సాక్షి, హైదరాబాద్ : హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతి తీరని లోటు అని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. అనారోగ‍్యంతో గుండు హనుమంతరావు సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..‘తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్య నటుడిదీ ఒక్కో శైలి. అలానే గుండు హనుమంతరావు సైతం తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తూ వచ్చారు. ఆ మధ్య ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి కలత చెందాను.
నా వంతు సాయం అందించాను. పరిపూర్ణ ఆరోగ్యంతో గుండు హనుమంతరావు తిరిగి సినిమాల్లో నటిస్తారని భావించాను. కానీ ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. గుండు హనుమంతరావు మృతితో తెలుగు సినిమా రంగం మంచి నటుడినే కాదు, చక్కని మనిషినీ కోల్పోయింది. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. కాగా గుండు హనుమంతరావు సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ఎర్రగడ్డలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 400 పైగా సినిమాల్లో హనుమంతరావు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment