వావ్ అనకుండా ఉండలేకపోయా!
చిరంజీవి
దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య జరిగిన యుద్ధంలో మానవశక్తి ఎలా సహాయపడిందనే కథతో రూపొందిన సోషియో ఫాంటసీ చిత్రమిది. నా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ అలాంటి చిత్రమే’’ అన్నారు చిరంజీవి. ఆకాశ్‌కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా, జయప్రద ప్రధానపాత్రలో నటించిన సినిమా ‘శరభ’. ద గాడ్.. ఉపశీర్షిక. ఎన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనికుమార్ సహదేవ్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లను చిరంజీవి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ సిన్మాలోని కొన్ని సన్నివేశాలను చూశా.
తనలో దుష్టశక్తి ఆవహించి, అప్పుడే పుట్టిన తన బిడ్డను చంపాలని ప్రయత్నిస్తున్న టైమ్‌లో జయప్రదగారు నటించిన తీరు ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా చేస్తుంది. ఆమె నటన చూసి వావ్ అనకుండా ఉండలేకపోయా. క్లైమాక్స్‌లో నరసింహస్వామి పూనిన తర్వాత ఆకాశ్ నటన కూడా అద్భుతం. దర్శకుడు విజువల్ వండర్‌గా సిన్మాను తీర్చిదిద్దారు. లక్ష్మీ నరసింహస్వామి కృపతో సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకముంది’’ అన్నారు.
జయప్రద మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర చేయాలని ఎదురుచూస్తున్న టైమ్‌లో దర్శకుడు ‘శరభ’ కథ చెప్పారు. చిరంజీవిగారి గోల్డెన్ హ్యాండ్స్ మీదుగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. ఆయన ప్రేమ, ఆశీస్సులే మా బలం’’ అన్నారు. ‘‘పక్కా కమర్షియల్ చిత్రమిది. తండ్రి సెంటిమెంట్‌తో పాటు నరసింహస్వామి దైవబలం కూడా సినిమాలో ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. సురేశ్ కపాడియా, కథానాయిక మిస్తీ చక్రవర్తి, సినిమాటోగ్రాఫర్ రమణ సాల్వ తదితరులు పాల్గొన్నారు.