పొలిటికల్, క్రైమ్కు సంబంధించి ఎలాంటి పెద్ద ఘటనలను వదిలిపెట్టడం లేదు బాలీవుడ్. ఇప్పటికే బాంబు పేలుళ్లు, ఉగ్ర దాడులు, రాజకీయ నాయకుల కథలతో సినిమాలు తీసిన బాలీవుడ్ దర్శక నిర్మాతలు, తాజాగా అంతర్జాతీయ మీడియాను ఆకర్షిస్తున్న ఓ అండర్ వరల్డ్ డాన్ కథతో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. 20 ఏళ్ల పాటు ముంబై చీకటి సామ్రాజ్యాన్ని ఏలి, ఇటీవలే పోలీసులకు పట్టుబటిన మాఫియా కింగ్ ఛోటారాజన్ జీవితాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. హుస్సేన్ జైదీ రచించిన 'బైకుల్లా టు బ్యాంకాక్' నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించడానికి సిద్ధమవుతున్నాడు దర్శకుడు సంజయ్ గుప్తా. గతంలో జైదీ రాసిన 'డోంగ్రీ టు దుబాయ్' ఆధారంగా కూడా బాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలు వచ్చాయి. షూటౌట్ ఎట్ వడాలా లాంటి సినిమాలకు ఆ పుస్తకమే ఆధారం. ప్రస్తుతం బాలీవుడ్లో బయోగ్రాఫికల్ సినిమాలు మంచి విజయాలు సాధిస్తుండటంతో ఛోటారాజన్ లైఫ్ హిస్టరీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా దేశభక్త డాన్గా పేరున్న ఛోటా జీవితంలో హీరోయిజం కూడా పుష్కలంగా ఉండటంతో సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్గా ఉన్నారు.
ఈ సినిమాలో ఛోటారాజన్ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించనున్నాడు. గతంలో కూడా పలు చిత్రాల్లో డాన్ తరహా సీరియస్ పాత్రలు చేసిన అభిషేక్, ఛోటా రాజన్ పాత్రకు పూర్తి న్యాయం చేయగలడని భావిస్తున్నారు. అంతేకాదు, అభిషేక్కి బయోగ్రఫికల్ మూవీస్లో నటించిన అనుభవం కూడా ఉంది. ధీరుబాయ్ అంబానీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన గురు సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.
ఛోటారాజన్‌గా అభిషేక్ బచ్చన్
Published Tue, Nov 10 2015 9:07 AM | Last Updated on Mon, Aug 20 2018 2:14 PM
Advertisement