సినిమాగా సినిమా పుస్తకావిష్కరణ
సీనియర్ జర్నలిస్ట్ నాదెండ్ల నందగోపాల్ రచించిన ‘సినిమాగా సినిమా’ పుస్తకావిష్కరణ యువకళావాహిని ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డా. సి.నారాయణరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి విచ్చేసిన అతిథులకు అందించారు. ‘సినిమాగా సినిమా’ అనే పేరే విచిత్రంగా ఉందని, నందగోపాల్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని సినారె అన్నారు. నందగోపాల్‌తో చెన్నయ్‌నాటి పరిచయాన్ని డి.రామానాయుడు గుర్తు చేసుకున్నారు. తన సినీజీవితంలో నందగోపాల్ మరిచిపోలేని వ్యక్తి అని ఈ సందర్భంగా ఆయనన్నారు. ‘‘ఈ బుక్ రాసింది నేనే అయినా... రాయడానికి కారకులు మాత్రం పరుచూరి హనుమంతరావుగారు.
ఈ పుస్తకం పూర్తి చేయడానికి అయిదేళ్లు పట్టింది. అది కూడా ఆయన ప్రోద్భలంతో. హనుమంతరావు నాతో ఓ మాట అన్నారు. ‘నీకు తెలిసింది మట్టిలో కలిసిపోనీకు. నా చేతిలో పెట్టు’ అని. అందుకే... ఈ పుస్తకం రాశాను.. ఈ పుస్తకం ఆయన వెలిగించిన దీపం. అందుకే... ఆయనకే అంకితం ఇస్తున్నా’’ అని నందగోపాల్ చెప్పారు. పరుచూరి హనుమంతరావు, సారిపల్లి కొండలరావు, రమేష్‌ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ్, నన్నపనేని రాజకుమారి, కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, ఏఎస్ జయదేవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.