నిర్మాతలకు విలువనిచ్చే రోజులు రావాలి
‘‘గతంలో నిర్మాతలకు ఎంతో విలువ ఉండేది. కానీ, ఇప్పుడది లేదు. మళ్లీ నిర్మాతలకు విలువనిచ్చే రోజులు రావాలని కోరుకుంటున్నా. అలాగే చిత్రపరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు చంటి అడ్డాల. కళాదర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంటి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మూడు దశాబ్దాలకు పైగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న ఆయన పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ - ‘‘నరేష్ తనయుడు నవీన్‌ని హీరోగా పరిచయం చేస్తూ, ఓ సినిమా నిర్మించనున్నాను.
కృష్ణవంశీ శిష్యుడు రామ్‌ప్రసాద్ రౌతు ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. ఓ ముక్కోణపు ప్రేమకథతో ఈ చిత్రం సాగుతుంది. నవీన్ ముంబయ్‌లో నటనపరంగా శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తాడు. ఇందులో ఇద్దరు కథానాయికలు. ఈ చిత్రంలోని ఆరు పాటలకు ప్రముఖ బాలీవుడ్ నృత్యదర్శకురాలు వైభవీ మర్చంట్ నృత్యాన్ని సమకూర్చనున్నారు. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అని చెప్పారు. ప్రేక్షకులను సంతృప్తిపరిచే సినిమాలు ఇవ్వాలన్నదే తన ఆకాంక్ష అని, నవీన్ సినిమా తర్వాత ఓ పెద్ద హీరోతో భారీ చిత్రం చేయాలనుకుంటున్నానని చంటి చెప్పారు.