Krishnavamsi
-
హీరోగా మొగలి రేకులు సీరియల్ ఫేమ్.. రిలీజ్‌కు ముందే అవార్డులు కొల్లగొట్టిన చిత్రం!
బుల్లితెరపై మొగలి రేకులు సీరియల్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్లో మరింత ఫేమ్ తెచ్చుకున్న సాగర్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం 'ది 100'. ఈ సినిమా విడుదలకు ముందే సత్తా చాటుతోంది. అంతర్జాతీయ వేదికపై సైతం అవార్డ్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా పలు ఫిల్మ్ ఫేర్ ఫెస్టివల్స్‌లోనూ అవార్డులను గెలుచుకుంది.అయితే ఈ మూవీతో కృష్ణవంశీ శిష్యుడు ఓంకార్ శశిధర్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సక్సెస్ అంతా కృష్ణవంశీకే అంకితమని ఓంకార్ శశిధర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆయన వల్లే తనకు ఇంత పేరు వచ్చిందన్నారు. గతంలో కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శశిధర్ ఈ మూవీ ద్వారానే టాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నారు.ఆయనకే అంకితం.. శశిధర్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' నేను దర్శకత్వం వహించిన తొలి చలనచిత్రం "ది 100" అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాలోని పాత్రలను ఎంతో మెచ్చుకున్నారు. ఇంత అర్ధవంతమైన కథను రూపొందించడం, దాని పాత్రలను సృష్టించడం వెనుక పూర్తిగా నా గురువుగా, కృష్ణవంశీ సార్ నుంచి ప్రేరణ పొందినదే. ఆయన దగ్గర నేను నేర్చుకున్న విలువలు, కథలు చెప్పే పద్ధతులు ఈ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాయి. అందుకే ఈ విజయాన్ని 100 శాతం నా గురువుగారికి అంకితం చేస్తున్నా. త్వరలోనే ఈ చిత్రాన్ని మీ అందరి ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ దీవెనలు, మద్దతు మా టీమ్‌కు ఎల్లప్పుడు ఉండాలి. నాకు మార్గదర్శకంగా నిలిచినందుకు కృష్ణ వంశీ సార్‌కు కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ట్రైలర్ విడుదల చేసిన అంజనాదేవి..యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ది 100 మూవీ టీజర్‌ను ఇటీవల చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రంలో విక్రాంత్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా సాగర్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సాగర్ సరసన మిషా నారంగ్ హీరోయిన్గా నటిస్తోంది. ధన్యా బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు అర్జున్‌రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sasidhar P (@raghavomkarsasidhar) -
ఆసక్తికర అప్డేట్: మెగాస్టార్ వాయిస్‌తో కృష్ణవంశీ ‘రంగమార్తాండ’
ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠిలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘నటసామ్రాట్’ చిత్రానికి రీమేక్‌గా ‘రంగమార్తాండ’ తెరకెక్కింది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి ‘గాడ్‌ఫాదర్’ మెగాస్టార్ చిరంజీవి గొంతు ఇచ్చినట్లు తాజాగా డైరెక్టర్ కృష్ణవంశీ వెల్లడించారు. చదవండి: 'సర్కారు వారి పాట' సెట్లో నమ్రత సందడి ఈ మేరకు ఆయన ట్విట్ చేస్తూ.. ‘అడగ్గానే ఒప్పుకుని.. మరేమీ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మా చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పినందుకు థాంక్యూ అన్నయ్యా’ అంటూ చిరుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మెగా వాయిస్ ‘రంగమార్తాండ’ వినీలాకాశంలో మరో వెలుగు దివ్వె అని అభివర్ణించారు ఆయన 'రంగమార్తాండ' చిత్రంలో ప్రకాశ్ రాజ్‌తో పాటు రమ్యకృష్ణ కీ రోల్ పోషిస్తుండగా.. అనసూయ భరద్వాజ్, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ThQ annyya for ur generocity n unconditional kindness ...one more crowned lightening on #rangamarthandas sky ... THE MEGA VOICE........ @prakashraaj @meramyakrishnan @ShivathmikaR @anusuyakhasba @Rahulsipligunj @AadarshBKrishna @kalipu_madhu pic.twitter.com/mApNqcGvxV — Krishna Vamsi (@director_kv) October 26, 2021 -
రంగ మార్తాండలో...
