Sharabha
-
మొదటి సినిమా గుర్తొస్తోంది
‘‘నా మొదటి చిత్రం (‘భూమి కోసం’) రిలీజ్ అవుతున్నప్పుడు ఎంత అసౌకర్యంగా ఫీలయ్యానో మళ్లీ ఇప్పుడు ‘శరభ’ సినిమాకీ అంతే అసౌకర్యంగా అనిపిస్తోంది. ప్రతి పాత్రకి దర్శకుడు జీవం పోశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘శరభ’ లాంటి మంచి ఫీల్ ఉన్న చిత్రంతో రావడం గర్వంగా ఉంది. ఈ చిత్రంలో రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తాను. టీమ్ అంతా చాలా కష్టపడి ఈ సినిమా చేసారు. తప్పకుండా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని నటి జయప్రద అన్నారు. ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా యన్. నరసింహా రావు దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం ‘శరభ’. జయప్రద, నాజర్, నెపోలియన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యన్. నరసింహారావు మాట్లాడుతూ– ‘‘20ఏళ్లుగా ఇండస్ట్రీలో దర్శకత్వశాఖలో పని చేశాను. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. సోషియో ఫాంటసీ జోనర్లో రూపొందించా. తొలి చిత్రంలోనే గొప్ప ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. ఆకాష్ కుమార్, సహనిర్మాత సురేష్ కపాడియా పాల్గొన్నారు. -
బాహుబలి తర్వాత శరభ
‘‘నరసింహారావు నా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘శరభ’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత నాకు విజువల్ పరంగా బాగా నచ్చిన చిత్రం ‘శరభ’’ అని నటుడు–దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. డా.జయప్రద, ఆకాశ్‌కుమార్, మిస్తి చక్రవర్తి, నెపోలియన్, నాజర్, పునీత్ ఇస్సార్, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, పొన్వణ్ణన్, సాయాజీ షిండే, అవినాష్, పృథ్వీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘శరభ’. యన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రం మేకింగ్ వీడియోను ఆర్.నారాయణమూర్తి, ట్రైలర్‌ను నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్ చేశారు. నరసింహారావు మాట్లాడుతూ– ‘‘కొత్త తరహా చిత్రమిది. ‘భక్త ప్రహ్లాద’ తర్వాత అంత గొప్పగా ఆడుతుందని నమ్ముతున్నా. ఈ సినిమా టెక్నీషియన్లందరూ కలిసి నన్ను శంకర్ స్థాయిలో నిలబెట్టేలా కృషి చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు అశ్వనీకుమార్ సహదేవ్. ‘‘సినిమా వాడిగా పుట్టడం గొప్ప విషయం. నా బ్యానర్లో తొలి సినిమాగా ఎన్టీఆర్‌గారి ‘జీవిత ఖైదు’ విడుదల చేశాను. ఏఎన్నార్గారితోనూ చేశాను. మధ్యలో చాలా సినిమాలు చేశా. ఇప్పుడు ‘శరభ’ రిలీజ్ చేస్తున్నా. నేను జయప్రదగారికి పెద్ద ఫ్యాన్’’ అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. ‘‘నేను ఫోన్ చేయగానే నా మీద నమ్మకంతో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న చదలవాడ శ్రీనివాసరావుగారికి ధన్యవాదాలు. నేను తెలుగమ్మాయిని అని చెప్పుకోవడానికి గర్వపడతాను. ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో నటించినప్పుడు ప్రత్యేకమైన సంతృప్తి ఉంటుంది. నాకు తెలుగు ఇండస్ట్రీ అమ్మలాంటిది’’ అన్నారు జయప్రద. మిస్తి చక్రవర్తి పాల్గొన్నారు. -
దైవశక్తితో పోటీ
