Balakrishna Movie: Producer Ravinder Reddy Sensational Comments On Akhanda - Sakshi
Sakshi News home page

Miryala Ravinder Reddy: 'అఖండ'కు సీక్వెల్‌ తీయాలనుంది: నిర్మాత రవీందర్ రెడ్డి

Published Tue, Dec 28 2021 7:28 PM | Last Updated on Tue, Dec 28 2021 7:47 PM

Producer Ravinder Reddy Sensational Comments On Akhanda - Sakshi

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించి హిట్ సాధించిన చిత్రం అఖండ. బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషనల్‌లో వచ్చిన ఈ హ్యాట్రిక్‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో తమన్‌ బీజీఎం ప్రధాన ఆకర్షణగా మారింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. జయ జానకీ నాయక సినిమాతో నిర్మాతగా పరిచయమయ్యారు రవీందర్‌ రెడ్డి. తర్వాత అఖండ చిత్రాన్ని నిర్మించిన ఆయన భారీ హిట్‌ అందుకుని అగ్ర నిర్మాతగా ఎదిగారు. డిసెంబర్‌ 29న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఏంటో చూద్దాం.

ఆ నమ్మకంతోనే 'అఖండ' చేశాను
పెద్ద డైరెక్టర్, రేర్ కాంబినేషన్ అనే నమ్మకంతోనే అఖండ‌ సినిమాను చేశాను. ఒకప్పుడు ఒక్క డైరెక్టరే పది సినిమాలు చేసేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ దర్శకుడు ఒక సినిమాను చేయడమే కష్టం. స్టార్ హీరోలకు పది ప్లాఫులు వచ్చినా కూడా ఒక్క హిట్ వస్తే సెట్ అవుతుంది. స్టార్ హీరోకున్న అడ్వాంటేజ్ అదే. నేను అదే నమ్ముతా. బోయపాటి గారు మొదటి సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు అన్నీ చెప్పారు.

నాకు ముందే తెలుసు
అఖండ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుందని నాకు ముందే తెలుసు. ఈ విషయాన్ని చెబితే న‌మ్మ‌రేమో  కానీ నాకు మాత్రం మొదటి నుంచి నమ్మకం ఉంది. హీరో, దర్శకుడు ఎక్కడా కూడా మాట్లాడలేదు. సినిమా విడుదల కంటే ముందు నుంచి నేనే మాట్లాడుతూనే వచ్చాను. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. బాలకృష్ణ గారి అభిమానులకు కావాల్సిన మాస్ సాంగ్ కూడా ఉంది. అఘోర పాత్ర అద్భుతంగా వచ్చింది.

ఆ ఎంట్రీతో అందరూ ట్రాన్స్‌లోకి వెళ్లారు
అఖండ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాం. ప్రతీ ఒక్క సీన్ అద్బుతంగా ఉంటుంది. నాలుగు రోజుల్లోనే బయ్యర్స్ బయటపడతారని అనుకున్నాను. ఓవర్సీస్‌లో ఆడుతుందా? లేదా? అని ఆలోచించలేదు. ఎప్పుడు విడుదల చేసినా కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుందని నమ్మకంగా ఉండేది. ఇది కేవలం బాలకృష్ణ సినిమా అని అభిమానులు చూడలేదు. అఘోర పాత్ర ఎంట్రీతో అందరూ ఆ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు. 

అందరితో సినిమాలు చేస్తాను
స్టార్ హీరోలతోనే అని కాదు అందరితోనూ సినిమాలు చేస్తాను. కథలు కుదిరితే అందరితో చేస్తాను. అఖండ సినిమా విషయంలో దాదాపు అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. మా సినిమా విడుదల విషయంలో ప్రభుత్వం కొంత సపోర్ట్ చేసింది. త్వరలోనే అన్ని సమస్యలు తొలగిపోతాయని ఆశిస్తున్నాం.

సీక్వెల్‌ తీయాలనుంది
బోయపాటి గారి రాబోయే సినిమాల్లో నేను భాగస్వామిని అవుతానా? లేదా? నేను చెప్పలేను. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనే కోరిక నాక్కూడా ఉంది. ఒక వేళ హిందీలో రీమేక్ చేయాలనుకుంటే.. ఇలాంటి పాత్రలకు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ వంటి హీరోలు అయితే బాగుంటుంది.

