ఆ ఇద్దరు కలిసిపోయారా..?
రాజకీయాల్లోనేకాదు.. సినీ రంగంలో కూడా శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరు. గతంలో ఢీ అంటే ఢీ అన్న వాళ్లు కూడా కలిసి పని చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే బాటలో ఓ ఆసక్తికరమైన కలయిక వెండితెర మీద దర్శనమివ్వనుందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి, దాసరి నారాయణరావు వర్గానికి అంత మంచి సంబంధాలు లేవన్నది అందరికీ తెలిసిన విషయమే. పలు సందర్భాలు దాసరి చేసిన కామెంట్స్పై మెగా హీరోలు బహిరంగంగానే స్పందించారు కూడా.
అయితే అదంతా గతం.., ఇటీవల మెగా హీరో పవన్ కళ్యాణ్ దాసరి నిర్మాణంలో సినిమా చేయనున్నాడన్న వార్త ఫిలింనగర్లో బాగా వినిపించింది. పవన్ స్వయంగా దాసరి ఇంటివెళ్లి కలవటం, తరువాత తాము కలిసి పనిచేయబోతున్నాం అని ప్రకటించటంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా పవన్తో అనుకున్న సినిమా చిరంజీవి చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాజకీయాల కారణంగా దాసరి, చిరుల మధ్య దూరం కాస్త తగ్గిందన్న టాక్ వినిపిస్తోంది.
అందుకే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను చిరంజీవి హీరోగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. దాసరి దర్శకత్వంలో ఒక్క లంకేశ్వరుడు సినిమా మాత్రమే చేసిన చిరు, తరువాత హిట్లర్ సినిమా కోసం ఆయనతో కలిసి నటించాడు. ఆ తరువాత మెగా ఫ్యామిలీకి దాసరికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. తాజాగా దాసరి నిర్మాతగా చిరంజీవి సినిమా చేస్తున్నాడన్న వార్త అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. మరి నిజంగానే ఈ కలయిక వెండితెర దాకా వస్తుందా.?