ఆకాష్ కుమార్ హీరోగా, జయప్రద ముఖ్య పాత్రలో ఎన్. నరహింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శరభ’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. నరసింహారావు మాట్లాడుతూ–‘‘దైవ శక్తికి, క్షుద్ర శక్తికి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం. క్షుద్ర శక్తుల నుంచి తన కొడుకును కాపాడుకునేందుకు ఓ తల్లి పడిన తాపత్రయం ఈ చిత్రం ముఖ్య కథాంశం. తల్లి పాత్రలో జయప్రద అద్భుతంగా నటించారు. గ్రాఫిక్స్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఈ సినిమా కోసం హీరో ఆకాష్ చాలా కష్టపడ్డారు’’ అన్నారు. ‘‘కథకు అనుగుణంగా సినిమాలో వచ్చే 55 నిమిషాల గ్రాఫిక్స్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇందులో దాదాపు 1269 గ్రాఫిక్స్ షాట్స్ ఉన్నాయి. క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు అశ్వనీ కుమార్. నాజర్, నెపోలియన్, ప్రవీణ్ నటించిన ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. -
నాకు ఇది సక్సెస్ ఫుల్ రీ ఎంట్రీ – జయప్రద
‘‘నేను కొంచెం గ్యాప్ తర్వాత సినిమా చేయాలనుకున్నప్పుడు ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. నరసింహారావుగారు వచ్చి ‘శరభ’ కథ చెప్పారు. వినగానే సినిమా తప్పకుండా క్లిక్ అవడంతో పాటు నాకు సక్సెస్ ఫుల్ రీ ఎంట్రీ అవుతుందనిపించి చేశా’’ అని నటి జయప్రద అన్నారు. ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా, జయప్రద ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘శరభ’. యన్. నరసింహారావు దర్శకత్వంలో ఎ.ఎస్.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జయప్రద మాట్లాడుతూ –‘‘నటిగా దాదాపు మూడు వందల సినిమాలకు చేరువ కాబోతున్నాను. ఈ తరుణంలో నాకీ సినిమా ఓ మలుపు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. చాలా వేరియేషన్స్ ఉన్న పాత్ర నాది. అశ్వనీకుమార్‌గారు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ధైర్యంగా మూడేళ్లు ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు. ‘‘నరసింహారావుగారికి ఇది తొలి సినిమా అయినా కూడా ఇంత పెద్ద సబ్జెక్ట్‌ను చక్కగా డీల్ చేశారు. జయప్రదగారు ఈ సినిమాలో తల్లి పాత్రలో అద్భుతంగా నటించారు’’ అన్నారు చిత్రసంగీత దర్శకుడు కోటి. ‘‘మంచి విజువల్ గ్రాఫిక్స్ ఉన్న సినిమా ఇది. ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతి ఇస్తుంది’’ అన్నారు అశ్వనీకుమార్ సహదేవ్. హీరో ఆకాశ్ పాల్గొన్నారు. -
‘శరభ’ ఫస్ట్ సింగిల్
బాహుబలి సక్సెస్ తరువాత సోషియో ఫాంటసీ సినిమాలకు ఆధారణ పెరిగింది. అదే బాటలో తెరకెక్కుతున్న మరో గ్రాఫికల్ వండర్ శరభ. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘శరభ’ పోస్టర్ రిలీజ్ చేయించారు మేకర్స్. దీంతో ‘శరభ’ సినిమాపై టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. చాలా ఏళ్ల తరువాత జయప్రద ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో ఆకాశ్ కుమార్ సహదేవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. తాజాగా శరభ సినిమాలోని ‘టామ్ అండ్ జెర్రీ’ అనే పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు కోటి స్వరాలు సమకూర్చగా, అనంత శ్రీరామ్ సాహిత్యాని అందించారు. హేమచంద్ర పాడిన ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. మిస్తీ చక్రవర్తి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అశ్విని కుమార్ సహదేవ్ నిర్మాతగా వ్యవహరించగా, నర్సింహా రావు దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 1న శరభ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
దేవుడు మనతోనే ఉంటాడు
