క్రికెట్ నేపథ్యంలో ఇలాంటి సినిమా రాలేదు :చిరంజీవి
‘‘క్రికెట్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. వాటిల్లో ‘లగాన్’ బెస్ట్ అని నా అభిప్రాయం. ఆటిజంతో బాధ పడుతున్న కుర్రాడికి క్రికెట్‌పై ఉన్న ప్రేమను ఇందులో చూపించారు. ఇప్పటివరకూ క్రికెట్ నేపథ్యంలో ఇలాంటి సినిమా రాలేదు. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిరంజీవి అన్నారు. స్నేహిత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సచిన్’. సుహాసిని ప్రత్యేక పాత్ర పోషించారు.
ఎస్.మోహన్ దర్శకుడు. తానికొండ వెంకటేశ్వర్లు నిర్మాత. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో సినీ ప్రముఖులకు ప్రదర్శించారు. కె.విశ్వనాథ్, చిరంజీవి, టి.సుబ్బిరామిరెడ్డి, కుట్టి పద్మిని, మారుతి ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ- ‘‘నటిగా సుహాసిని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి మంచి సినిమాలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉంది.
స్నేహిత్ బాగా నటించాడు. దర్శకుడు మోహన్ చేసిన మంచి ప్రయత్నమిది’’ అన్నారు. 45 ఏళ్ల పైచిలుకు వయసులో 11 ఏళ్ల అబ్బాయికి అక్కగా నటించడం ఆనందంగా ఉందని, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని సుహాసిని చెప్పారు. ఇందులో సుహాసిని నటన చూసి ఈర్ష్య కలిగిందని, కథ నచ్చి హిందీ హక్కులు తీసుకున్నానని నటి కుట్టి పద్మిని అన్నారు.