కొత్త హీరోతో సినిమా
వచ్చే ఏడాది మార్చిలో ఓ సినిమాను ప్రారంభిస్తాను. అందులో ఓ కొత్త హీరోను పరిచయం చేయబోతోన్నాను. ఒక పెద్ద సినిమా కూడా చర్చల దశల్లో ఉంది. ఇంకా కన్ఫామ్ కాలేదు. రాజకీయాలపై నాకు ఆసక్తి ఉంది. కానీ ఇప్పుడు అయితే నేను  ఏ పాలిటిక్స్‌లో లేను.

షూటింగ్‌ తర్వతా ఆయనతో మాట్లాడాను
సినిమా షూటింగ్ ముగిసిన తరువాత బాలకృష్ణ గారితో మాట్లాడాను. చాలా సహకరించారు.. థ్యాంక్స్ సర్ అని అన్నారు. లేదు లేదు మీరే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు, బాగా చేశారు అని బాలకృష్ణ గారు అన్నారు.

నా మైండ్‌లో తమనే ఉన్నారు
అఖండ సినిమా కథ విన్నప్పటి నుంచి కూడా మా మైండ్‌లో తమనే ఉన్నారు.  ఇలాంటి మ్యూజిక్ ఇస్తాడని నాకు ముందే తెలుసు. బాలకృష్ణ గారితో మనం చేస్తున్నాం.. నన్ను తొందరపెట్టొద్దు. పగలగొట్టేద్దామని తమన్ అన్నారు. తమన్ ఏం చెప్పారో దాని కంటే వంద రెట్లు  ఎక్కువ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్‌లో తమన్ పాత్ర చాలా ముఖ్యమైంది.

ఎలా మాట్లాడిన వివాదమవుతుంది
ప్రభుత్వాలు అనేవి ప్రజలకు ప్రాతినిధ్యంగా వహిస్తాయి. వ్యక్తులు, సంస్థల కోసం ప్రభుత్వాలు ప్రయారిటీ ఇవ్వవు. మా సినమా విడుదల సమయంలో సినిమా పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. అలాంటి సమయంలో నేను ఏమీ మాట్లాడకూడదని అనుకున్నాను. ఈ విషయం మీద ఎలా మాట్లాడినా కూడా వివాదంగానే మారుతుంది.

ఆ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లు
ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను పెట్టమని ఇండస్ట్రీ వాళ్లే అడిగారు. దాని వల పారదర్శకత ఉంటుందని అలా అడిగారు. బాలకృష్ణ కెరీర్ మొత్తంలో నైజాం ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇదే బెంచ్ మార్క్ అయ్యేలా ఉంది. దాదాపు అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవుతుంది.

రీటేక్స్‌ ఉండవు..
నేను సెట్‌కి వెళ్తే మానిటర్ పక్కన కూర్చుని చూస్తుంటాను. బాలకృష్ణ గారు అక్కడే కూర్చుంటారు. మేం ఇద్దరం మాట్లాడుకుంటాం. కానీ ఆయన ఏదో పెద్ద హీరో అన్నట్టుగా ప్రవర్తించరు. చాలా సింపుల్‌గా ఉంటారు. ఒక్కసారి షాట్‌లోకి వెళ్తే మారిపోతారు. పక్కన ఉన్నప్పుడు బాలకృష్ణ వేరేలా ఉంటారు.. సెట్స్ మీదకు వెళ్తే వేరేలా ఉంటారు. బాలకృష్ణ గారు ఒకసారి చేస్తే రీటేక్స్ అనేవే ఉండవు.

అలా చేయడం నాకు తెలీదు
అడ్వాన్స్‌లు ఇచ్చి బుక్ చేసుకోవడం నాకు తెలీదు. ఎవరైనా కథ చెబితే.. నచ్చితే.. దానికి తగ్గట్టు హీరోలకు వినిపించడమే అలవాటు. మున్ముందు నాకు కూడా అలా అడ్వాన్స్‌లు ఇచ్చేది అలవాటు అవుతుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement