మగారు మ్యూజిక్ ఇచ్చారు’’ అని అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘రామ్ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. సంజయ్ దత్‌గారు మా సినిమాలో యాక్ట్ చేసి, కొత్త కలర్ తీసుకొచ్చారు. నా నిర్మాణసంస్థకు ఛార్మీ కౌర్ ఓ బలం. నా దగ్గర రూపాయి లేకపోయినా నాకోసం ఎవరన్నా నిలబడ్డారంటే అది విషురెడ్డి. హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ప్రశంసిస్తారు.
నా ఫ్లాప్ సినిమా విడుదలైన వారానికి విజయేంద్రప్రసాద్‌గారు ఫోన్ చేసి, ‘సార్... నాకో హెల్ప్ చేస్తారా?’ అన్నారు. ఆయన కొడుకే పెద్ద డైరెక్టర్.. రాజమౌళి. అలాంటిది ఆయన నన్ను హెల్ప్ అడుగుతున్నారేంటి? అనుకున్నా. ‘తర్వాతి సినిమా ఎప్పుడు చేస్తున్నారు? చేసే ముందు ఆ సినిమా కథ నాకోసారి చెప్తారా? మీలాంటి దర్శకులు ఫెయిల్ కావడం చూడలేను.
చిన్న చిన్న తప్పులేవో ఉంటుంటాయి. తీసే ముందు నాకోసారి చెప్పండి’ అన్నారు. నేను భావోద్వేగానికి గురయ్యాను. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ కథను విజయేంద్రప్రసాద్‌గారికి చెప్పలేదు. తెలిసిన పనే కదా... ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశా’’ అని తెలిపారు పూరి జగన్నాథ్. ‘‘ఇస్మార్ట్ శంకర్’ను ఆదరించినట్లే ‘డబుల్ ఇస్మార్ట్’నూ ఆదరించండి’’ అన్నారు ఛార్మీ. పూరీ కనెక్ట్స్ సీఈవో విషు రెడ్డి, అలీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment