జస్ట్ ఝలక్!
రెడీ... స్టార్ట్... కెమెరా...రోలింగ్... యాక్షన్... ఈ మాటలు హీరో చిరంజీవికి కొత్త కాదు. ఇప్పటివరకూ 149 సినిమాలకు ఈ మాటలు విన్నారు. ఒక్కసారి కెమెరా ఆన్ అయ్యిందా... పరిసరాలను మర్చిపోయి పాత్రలో మమేకమవడం ఈ మెగాస్టార్ స్టైల్. అయితే, ‘మగధీర’ తరువాత ఆయన ఈ మాటలకు దూరమయ్యారు. ఆరేళ్ళ పైచిలుకు తరువాత సోమవారం చిరంజీవి తనకిష్టమైన, అలవాటైన బరిలో మరోసారి జూలు విదిలించారు. అతిథి పాత్రతో ప్రేక్షకులకు ఝలక్ ఇవ్వడానికి సోమవారం నుంచి వరుసగా మూడు రోజులు ఈ మెగాస్టార్ సెట్స్‌లో ‘మెగా’ సందడి చేస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రూస్‌లీ... ది ఫైటర్’లో చిరంజీవి చేస్తున్న అతిథి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొదలైంది. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి అతిథి పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ, తండ్రినీ, తనయుణ్ణీ ఒకే ఫ్రేమ్‌లో చూడడం అభిమానులకు కనులపండుగనీ నిర్మాత పేర్కొన్నారు.
చిరంజీవి ఈ సినిమాలో ఒక పాటతో పాటు ఫైట్ సీక్వెన్స్‌లో కనిపిస్తారని గతంలో విస్తృతంగా ప్రచారమైంది. అయితే, ఈ చిత్రంలో కీలకమైన ఒక ఫైట్‌లో మాత్రమే చిరంజీవి తెరపై కనిపించనున్నారు. అదీ కేవలం... మూడంటే మూడు నిమిషాల వ్యవధి ఉండే పాత్ర. అయితే, చిరంజీవి హీరోగా రానున్న పూర్తిస్థాయి సినిమాకు ఇది జస్ట్ ఒక చిన్న ఝలక్. రామ్ చరణ్ సైతం, ‘‘నాన్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆయన మా ‘బ్రూస్‌లీ’లో భాగం కావడం సంతోషంగా ఉంది. హీరోగా ఆయన కమ్‌బ్యాక్ సినిమాకు ఇది జస్ట్ ఓ టీజర్’’ అని తన ఆనందాన్ని పంచుకున్నారు. రామ్‌చరణ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని, ఫైటర్ పాత్ర చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. అక్టోబర్ 2న ‘బ్రూస్‌లీ’ పాటల్నీ, 16న చిత్రాన్నీ విడుదల చేయాలనుకుంటున్నారు. మూడు నిమిషాల అతిథి పాత్ర అయితేనేం, అభిమానులతో పాటు ఇప్పుడు ఫిల్మ్ నగర్ అంతా చిరంజీవి గురించే మాట్లాడుకుంటున్నారు. స్లిమ్‌గా తయారై, అందరినీ ఆకట్టుకొనేలా మారిన చిరు అసలుసిసలు కమ్‌బ్యాక్ ఫిల్మ్ కోసమే ఇప్పుడు అంతా వెయింటింగ్.