‘ఫైర్ ఉన్న నాలాంటి కుర్రాడితో పెట్టుకోకు..బాడీ మార్చురీలో ఉంటుంది. దేవుడికే దెయ్యం పట్టిస్తే సృష్టి సర్వనాశనం అవుతుంది. వెళ్లేదారి మంచిదైతే దేవుడు కూడా మనతో వస్తాడు. గమ్యం చేరేదాకా ఆయన మనతోనే ఉంటాడు’ వంటి డైలాగ్స్ ‘శరభ’ చిత్రంపై ఆసక్తి పెంచుతున్నాయి. ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా రూపొందిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘శరభ’. జయప్రద, నెపోలియన్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఏ.కె.ఎస్. ఎంటర్టైన్మెంట్ పతాకంపై అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నారు. అశ్వనీకుమార్ సహదేవ్ మాట్లాడుతూ– ‘‘మంచి కథ, కథనాలతో నరసింహారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అవుట్‌పుట్ బాగా వచ్చింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ చేసిన ప్రోస్థటిక్ మేకప్, సీజీ వర్క్ ప్రత్యేక ఆకర్షణలు. చిరంజీవిగారు ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి, ‘దిల్’ రాజుగారు రిలీజ్ చేసిన టీజర్‌కి భారీ స్పందన లభించింది. కోటిగారి సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. ఒక కొత్త డైరెక్టర్, కొత్త హీరో కాంబినేషన్లో రూపొందిన మా చిత్రం హిందీ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం’’ అన్నారు. పునీత్ ఇస్సార్, తనికెళ్ల, ఎల్.బి.శ్రీరామ్, సాయాజీ షిండే, పృధ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రమణ సాల్వ. -
సినిమాలో ఆ మ్యాజిక్ ఉంటే హిట్టే
– ‘దిల్’ రాజు ‘‘నరసింహ మా బ్యానర్లో కో–డైరెక్టర్‌గా పని చేశాడు. ఓ రోజు ‘శరభ’ అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నానన్నాడు. రీసెంట్గా టీజర్ చూíసి, థ్రిల్ అయ్యా. టీజర్లో మేజిక్ ఉంది. సినిమా అంతా అదే మేజిక్ ఉంటే సూపర్‌హిట్ అవుతుంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఆకాశ్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా జయప్రద ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘శరభ’. ఎన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నా తొలి సినిమా ఇది. కొంత మంది నిర్మాతలు కథ బావుందని అన్నా, బడ్జెట్ విషయంలో వెనకడుగువేశారు. ఆ సమయంలో ఆకాశ్ తండ్రిగారిని కలిస్తే తన కొడుకుతో ఈ సినిమా చేయమన్నారు. సినిమా కోసం 30 కోట్లు ఖర్చుపెట్టడం కాదు. ఆయన కొడుకు భవిష్యత్‌ను నా చేతుల్లో పెట్టిన నిర్మాత దొరకడం నా అదృష్టం. ఆకాశ్ కుమార్ అద్భుతంగా నటించాడు’’ అన్నారు. ‘‘మా అబ్బాయి రోషన్ సాలూరి సంగీతం అందించాడు. నేను సహాయంగా ఉన్నానంతే. కథకు తగ్గట్టే మంచి సంగీతం, నేపథ్య సంగీతం కుదిరింది’’ అని సంగీత దర్శకుడు కోటి అన్నారు. దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు, సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, నటుడు ఎల్.బి. శ్రీరాం, ప్రజాకవి గొరేటి వెంకన్న పాల్గొన్నారు. -
ఇక నా దృష్టంతా సినిమాలపైనే: సీనియర్ నటి
సాక్షి, హైదరాబాద్: 'ఇక నా దృష్టంతా సినిమాలపైనే.. ' సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద తెలిపారు. చెన్నై ప్రసాద్ ల్యాబ్‌లో శనివారం శరభ చిత్రం టీజర్ లాంచ్ చేశారు. ఈ చిత్రంలో జయప్రద ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో జయప్రద మాట్లాడుతూ కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. రాజకీయాల్లో ఉండటం వల్ల సినీ దర్శకులు మంచి కథలతో తన వద్దకు రాలేకపోయారని చెప్పారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నాలుగు చిత్రాలతో నటిస్తూ బిజీగా ఉన్నానని వివరించారు. -
వావ్ అనకుండా ఉండలేకపోయా!
