అది బాబాయ్ మీద ఆధారపడి ఉంది!
‘‘ఎవరైనా ఎక్కడైనా మంచి పని చేస్తే.. దాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయండి. మంచి పనులు చేసినవాళ్లను ఎంపిక చేసి నాన్నగారి 150వ సినిమా సెట్‌లో కలిసే అవకాశం కల్పిస్తాం. సమాజానికి ఉపయోగపడేలా మంచి పనులు ఏం చేస్తే బాగుంటుందో? మాకు సలహా ఇవ్వండి’’ అని రామ్‌చరణ్ అన్నారు. గురువారం ఫేస్‌బుక్‌లో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు చరణ్ సమాధానాలిచ్చారు. వాటిలో కొన్ని విశేషాలు... నాన్నగారి 150వ చిత్రం టైటిల్ ‘కత్తిలాంటోడు’ కాదు. మంచి టైటిల్ కోసం అన్వేషణ జరుగుతోంది.
ఆగస్టులో ఆ టైటిల్ ప్రకటిస్తాం. ఒకవేళ నాన్నగారు, దర్శకుడు వీవీ వినాయక్ నటించమంటే.. 150వ చిత్రంలో ఏదైనా పాటలో కనిపిస్తాను. మంచి కథ దొరికితే కల్యాణ్ బాబాయ్‌తో కలసి నటించడానికి నేనెప్పుడూ రెడీ. బాబాయ్ నిర్మాణ సంస్థలో నేను హీరోగా నటించే చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశముంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హిమ్.. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ‘ధ్రువ’ ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 15న, చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం.
కాశ్మీర్‌లో నాన్నగారి నలభై సినిమాల షూటింగులు జరిగాయి. ‘ధ్రువ’ కోసం కాశ్మీర్‌లో షూటింగ్ చేయడం హ్యాపీగా అనిపించింది. వీలయితే కుటుంబంతో కాశ్మీర్ వెళ్లండి. బాగా ఎంజాయ్ చేస్తారు. సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రారంభించాలని అనుకుంటున్నాం. గౌతమ్ మీనన్ చిత్రాలంటే బాగా ఇష్టం. ఆయనతో ఓ చిత్రం చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఏఆర్ మురుగదాస్‌తోనూ సినిమా చేయాలనుంది. కచ్చితంగా ఇద్దరితోనూ పని చేస్తా. నాకు అభిమాన నటుడంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి నటన నచ్చుతుంది మహేశ్ బాబు అద్భుతమైన నటుడు, వెరీ గుడ్ లుకింగ్ పర్సన్. ప్రభాస్.. మంచి స్నేహితుడు, లవింగ్ పర్సన్.