ఈ ఏడాది విడుదలైన ‘దొరసాని’ చిత్రం ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యారు శివాత్మికా రాజశేఖర్... డాటరాఫ్ జీవితారాజశేఖర్. తొలి చిత్రంతోనే నటిగా ప్రేక్షకుల మెప్పు పొందారామె. తాజాగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే చాన్స్ కొట్టేశారు శివాత్మిక. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రంగ మార్తాండ’. నానా పటేకర్ నటించిన మారాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాలో గాయనిగా నటిస్తున్నారట శివాత్మిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో శివాత్మిక పాల్గొంటున్నారని తెలిసింది. ఇందులో ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణల కూతురి పాత్రలో కనిపిస్తారట శివాత్మిక. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
రొమాంటిక్‌లో గెస్ట్
దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి తన కొత్త సినిమా కోసం రొమాంటిక్‌గా మారిన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. కేతికా శర్మ హీరోయిన్. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. బుధవారం నుంచి ఈ సినిమా షూటింగ్లో రమ్యకృష్ణ పాల్గొంటున్నారు. ఈ సినిమాలో ఆల్రెడీ బాలీవుడ్ భామ మందిరా బేడీ కీలక పాత్ర చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత... క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తదుపరి సినిమా ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ బాగా ఉంది. ఆయన నెక్ట్స్ సినిమాను బుధవారం అధికారికంగా ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ జంటగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్నారు కృష్ణవంశీ. అభిషేక్ జాకర్, మధు కలిపు నిర్మించనున్నారు. ఈ సినిమా ‘నటసామ్రాట్’ అనే మరాఠీ సినిమాకు రీమేక్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 2004లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. అంటే.. 15 ఏళ్ల తర్వాత మళ్లీ భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ యాక్ట్ చేయబోతున్నారు. అయితే అప్పుడు గెస్ట్ రోల్. ఇప్పుడు కథానాయిక. -
లేడీ పోలీసాఫీసర్
‘‘అందంగా.. అమాయకంగా.. కనిపిస్తుందని ఈ అమ్మాయిని తక్కువ అంచనా వేయకండి. కేడీల తాట తీసే లేడీ పోలీసాఫీసర్ ఈవిడ’’ అంటున్నారు కృష్ణవంశీ. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘నక్షత్రం’. సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా సాయిధరమ్ తేజ్ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసింది. తేజూకి జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ని ఎంపిక చేశారు. డేరింగ్ అండ్ డైనమిక్ పోలీసాఫీసర్‌గా ప్రగ్యా కనిపించనున్నారు. అతిథి పాత్రకు జోడీ అంటే తళుక్కున మెరిసే చిన్నాచితకా పాత్ర కాదట. కథలో కీలక సన్నివేశాలతో పాటు ప్రగ్యాపై రెండు ఫైట్స్ తీస్తున్నట్టు కృష్ణవంశీ తెలిపారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆ రెండు ఫైట్స్‌లో ఒకటి హీరో సందీప్‌తో కావడం. వీరిద్దరూ ఎందుకు ఫైట్ చేసుకున్నారో తెలియాలంటే ‘నక్షత్రం’ విడుదల వరకూ ఎదురుచూడక తప్పదు. త్వరలో ప్రగ్యా జైస్వాల్ చిత్రీకరణలో పాల్గొననున్నారు. పేరుకు మాత్రమే ఇది ‘నక్షత్రం’.. కాస్టింగ్ పరంగా చూస్తే అందాల హరివిల్లు అనాలేమో! ఈ చిత్రంలో హీరోయిన్ రెజీనాతో పాటు కాజల్ అగర్వాల్, ప్రగ్యా జైస్వాల్ అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యే లోపు ఇంకెంత మంది ‘నక్షత్రం’లో మెరుస్తారో! -
'రైతు'గా బాలయ్య..
