కోర్టుకెక్కిన టాప్ కమెడియన్
స్టాండప్ కామెడీ షోలతో టీవీ ప్రేక్షకులకు బాగా చేరువైన కమెడియన్ కపిల్ శర్మ.. బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ముంబైలోని గోరెగావ్ ప్రాంతంలో తన అపార్టుమెంటు విషయంలో బీఎంసీ అధికారులు లంచం అడిగారంటూ ప్రధానమంత్రినే ట్యాగ్ చేసి ఆయన చేసిన ట్వీట్ ఒక్కసారిగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. కపిల్ శర్మ అక్రమ కట్టడం కట్టారని, అందువల్ల దాన్ని కూల్చేయాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తేల్చిచెప్పారు.
పార్కింగ్ కోసం కేటాయించాల్సిన స్థలంలో అక్కడ కట్టడాలు కట్టారని, అందువల్ల అది అక్రమ నిర్మాణమని అన్నారు. ఈ నేపథ్యంలో కపిల్ శర్మతో పాటు బిల్డర్ మీద కూడా బీఎంసీ అధికారులు కేసు పెట్టారు. అయితే అపార్టుమెంటులో కొంత భాగాన్ని కూల్చేయాలన్న బీఎంసీ అధికారుల ఆదేశాలను సవాలుచేస్తూ కపిల్ శర్మ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.