కొడుకుతో తిరుమలకు రమ్య'కృష్ణ'
తిరుమల : ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కుటుంబ సమేతంగా తిరుమల విచ్చేశారు. గురువారం వీఐపీ బ్రేక్ దర్శనంలో కృష్ణవంశీ, రమ్యకృష్ణ దంపతులు కుమారుడు రిత్విక్తో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కృష్ణవంశీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకునేందుకు వస్తామన్నారు. 'రమ్యకు వెంకటేశ్వరస్వామి అంటే చాలా ఇష్టం. గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ జరుగుతుంది...దసరాకి విడుదల అవుతుంది' అని కృష్ణవంశీ తెలిపారు.
ప్రస్తుతం బాహుబలి షూటింగ్ జరుగుతుందని, ఆ సినిమా తర్వాత ఇంకా ఏమీ అనుకోలేదని రమ్యకృష్ణ విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ రాజమాతగా నటిస్తున్నారు. కాగా ఆలయం బయటకు వచ్చిన రమ్యకృష్ణను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. కాగా కుమారుడితో కలిసి కృష్ణవంశీ, రమ్యకృష్ణలు తొలిసారి కెమెరాకు చిక్కారు.