హిందూపూర్ (అనంతపురం జిల్లా) : నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో 'రైతు'గా కనిపించనున్నారు. పలువురి రైతుల ఎదుట స్వయానా బాలయ్యే తన 101వ సినిమా వివరాలను వెల్లడించారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా మంగళవారం రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. అదే వేదికపై తన 101 వ చిత్రం గురించి ప్రకటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందనున్న ఆ సినిమా పేరు 'రైతు' అని తెలిపారు. బాలయ్య వరుస చిత్రాలు చేస్తుండటంతో అభిమానులు తెగ సంబర పడుతున్నారు. కాగా ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక 100 వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' సెట్స్ మీదున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి బరిలో నిలువనుంది. -
కృష్ణవంశీని ఆకాశానికెత్తిన కమలినీ ముఖర్జీ
చెన్నై: 'ఆనంద్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెంగాలీ భామ కమలినీ ముఖర్జీ దర్శకుడు కృష్ణవంశీని పొగడ్తలతో ఆకాశానికెత్తారు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించేసుకుని, ఆ తరువాత 'గోదావరి' సినిమాతో మరింత దగ్గరైన కమలినీ తాజాగా 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో నటించింది. ఇటువంటి కుటుంబ కథా చిత్రంలో నటించినందుకు గర్వపడ్తున్నాననీ కమలినీ చెప్పారు. ఈ చిత్రంలో నటించడం ద్వారా గొప్ప అనుభూతి పొందినట్లు పేర్కొన్నారు. కుటుంబ సంబంధాలు, మనుషులలో భావోద్వేగాలు, వారి మనస్తత్వాలు తెలియజేయడంలో కృష్ణవంశీ దిట్ట అన్నారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్-కాజల్ జంటగా నటించిన 'గోవిందుడు అందరివాడేలే' ఈరోజు విడుదలైన సందర్భంగా కమలినీ ఈ సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులందరూ ఓ కుటుంబంలా కలిసిమెలిసి పనిచేసినట్లు చెప్పారు. తన కెరీర్లో దీర్ఘ కాలం 8 నెలలు షూటింగ్ చేసిన చిత్రం ఇదేనన్నారు. షూటింగ్ జరిగినంత కాలం చాలా ఆనందంగా గడిచిపోయినట్లు తెలిపారు. ఈ చిత్రం ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందన్నారు. కృష్ణ వంశీ కెరీర్లో ఇది ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుందన్నారు. కుటుంబ కథా చిత్రాలు నిర్మించడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉందని ప్రశంసించారు. తన కెరీర్లో నటించిన పాత్రలకు భిన్నమైన పాత్ర ఇందులో పోషించినట్లు చెప్పారు. ఇటువంటి పాత్ర తనతో చేయించినందుకు కృష్ణ వంశీకి కమలినీ కృతజ్ఞతలు తెలిపారు. ** -
'ఆ సినిమా చూసి నాకు ఏడుపొచ్చింది'
రెండు రోజుల్లో విడుదల కాబోతున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం తొలికాపీ చూసిన తర్వాత తనకు కళ్లవెంబడి నీళ్లు జలజలా రాలిపోయాయని చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. ఈ సినిమా తన కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమా బుధవారం నాడు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఎంత ఎమోషన్ చూసినా తాను సాధారణంగా కన్నీరు పెట్టనని, కానీ ఇది చూసిన తర్వాత మాత్రం వాటిని ఆపుకోలేకపోయానని గణేశ్ అన్నారు. బాపు గారి అత్యుత్తమ చిత్రం 'ముత్యాల ముగ్గు' అయితే.. కృష్ణవంశీ అత్యుత్తమ చిత్రం 'గోవిందుడు..' అవుతుందని చెప్పారు. అది విడుదలైన తర్వాత ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అనే విషంలో తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, కమలినీ ముఖర్జీ, శ్రీకాంత్, ఆదర్శ్ బాలకృష్ణ కూడా ఉన్నారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం అందించారు. -
