ప్రముఖ హీరోలు పారితోషికాలు తగ్గించుకోవాలి
తమిళసినిమా: ప్రముఖ హీరోలు పారితోషికం తగ్గించుకోవాలని యువ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ అంటున్నారు. మొదట్లో కమలహాసన్, సూర్య వంటి ప్రముఖ కథానాయకులతో చిత్రాలు నిర్మించిన ఈయన ఆ తరువాత తనే హీరోగా మారి సొంతంగా చిత్రాలు తీసుకుంటున్నారు. తాజాగా గెత్తు చిత్రంతో సంక్రాంతికి తెరపైకి రానుంది.
ఇప్పటి వరకూ ప్రేమ,హాస్యం ప్రధాన ఇతి వృత్తాలుగా చిత్రాలు చేస్తూ వచ్చిన ఉదయనిధి స్టాలిన్ ఈ గెత్తు చిత్రం ద్వారా తొలిసారిగా యాక్షన్ హీరో అవతారం ఎత్తారు. ఈ సందర్భంగా ఆయనతో చిన్న భేటీ..
ప్ర: ఇప్పటి వరకూ ప్రేమను, విరోదాన్ని నమ్ముకున్న మీరు ఇప్పుడు యాక్షన్ చిత్రాలపై దృష్టి పెట్టారు. ఇక ఇలానే కంటిన్యూ అవుతారా?
జ: నాకు నచ్చిన కథా చిత్రాలు చేస్తున్నాను అంతే. ఇక గెత్తు చిత్రం విషయానికి వస్తే నన్భేండా చిత్రం చేస్తున్న సమయంలో దర్శకుడు ఏఆర్.మురుగదాస్, తిరుకుమరన్ నాకీ చిత్ర కథ చెప్పారు. కథ నచ్చడంతో వెంటనే చేద్దాం అన్నాను.
ప్ర: అంత కీలకంగా ఉండే ఆ పాత్ర గురించి?
జ: అన్యాయాన్ని సహించని పాత్ర సత్యరాజ్‌ది. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్లి దాన్ని అడ్డుకుంటారు. అలాంటి ఆయన ఒక సమస్యలో చిక్కుకుంటారు. దాని నుంచి ఎలా బయట పడ్డారన్నదే చిత్రం. చిత్రంలోని ఒక ఛేజింగ్ సన్నివేశాన్ని దర్శకుడు ఎనిమిది రోజులు చిత్రీకరించారు. గెత్తు చిత్రం పూర్తిగా చూసి ఏఆర్.మురుగదాస్ బాగుందని చెప్పడంతో మేమూ విజయంపై నమ్మకంతో ఉన్నాం.
ప్ర: ఇక చిన్న చిత్రాలు నిర్మించరా ?
జ: నేను చేసిన కొన్ని చిన్న చిత్రాలు ప్రేక్షకాదరణ పొందలేదు. వాటికి వినోదపు పన్ను రాయతీలు అందకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. భారీ చిత్రాలు చేద్దామంటే పెద్ద హీరోలు నటించడానికి ముందుకు రాని పరిస్థితి. హీరోగా నాకంటూ ఒక మార్కెట్ ఉంది. అం దుకే నేనే కథానాయకుడిగా నటిస్తూ సొంతంగా చిత్రాలు నిర్మించుకుంటున్నాను. ఇంకో విషయం ఏమిటంటే చిత్ర పరిశ్రమ నష్టాల్లోనే నడుస్తోంది.పరిశ్రమ మనుగడ కోసం అయినా ప్రముఖ హీరోలు, సాంకేతిక నిపుణులు తమ పారితోషికాలను తగ్గించుకోవాలి.
ప్ర:తదుపరి హింది చిత్ర రీమేక్‌కు సిద్ధం అవడానికి కారణం?
జ: గెత్తు చిత్రం తరువాత అహ్మద్ దర్శకత్వంలో ఇదయం మురళి చిత్రం చేయాల్సింది. అది పూర్తిగా విదేశాలలో షూటింగ్ నిర్వహించాలి.బడ్జెట్ ఎక్కువ అవుతోంది.అందుకే చిన్న బడ్జెట్‌లో కథ ఉంటే చెప్పమని దర్శకుడిని అడిగాను.అప్పుడాయన ఒక హిందీ చిత్రం సీడీ ఇచ్చి చూడమన్నారు.ఆ చిత్రం నచ్చడంతో చేయడానికి సిద్ధమయ్యాం.
ప్ర:నిర్మాతల మండలి వంటి సంఘాలపై ఆసక్తి చూపడం లేదే?
జ: నిజం చెప్పాలంటే నిర్మాతల మండలి తనకు ఎలాంటి సాయం చేయలేదు. నా చిత్రాల వినోదపు పన్ను కోసం పోరాడుతున్న నాకు ఎలాంటి ప్రోత్సాహం అందించలేదు. వారి సాయం నేను కోరనూలేదు. ఈ విషయంలో నేను కోర్టు ద్వారానే పోరాడుతున్నాను.
ప్ర: ఎలాంటి పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు?
జ: విభిన్న పాత్రలో నటించాలన్నదే నా కోరిక. ప్రతి నాయకుడి చాయలున్న పాత్రలోనూ నటించాలని ఆశిస్తున్నాను.