చిరంజీవి దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య జరిగిన యుద్ధంలో మానవశక్తి ఎలా సహాయపడిందనే కథతో రూపొందిన సోషియో ఫాంటసీ చిత్రమిది. నా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ అలాంటి చిత్రమే’’ అన్నారు చిరంజీవి. ఆకాశ్‌కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా, జయప్రద ప్రధానపాత్రలో నటించిన సినిమా ‘శరభ’. ద గాడ్.. ఉపశీర్షిక. ఎన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనికుమార్ సహదేవ్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లను చిరంజీవి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ సిన్మాలోని కొన్ని సన్నివేశాలను చూశా. తనలో దుష్టశక్తి ఆవహించి, అప్పుడే పుట్టిన తన బిడ్డను చంపాలని ప్రయత్నిస్తున్న టైమ్‌లో జయప్రదగారు నటించిన తీరు ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా చేస్తుంది. ఆమె నటన చూసి వావ్ అనకుండా ఉండలేకపోయా. క్లైమాక్స్‌లో నరసింహస్వామి పూనిన తర్వాత ఆకాశ్ నటన కూడా అద్భుతం. దర్శకుడు విజువల్ వండర్‌గా సిన్మాను తీర్చిదిద్దారు. లక్ష్మీ నరసింహస్వామి కృపతో సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకముంది’’ అన్నారు. జయప్రద మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర చేయాలని ఎదురుచూస్తున్న టైమ్‌లో దర్శకుడు ‘శరభ’ కథ చెప్పారు. చిరంజీవిగారి గోల్డెన్ హ్యాండ్స్ మీదుగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. ఆయన ప్రేమ, ఆశీస్సులే మా బలం’’ అన్నారు. ‘‘పక్కా కమర్షియల్ చిత్రమిది. తండ్రి సెంటిమెంట్‌తో పాటు నరసింహస్వామి దైవబలం కూడా సినిమాలో ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. సురేశ్ కపాడియా, కథానాయిక మిస్తీ చక్రవర్తి, సినిమాటోగ్రాఫర్ రమణ సాల్వ తదితరులు పాల్గొన్నారు. -
వైవిధ్యమైన కథాంశంతో...
అలనాటి అందాల తార, సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో ‘శరభ’ చిత్రం తెరకెక్కింది. ఆకాష్ సహదేవ్, మిస్తి చక్రవర్తి జంటగా ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఏకేఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్వినికుమార్ సహదేవ్, గిరీష్ కపాడియా ఈ చిత్రాన్ని నిర్మించారు.. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిచిన చిత్రమిది. కోటిగారు మంచి పాటలిచ్చారు. ముఖ్యంగా 500మంది జూనియర్ ఆర్టిస్టులు, యాభై మంది డ్యాన్సర్స్‌తో శేఖర్ మాస్టర్ నేతృత్వంలో తెరకెక్కించిన జానపద పాట ఆకట్టుకుంటుంది. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన ఫైట్ కథకు కీలకంగా నిలుస్తుంది. వాకాడ అప్పారావుగారి సహకారంతో నిర్మాణం సులువుగా జరిగింది’’ అని పేర్కొన్నారు. ‘‘సరికొత్త కథాంశంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. అతి త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రమణ సాల్వ, సహ నిర్మాత: సురేష్ కపాడియా.