కొడుకుతో తిరుమలకు రమ్య'కృష్ణ'
తిరుమల : ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కుటుంబ సమేతంగా తిరుమల విచ్చేశారు. గురువారం వీఐపీ బ్రేక్ దర్శనంలో కృష్ణవంశీ, రమ్యకృష్ణ దంపతులు కుమారుడు రిత్విక్తో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కృష్ణవంశీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకునేందుకు వస్తామన్నారు. 'రమ్యకు వెంకటేశ్వరస్వామి అంటే చాలా ఇష్టం. గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ జరుగుతుంది...దసరాకి విడుదల అవుతుంది' అని కృష్ణవంశీ తెలిపారు. ప్రస్తుతం బాహుబలి షూటింగ్ జరుగుతుందని, ఆ సినిమా తర్వాత ఇంకా ఏమీ అనుకోలేదని రమ్యకృష్ణ విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ రాజమాతగా నటిస్తున్నారు. కాగా ఆలయం బయటకు వచ్చిన రమ్యకృష్ణను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. కాగా కుమారుడితో కలిసి కృష్ణవంశీ, రమ్యకృష్ణలు తొలిసారి కెమెరాకు చిక్కారు. -
చిరంజీవిగారు ఈ సినిమా ఆపేయమనలేదు : నిర్మాత బండ్ల గణేశ్
‘‘మా సినిమాపై మీడియాలో వినిపిస్తున్నవన్నీ రూమర్లే. వాటిల్లో నిజాలు లేవు. ఇలాంటి రూమర్లు మాకు కొత్తేం కాదు. గతంలో ‘గబ్బర్‌సింగ్’ విషయంలో కూడా ఇలాగే జరిగింది. కానీ... అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ అఖండ విజయాన్ని అందుకున్నాం. త్వరలో మా ‘గోవిందుడు అందరివాడేలే’తో అదే ఫీట్‌ని రిపీట్ చేయబోతున్నాం’’ అని బండ్ల గణేశ్ అన్నారు. రామ్‌చరణ్ కథానాయకునిగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం విశేషాలు తెలుపడానికి శనివారం బండ్ల గణేశ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘రామ్‌చరణ్‌కి జర్వం రావడంతో ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్‌కి కొంత విరామం ఏర్పడింది. ఇందులో ప్రథమంగా చరణ్ తాతయ్య పాత్ర కోసం రాజ్‌కిరణ్‌ని తీసుకున్నాం. ఆయనపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం కూడా. రాజ్‌కిరణ్ అద్భుతంగా నటించారు. అయితే... ఆయన నటన తెలుగు నేటివిటీకి దూరంగా ఉందని అనిపించింది. అందుకే... ఆయన స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ని తీసుకున్నాం. ఈ చిన్న చిన్న అవాంతరాల కారణంగా చిత్రీకరణలో జాప్యం జరిగింది. అంతేతప్ప కొంద రు అనుకుంటున్నట్లు చిరంజీవిగారు ఈ చిత్రాన్ని ఆపేయమనలేదు. అసలు ఆయన ఈ సినిమా చూడనేలేదు’’ అని వివరించారు బండ్ల గణేశ్. మొదట వంద రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలనుకున్నామని, ఈ జాప్యం కారణంగా మరో ఎనిమిది రోజులు అదనంగా చిత్రీకరణ జరపాల్సి వస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేస్తామని బండ్ల గణేశ్ ప్రకటించారు. -
నిర్మాతలకు విలువనిచ్చే రోజులు రావాలి
