చిరంజీవిగారు ఈ సినిమా ఆపేయమనలేదు : నిర్మాత బండ్ల గణేశ్
‘‘మా సినిమాపై మీడియాలో వినిపిస్తున్నవన్నీ రూమర్లే. వాటిల్లో నిజాలు లేవు. ఇలాంటి రూమర్లు మాకు కొత్తేం కాదు. గతంలో ‘గబ్బర్‌సింగ్’ విషయంలో కూడా ఇలాగే జరిగింది. కానీ... అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ అఖండ విజయాన్ని అందుకున్నాం. త్వరలో మా ‘గోవిందుడు అందరివాడేలే’తో అదే ఫీట్‌ని రిపీట్ చేయబోతున్నాం’’ అని బండ్ల గణేశ్ అన్నారు. రామ్‌చరణ్ కథానాయకునిగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం విశేషాలు తెలుపడానికి శనివారం బండ్ల గణేశ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘రామ్‌చరణ్‌కి జర్వం రావడంతో ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్‌కి కొంత విరామం ఏర్పడింది. ఇందులో ప్రథమంగా చరణ్ తాతయ్య పాత్ర కోసం రాజ్‌కిరణ్‌ని తీసుకున్నాం. ఆయనపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం కూడా. రాజ్‌కిరణ్ అద్భుతంగా నటించారు. అయితే... ఆయన నటన తెలుగు నేటివిటీకి దూరంగా ఉందని అనిపించింది. అందుకే... ఆయన స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ని తీసుకున్నాం. ఈ చిన్న చిన్న అవాంతరాల కారణంగా చిత్రీకరణలో జాప్యం జరిగింది. అంతేతప్ప కొంద రు అనుకుంటున్నట్లు చిరంజీవిగారు ఈ చిత్రాన్ని ఆపేయమనలేదు.
అసలు ఆయన ఈ సినిమా చూడనేలేదు’’ అని వివరించారు బండ్ల గణేశ్. మొదట వంద రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలనుకున్నామని, ఈ జాప్యం కారణంగా మరో ఎనిమిది రోజులు అదనంగా చిత్రీకరణ జరపాల్సి వస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేస్తామని బండ్ల గణేశ్ ప్రకటించారు.