‘‘గతంలో నిర్మాతలకు ఎంతో విలువ ఉండేది. కానీ, ఇప్పుడది లేదు. మళ్లీ నిర్మాతలకు విలువనిచ్చే రోజులు రావాలని కోరుకుంటున్నా. అలాగే చిత్రపరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు చంటి అడ్డాల. కళాదర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంటి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మూడు దశాబ్దాలకు పైగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న ఆయన పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ - ‘‘నరేష్ తనయుడు నవీన్‌ని హీరోగా పరిచయం చేస్తూ, ఓ సినిమా నిర్మించనున్నాను. కృష్ణవంశీ శిష్యుడు రామ్‌ప్రసాద్ రౌతు ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. ఓ ముక్కోణపు ప్రేమకథతో ఈ చిత్రం సాగుతుంది. నవీన్ ముంబయ్‌లో నటనపరంగా శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తాడు. ఇందులో ఇద్దరు కథానాయికలు. ఈ చిత్రంలోని ఆరు పాటలకు ప్రముఖ బాలీవుడ్ నృత్యదర్శకురాలు వైభవీ మర్చంట్ నృత్యాన్ని సమకూర్చనున్నారు. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అని చెప్పారు. ప్రేక్షకులను సంతృప్తిపరిచే సినిమాలు ఇవ్వాలన్నదే తన ఆకాంక్ష అని, నవీన్ సినిమా తర్వాత ఓ పెద్ద హీరోతో భారీ చిత్రం చేయాలనుకుంటున్నానని చంటి చెప్పారు. -
పల్లెటూళ్లో ఫారిన్ గోవిందుడు
రామ్‌చరణ్ తెరంగేట్రం చేసి ఏడేళ్లు. ఇప్పటికి ఆయన నటించిన ఏడు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో మగధీర, రచ్చ, నాయక్, ఎవడు... చిత్రాలు 45 కోట్ల రూపాయల షేర్ వసూలు చేశాయి. నేటి హీరోల్లో ఇది రికార్డే. తండ్రిలా మాస్ పల్స్ ప్రకారం నడవడం వల్లే ఈ క్రెడిట్ సాధించి ఉంటారు చరణ్. ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గోవిందుడు అందరివాడేలే’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఫారిన్లో పెరిగి పల్లెటూరికొచ్చిన ప్రవాసాంధ్రునిగా చరణ్ ఇందులో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ బాబాయ్‌గా శ్రీకాంత్ కనిపిస్తారు. ఆయనకు జోడీగా కమలినీ ముఖర్జీ నటిస్తున్నారు. తమిళ నటుడు రాజ్‌కిరణ్ ఇందులో చరణ్‌కి తాతగా కథకు కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం. కన్యాకుమారి, పొలాచ్చిల్లో భారీ షెడ్యూల్ ముగించుకొని ఈ చిత్రం యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ఏప్రిల్ రెండోవారం నుంచి 40 రోజుల పాటు భారీ షెడ్యూల్ జరుపనున్నారు. నేడు చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ ‘‘కుటుంబ బంధాలు, సంప్రదాయాల నేపథ్యంలో సాగే చక్కని వినోదాత్మక చిత్రంగా కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ తీసిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. కన్నుల పండువగా ఈ చిత్రం ఉంటుందని నమ్మకంగా చెప్పగలను. చరణ్, కాజల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, రాజ్‌కిరణ్.. ఇలా తారాగణం అంతా ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నారు. ఏప్రిల్ రెండోవారం నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాం. రామానాయుడు సినీ విలేజ్‌లో వేసిన ఇంటి సెట్లోనూ, ఆర్ఎఫ్సీలోనూ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నాం. ఆ తర్వాత విదేశాల్లో పాటల చిత్రీకరణ ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: తమన్. -
రాంచరణ్-కృష్ణవంశీల మల్టిస్టారర్ ప్రారంభోత్సవం